ఆ మాటకు సర్రున సూర్యవంశీకి కోపం వచ్చింది.
    
    "పాప... బాబూ... కాదండీ... నే నడిగేది.... అసలు పేరు..."
    
    "ఏం పేరో... నాకెందుకయ్యా..." అసహనంగా అన్నాడాయన.
    
    "మెడికల్ కాలేజీ ఎం.బి.బి. ఎస్.... చేస్తోంది కదూ..."
    
    "ఎం.బి.బి.ఎస్.... చేస్తోందో.... లా చేస్తోందో నాకేం తెలుసయ్యా... ఎప్పుడో ఏడాదికి ఓసారి వచ్చేది.... వెళ్ళేది..."
    
    నెత్తికొట్టుకున్నాడు సూర్యవంశీ.
    
    "ఎప్పుడయినా, ఎక్కడైనా, ఆ అమ్మాయి మీకు కనిపిస్తే.... నాకు వెంటనే ఫోన్ చేస్తారా-" తన విజిటింగ్ కార్డ్ ని ఆయనకిస్తూ అన్నాడు వంశీ.
    
    ఆ కార్డ్ లో ఆఫీసు ఫోన్ నెంబర్ తో పాటు, తన హౌస్ ఓనర్ ఫోన్ నెంబర్ కూడా ఉంది.

    ఆ ప్రయత్నం అలా ఫెయిలయిపోతుందని అనుకోని సూర్యవంశీ ఒక్కసారి డీలా పడిపోయాడు.
    
    మరో ఆరుగంటలు గడిచిపోయాయి.
    
    ఇంకా మిగిలింది పద్దెనిమిది గంటలే!
    
    బెంగుళూరు మెడికల్ కాలేజీకి ఫోన్ చేశాడు....
    
    "ఫోన్ ద్వారా చెప్పలేం... పర్సనల్ గా రండి..." పర్సనల్ గా వెళ్ళి, కనుక్కోడానికి టైమ్ లేదు...    

    మనసంతా గజిబిజిగా అయిపోయింది....
    
    మరో ఐడియా...
    
    తనకొచ్చిన ఉత్తరాల్లోని పోస్టాఫీసు ముద్రకోసం ట్రై చేశాడు...
    
    అమీర్ పేట సబ్ పోస్టాఫీసు... వెంటనే అమీర్ పేట బయల్దేరాడు.
    
    "ఈ స్టాంప్ మందేనయ్యా... ఎవరు పోస్టుచేశారు... ఎప్పుడు చేసారంటే.... ఎలాగయ్యా.... కష్టం..."
    
    ఆ జవాబుతో పూర్తిగా నీరుకారిపోయాడు సూర్యవంశీ.
    
    మరో ఎనిమిది గంటలు గడిచిపోయాయి.
    
                                                         *    *    *    *    *
    
    టెలిఫోన్ బూత్ లోకి అడుగుపెట్టింది ఆ అమ్మాయి.
    
    రిసీవర్ని అందుకుని, ఓ నెంబర్ ని ప్రెస్ చేసింది.
    
    "హలో... వంశీగారిని ఒకసారి పిలుస్తారా..." మూడు నిమిషాల వెయిటింగ్.
    
    "హలో బాస్... హౌ ఆర్యూ... కనుక్కున్నారా..."
    
    ఆ ప్రశ్నకు వంశీ దగ్గర జవాబులేదు.
    
    "ఇంకో టెన్ అవర్స్ మాత్రమే... అది గుర్తుచెయ్యడానికే ఫోన్.... ఓ కే..." నవ్వుతూ ఫోన్ పెట్టేసి బూత్ మేన్ కి రూపాయిచ్చి, రోడ్డుమీదకొచ్చింది ఆ అమ్మాయి.
    
    సరిగ్గా అదే సమయంలో-
    
    తన పక్కన కదిలిన ఓ అమ్మాయి ఆకారానికి తల పైకెత్తి చూసి నిర్ఘాంతపోయాడు జగన్నాయకులు హవుస్ ఓనర్ ఊహ నేరుగా వెళ్ళి, ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో కూర్చోవడంతో గాభరాగా టెలిఫోన్ బూత్ వేపు పరుగెత్తాడు హవుస్ ఓనర్.
    
    మరో మూడు నిమిషాల తర్వాత సూర్యవంశీ లైన్లోకొచ్చాడు.
    
    "హలో... వంశీగారా... నేనండీ.... జగన్నాయకులు హవుస్ ఓనర్నీ.... జగన్నాయకులు కూతురు కన్పించింది... ఇక్కడే.... సోమాజీగూడా ఈనాడు పక్కసందు.... ఐస్ క్రీమ్ పార్లర్ లో ఉంది.... అర్జంటుగా వచ్చేయ్యండి...."
    
