ఏం చేస్తున్నారో మీకు తెలుసు - పగటి వేషాలు వేసుకొని రవీంద్ర భారతిలో నాటకాలు వేస్తున్నారు - డ్రామాలాడుతున్నారు.
    
    రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపేందుకు ప్రజల బాగోగులు చూసేందుకు రాత్రింబవళ్ళు శ్రమించవలసిన ఈ ప్రజా ప్రతినిధులు ప్రజల ఆర్తనాదాల్ని, ఆకలిబాధల్ని, అనావృష్టి పరిస్థితుల్ని గాలికొదిలేసి ఎయిర్ కండిషన్డ్ ఆడిటోరియమ్స్ లో నాటకాలేసుకుంటున్నారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే - నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట.  అది తెలుసుకున్న రోమ్ ప్రజలు నీరో చక్రవర్తికి ఎలా బుద్ది చెప్పారో చరిత్రలో స్పష్టంగా ఉంది. ఇక్కడ మనరాష్ట్రం తగల బడిపోతుంటే - మన ఎమ్.ఎల్.ఏ.లు, మంత్రులు నాటకాలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు - నీరో చక్రవర్తి చరిత్ర తిరిగి ఇక్కడ పునరావృతం కావటం ఖాయం.
    
    ఎంత అన్యాయం యిది? ఎంత ఘోరం యిది?
    
    రాష్ట్ర రాజధానిలో డ్రామాలాడుకొమ్మని పంపారా ప్రజలు - వీళ్ళను?
    
    ప్రజల సంక్షేమంకోసం తమ ప్రతిక్షణాన్ని వినియోగించాల్సిన ఈ ఎమ్.ఎల్.ఏ.లు, మంత్రులు గ్రీన్ రూమ్స్ లో రిహార్సల్స్ - స్టేజీలపై నాటకాలా? ఎంత విలువైన కాలాన్ని వీరు ఇలా వృధా చేస్తున్నారు? వళ్ళుకాలి ప్రజలేడుస్తుంటే- చుట్టకు నిప్పడిగే వీళ్ళను ప్రజలు క్షమించవచ్చా?
    
    అడుగంటిపోతున్న నాటక కళమీద ప్రేమేమో పాపం వీళ్ళకు?
    
    అట్టడుగు స్థాయికి దిగజారిపోతున్న రాష్ట్ర అభివృద్ధిమీద ఎవరికి ప్రేముండాలి?
    
    ప్రజలకేనేమో?
    
    వీళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే -
    
    మిమ్మల్ని మీరే బాగుచేసుకోండి-
    
    మమ్మల్ని మేం బాగుచేసుకుంటాం - అని.
    
    మనల్ని మనమే బాగుచేసుకుంటూ - వాళ్ళను వాళ్ళు బాగుచేసుకునేందుకు మాత్రం మనం పనీ పాటలు మానేసి వోట్లేసి వీళ్ళను గెలిపించి అసెంబ్లీకి పంపించాలి.
    
    రాష్ట్ర ప్రజలకు న్యాయం ప్రసాదించటానికి వచ్చిన గౌరవనీయులయిన హైకోర్టు న్యాయమూర్తులకు యిళ్ళు కేటాయించే సమయం వీళ్ళకు లేదు - కనీస సౌకర్యాలు కల్పించే టయిమ్ వీళ్ళకు లేదు.
    
    కాని -
    
    నాటకాలేసుకోడానికి మాత్రం టైముంటుంది.
    
    కరువు పరిస్థితుల్ని ఎదుర్కొని - ప్రజల్ని రక్షించేందుకు వీళ్ళకు టయిమ్ లేదు. కాని డ్రామాలాడుకోటానికి మాత్రం టైముంటుంది.
    
    భూకబ్జాలు జరుగుతుంటే పట్టించుకొని ప్రజలకు అన్యాయం జరగక్కుండా చూసే టయిమ్ వీళ్ళకు లేదు.
    
    కాని గ్రీన్ రూమ్స్ లో రిహార్సల్స్ చేసుకోటానికి మాత్రం టయిముంటుంది.
    
    ఇవి ఈ రాష్ట్రాన్ని పట్టి కుదుపుతున్న తుచ్చ రాజకీయాలు.
    
