అవును.... ఎంతో జాగ్రత్తగా చూస్తేనే గానీ తెలీదు ఆ విషయం-నాలుగు వేపులా కార్నర్స్ లో గుండ్రంగా ఉండే భాగంలో వేసిన అతుకులు స్పష్టంగా కనిపించాయి.
    
    "తియ్యమంటారా?" తిరిగి అడిగాడు ఆ షాపతను.
    
    "జాగ్రత్తగా తీయగలవా!" అడిగాడు వంశీ.
    
    "అలాగే..." అంటూ కొంచెం దూరంలోనున్న మాట్లువేసే మనిషి దగ్గర కెళ్ళాడతను.
    
    ఆ వ్యక్తి పట్టకారుతో ఆ అతుకుల్ని విడదీయడానికి అరగంట పట్టింది.....
    
    సూర్యవంశీలో ఏదో టెన్షన్... నుదుటిమీద పడుతున్న చెమట.....ఎట్టకేలకు పుస్తకం కిందభాగం ఊడివచ్చింది-
    
    దాంట్లో - నలుచదరంగా మడిచిన చేతి రుమాలు. గబుక్కున ఆ చేతిరుమాల్ని విప్పాడు వంశీ - ఆ రుమాలు మడతల్లో అరచేతి వెడల్పులో ఉన్న బూడిదరంగు కాగితం కనిపించింది.
    
    ఆ పేపర్ మదతల్ని విప్పాడు సూర్యవంశీ...
    
    ఇంక్ పెన్నుతో ఒకే ఒక మాట రాసుంది. ఆ పేపర్ మీద అది - PRESS CLUB అంతే!
    
                                                  *    *    *    *    *
    
    ఒకపక్క ఉత్సాహం - రెండోపక్క నీరసం...
    
    కేసు ముందుకు జరగడానికి ప్రెస్ క్లబ్ అన్న క్లూ ఉపయోగపడుతుందన్న ఉత్సాహం - ప్రెస్ క్లబ్ అన్న వర్డ్ తప్ప, మరేం లేకపోవడం వల్ల నీరసం....ప్రెస్ క్లబ్ అంటే దేనికి క్లూ....? ఒకదానిమీద ఒకటి ఆలోచనలు..... బుర్ర వేడెక్కి పోతోంది.
    
    "ఏదీ లేకపోతే... డాడీ ఎందుకు రాస్తారు? అది డాడీ చేతిరాతే"
    
    ఇరానీ రెస్టారెంట్ లో కూర్చుని టీ తాగుతూ ఆలోచిస్తున్నారు ఇద్దరూ.
    
    ఇన్నాళ్ళకు దొరికిన ఏకైక క్లూ...
    
    ప్రెస్ క్లబ్
    
    ఎక్కడైతే జగన్నాయకులు చివరిసారిగా డ్రింక్ చేసాడో ఆ ప్రెస్ క్లబ్....! ఎక్కడైతే దారుణమైన హత్యా పథకానికి బలైపోయాడో ఆ ప్రెస్ క్లబ్!
    
    సడన్ గా సూర్యవంశీకి రబ్ జానీ చెప్పిన విషయం గుర్తుకువచ్చింది. రబ్ జానీ దగ్గరకు చనిపోవడానికి మూడ్రోజుల ముందొచ్చాడు జగన్నాయకులు. కొన్ని కాగితాలిచ్చి దాచమన్నాడు. మూడు గంటల తర్వాత తీసికెళ్ళిపోయాడు. అదే ఆయనను రబ్ జానీ ఆఖరు సారిగా చూడడం.
    
    ఆ పేపర్స్ ఏమిటి?
    
    ఆ పేపర్స్ ఎక్కడున్నాయి? ఆ పేపర్స్ లో ఏవుంది? సెన్సేషనల్ న్యూసా" ఏంటా సెన్సేషనల్ న్యూస్..... దేనికి సంబంధించి?    
    
    చైన్ క్వశ్చన్స్.....
    
    ఊహను, రూమ్ లో డ్రాప్ చేసి గుడ్ నైట్ చెప్పాడు వంశీ.
    
    "సీ యూ.... ఇన్ ధ మార్నింగ్...."
    
    "తప్పకుండా వస్తాను.... ఏం అలా అడుగుతున్నావ్...." ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు సూర్యవంశీ.
    
    "ఏం..... లేదు.....నీకు రేపు ఓ విషయం చెప్పాలి..... కాదు అడగాలి" ఊహ చిలిపి కళ్ళలో సీరియస్ నెస్.....
    
    "ఏం చెప్తావ్....?"
    
    "చెప్పను..... మంచి మూడ్ లో చేసి చూపిస్తాను...." బుంగమూతి పెడుతూ అంది ఊహ. నవ్వుతూ వెనక్కొచ్చి హీరో హోండా తీసాడు వంశీ.
    