    ఇక్కడ ఫోన్ పెట్టెయ్యడం, అక్కడ సూర్యవంశీ ఆఘమేఘాల మీద బయలు దేరడం రెండూ ఒకే క్షణంలో జరిగిపోయాయి.
    
    సరిగ్గా ఇరవై నిమిషాలు గడిచాయి....
    
    హీరో హోండా దూరంగా కనిపించడంతో చప్పట్లు కొట్టాడు జగన్నాయకులు హౌస్ ఓనర్...
    
    "ఇంకా ఆ పిల్ల అక్కడే ఉంది...."
    
    ఐస్ క్రీమ్ పార్లర్ కి కొంచెం దూరంలో ఉన్న పాన్ షాప్ దగ్గర హీరో హోండాని ఆపి వెయిట్ చేస్తున్నారిద్దరు.
    
    మూడు నిమిషాలు గడిచాయి.
    
    పార్లర్ లోంచి బయటికొచ్చింది ఆ అమ్మాయి.
    
    స్నఫ్ కలర్ కుర్తా, పైజామాలో
    
    తనతో ఛాలెంజ్ చేసిన అమ్మాయి...
    
    గబుక్కున కిందకు వంగి, సిగరెట్ నాలికను తీసి పెన్ను తీసుకుని-
    
    "మిస్... నువ్వు జగన్నాయకులు కూతురుపని తెలిసిపోయింది...అందుకు ఈ కాగితం నీకిస్తున్న వ్యక్తే సాక్ష్యం....పార్టీ ఎయిట్ అవర్స్ లోపలే నిన్ను పట్టుకొన్నాను... ఓకే..." గబ, గబా రాసి హౌస్ ఓనర్ చేతికిచ్చాడు.
    
    "చూడండీ... ఈ లెటర్ ఇచ్చేసి మీరెళ్ళిపొండి.... థాంక్స్ ఫర్ యువర్ కోపరేషన్..." అన్నాడు వంశీ కృతజ్ఞతగా.
    
    ఆయనా కాగితాన్ని అందుకుని ముందుకు నడిచాడు.
    
    అదే సమయంలో, ఆటో ఆమె ముందు ఆగడం, హవుస్ ఓనర్ పరుగెత్తి ఆ కాగితాన్ని ఆమె కివ్వడం, పాన్ షాప్ పక్కనున్న సందులోంచి సూర్యవంశీ వెళ్ళిపోవడం చక, చకా జరిగిపోయాయి. ఆ లెటర్ని అందుకుని, ఆ మాటల్ని చదువుకున్న ఊహ ఒక్కసారిగా విస్తుపోయింది.
    
    ఆమె ఎర్రటి పెదవుల మీద తెల్లటి పున్నాగ పువ్వులా నవ్వు మెరిసింది.
    
    "థాంక్యూ" హవుస్ ఓనర్ కి చెప్పింది. వెంటనే ఆటో ముందుకు కదిలింది.
    
    అక్కడ అదే సమయంలో - ఎవరూ ఊహించని ఒక విషయం జరిగిందని సూర్యవంశీకి గానీ, ఆ అమ్మాయికి గానీ తెలీదు.
    
    ఆ పార్లర్ కు ఎదురుగా ఉన్న ఓ బ్యాంక్ ముందు పార్క్ చేసున్న ఎర్రటి మారుతీ కారులో ఆ అమ్మాయి కోసం చాలా రోజులుగా వెంటాడుతున్న ఒక వ్యక్తి కూర్చున్నాడని-
    
    క్లోజ్ చేసిన విండో మిర్రర్ వెనక, బైనాక్యులర్స్ తో అంతా గమనించాడని ఎవరికీ తెలీదు.
    
    "డ్రైవర్ ఆటోవెనక కారు పోనీ...." చెప్పాడతను.
    
    అదే సమయంలో అతని పైపంటికున్న స్టీల్ రాడ్ చిత్రంగా మెరిసింది!
    
    అతనా సమయంలో ఇద్దరి గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.
    
    ఆ ఇద్దరూ సూర్యవంశీ - ఆ అమ్మాయి.
    
                                                     *    *    *    *    *
    
    "ఏంటండీ బాబూ.... మీకీవేళ ఇన్ని ఫోన్లు వస్తున్నాయ్..." నవ్వుతూ అంది పరబ్రహ్మం మూడో కూతురు మీనా.
    
    రిసీవర్ అందుకున్నాడు సూర్యవంశీ.
    
    "కంగ్రాచ్యులేషన్స్..." ఆ గొంతును వెంటనే గుర్తు పట్టాడతను.
    
    మీరు జీనియస్ అని రుజువు చేసుకున్నారు.... చాలా కష్టపడినట్టున్నారుగా... ఫోన్లో విన్పిస్తున్న కోమలవైపు నవ్వు.
    
    "ముందు నాకేదో ఇస్తానన్నావుగా... దాని గురించి చెప్పు..."
    
    ఒక్క క్షణం మౌనం-