    ఇంకెలా ఈ రాష్ట్రం బాగుపడుతుంది? బాగుపడదు. బాగుపడాలంటే ఒకటే మార్గం - ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చటంలేదని తెలిసి మరుక్షణం - ప్రజల స్థలాల్ని ఎమ్.యల్.ఏ కాలనీల పేరిట వంతులు వేసుకు తింటున్నారని తెలిసిన మరుక్షణం - అభివృద్ధి పనుల గురించి పట్టించుకోకుండా నాటకాలేసుకుంటున్నారని తెలిసిన మరుక్షణం.....విదేశాలనుంచి వచ్చే విరాళాల్ని, తెచ్చే అప్పుల్ని దిగమింగుతున్నారని తెలిసిన మరుక్షణం.....
    
    ప్రజలకు ఈ ఎమ్.యల్.ఏలని, ఎమ్. పీల్ని వెనక్కు పిలిచి పదవిలోంచి దించే హక్కు ఉన్నప్పుడే.... అది కల్పించబడినప్పుడే ఈ రాష్ట్రమయినా, ఏ రాష్ట్రమయినా బాగుపడుతుంది.
    
    అప్పటివరకు - రాజ్యంగపరంగా అలాంటి హక్కు అవకాశం కల్పించబడనంతవరకు ఈ రాష్ట్ర ప్రజలకే కాదు - ఈ దేశప్రజలకే భవిష్యత్ లేదు.
    
    ఈ హక్కు కోసం పోరాడాలో - లేదో మీరే తేల్చుకోండి- ఇంకెన్నాళ్ళు మోసపోదామనుకుంటున్నారో మీరే తేల్చుకోండి - ఇక్కడ నెలకొన్న తుచ్చ రాజకీయాల్ని యింకెన్నాళ్ళు భరించాలనుకుంటున్నారో మీరే తేల్చుకోండి.
    
    "ఛీ... ఛీ... వీళ్ళు మనకు నాయకులా?
    
    వీళ్ళా మనల్ని పరిపాలించేది?
    
    ఆలోచించండి. మీరే బాగా అలోచించి మీరే తీర్పు చెప్పండి. ప్రజలదే ఆఖరి తీర్పు.
    
    మీ ఎమ్.ఎల్.ఏలు మీ నియోజక వర్గాలకు వచ్చినప్పుడు చెప్పులతో కొట్టి చెప్పుల దండలే వేస్తారో బానిసల్లా మారి పూలదండలే వేస్తారో మీరే తేల్చుకోండి...." అని ఒక్కక్షణం ఆగి బబ్లూ వేపు తిరిగి నిప్పులు చిమ్ముతున్నట్లుగా అన్నాడు.
    
    "టెల్ ద ట్రూత్..... బిఫోర్ ధ పీపుల్...." వేదిక చుట్టూ పోలీసులు.....ఎక్కడ ఏమాత్రం కదిలినా..... బబ్లూ దేహం తునాతునకలైపోతుంది.....
    
    బబ్లూ మాట్లాడడం ప్రారంభించాడు.
    
    సరిగ్గా ఇరవై నిమిషాలు.....
    
    ఒక్కొక్కటీ..... ఒక్కొక్కటీ - చెప్పుకుపోతున్నాడు - గవర్నర్, ప్రజలు....రాజకీయాల్లోని నగ్న స్వరూపం గురించి ఒక్కొక్క అంశం తెలుస్తుండడంతో విస్తుపోతున్నారు....
    
    "ఎస్... నేను చేసిన ఎన్నో హత్యలకు కారణం జనార్ధన్ ఠాగూర్ కానీ - నేను కొన్ని హత్యలు చేశాను..... సిన్సియర్ గా జగన్నాయకులు మర్డర్ ని టేకప్ చేసి, జర్నలిస్టు హత్యను వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించిన జెంటిల్ మెన్, సిన్సియర్ పోలీసు ఆఫీసర్ నిరంజనరావుకి నేను చాలా ఘోరం చేసాను. నిరంజనరావు కూతురు...." ఆ మాట ఇంకా బబ్లూ నోట్లోంచి రాలేదు.
    
    యూ బాస్టర్డ్..... ఎక్కడ్నుచొచ్చిందో తెలీదు అర్పణ-
    
    సుడిగాలిగా, తుఫానుగాలిలా వచ్చింది ఆమె డయాస్ మీదకు.
    
    పరుగు పరుగున రావడం..... బబ్లూ గుండెల్లోకి గురిపెట్టడం....
    
    అదే సమయంలో బబ్లూ ఎడం జేబులోంచి పవర్ ఫుల్ బాంబ్ ని పైకి విసిరేయడం.... క్షణాల్లో....
    
    అంతా విధ్వంసం....
    
    కానీ - అర్పణ గురి తప్పలేదు...... డెర్రింగర్ లోని బుల్లెట్స్ ఖాళీ అయిపోయాయి..... నెత్తురుముద్దలా బబ్లూ....
    
    అదే సమయంలో-