                                                     *    *    *    *    *
    
    మరో ఇరవై నిమిషాల తర్వాత, ప్రెస్ క్లబ్ బాత్ రూమ్ లో ఉన్నాడు సూర్యవంశీ. అప్పుడు రాత్రి తొమ్మిది గంటలు దాటింది.
    
    జగన్నాయకులు తెల్సిన అందర్నీ కలిసి మాట్లాడాడు - ఎక్కడా ఏ కొత్త పాయింట్ లేదు!
    
    మరోగంటన్నర తర్వాత అక్కడ నుంచి బయటపడ్డాడు సూర్యవంశీ - ఏదో తెలీని నిరాశ-
    
    ఆలోచనలతోనే ఫ్లాట్ కి బయలుదేరాడు.
    
                                                *    *    *    *    *
    
    జూబ్లీహిల్స్ : రోడ్ నెం : 85
    
    బిల్డింగ్ లో అసహనంగా పచార్లు చేస్తున్నాడు రమేష్ చంద్ర.
    
    అదే సమయంలో లోనికొచ్చాడు బబ్లూ - బబ్లూని చూడగానే అంతెత్తున ఎగిరాడు రమేష్ చంద్ర.
    
    "చూశావా.... బబ్లూ.... ఆరోజు నువ్వు చేసిన పిచ్చిపని, ఈరోజు నిన్ను నిరంజనరావు రూపంలో వెంటాడుతోంది. టైమ్ వేస్ట్....నాది కాదు. నీది....దిసీజ్ క్రుషియల్ టైమ్ ఫర్ మీ...." ఆచ్చాదన లేని తెల్లటి రమేష్ చంద్ర రొమ్ము ఎగిరెగిరి పడుతోంది.
    
    "చెప్పండి... దుబాయ్ లో కలిసినప్పటి నుంచీ నేను మీతోనే ఉన్నాను.....మిమ్మల్నే నమ్మాను..... యూ ఆర్ మై ఫాదర్... మైగాడ్.... నా శక్తి యుక్తుల్ని మీ కోసమే ఇరవైనాలుగు గంటలూ ఉపయోగిస్తున్నాను...." నెమ్మదిగా అన్నాడు బబ్లూ.
    
    "ఎస్.... బబ్లూ..ఐ...నో దట్....గాడ్స్ డాగ్స్ కాకూడదు....నా లైఫ్ లో నా పధకాలెప్పుడూ ఫెయిల్ కాలేదు... ఎవర్ని, ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు-ఈ రోజు పోలీసు డిపార్టుమెంటు కన్ను నీ మీదే వున్నా ఏ ఒక్కడూ ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి ఎందుకు సాహసించడంలేదో.... భూకబ్జా జనార్ధన్ కుగానీ, నీగ్గానీ తెలీదు-దట్స్ మై పవర్... పవర్ - ప్లే-ఎనీ బడీ షుడ్ వెయిట్ ఫర్ హిజ్ ఓన్ టైమ్-ఆ టైమ్ వచ్చింది. వస్తుందని నాకు తెలుసు - కానీ - నిరంజనరావు వెనుకపడి, నీ ఎస్సైన్ మెంట్ ని నువ్వు మరిచిపోతున్నావ్- అది చెప్పడానికే పిలిచాను...."
    
    రమేష్ చంద్రని నమ్మే ఏకైక వ్యక్తి బబ్లూ.... బబ్లూ శక్తిమీద అపారమైన నమ్మకం కలిగిన వ్యక్తి రమేష్ చంద్ర.
    
    సిగరెట్ వెలిగించి గాఢంగా పఫ్ లాగి, దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగాడు బబ్లూ.
    
    "నా ఎగ్జిస్టెన్స్ ని దెబ్బతీసే శత్రువుని చంపడం నా హాబీ... చంపే ముందు ఆ ఎనిమీతో ఆడుకోవడం నా సరదా... సో..."
    
    ఆ మాటలకు వెంటనే అన్నాడు రమేష్ చంద్ర.
    
    "దిసీజ్ నాట్ టైమ్ ఫర్ ప్లేయింగ్ విత్ ఎనిమీ.... రిమూవ్ హిమ్ ఇమ్మీడియట్లీ... దెన్ కాన్ సెన్ ట్రేట్ ఆన్ ది మెయిన్ వర్క్-వాట్ ఐ ఎస్సైన్ డ్ యూ బిఫోర్..."
    
    "ఎస్... రమేష్ చంద్ర.... గివ్ మి ట్వంటీ ఫోర్ అవర్స్... మీకేం కావాలో అదిస్తాను..." కాన్ఫిడెంట్ గా అన్నాడు బబ్లూ.
    
    "కొన్ని పనులు ఇదే టైములో జరగాలి.... గుర్తుంచుకో..." గంభీరంగా అన్నారాయన.