టాక్సీ స్టేషన్ వైపుకు వెళుతూంది. పక్కన కూర్చొని వెక్కివెక్కి ఏడుస్తున్న గౌరిని పరీక్షగా చూశాడు చంద్రం.

 

    నవ్వుతున్నప్పుడు అందరు ఆడవాళ్ళూ అందంగా వుండరు. కొందరు నవ్వుతుంటే ఏడుస్తున్నట్లుంటుంది. కొందరు నవ్వుతుంటే పెదవుల చివర్లకు కొక్కేలు తగిలించి రెండు వైపులనుంచీ లాగినట్లు ఉంటుంది. కొందరు నవ్వుతుంటే పై పెదవి పైకి మడతబడి ఎర్రటి చిగుళ్ళు కనిపిస్తాయి. కొందరు నవ్వుతుంటే పై పెదవి పైకీ, కింది పెదవి కిందకీ విరుచుకుని, పైనా కిందా చిగుళ్ళు కనిపిస్తూ, పండి పగిలిన కాబూలీ దానిమ్మ పండులా వుంటుంది ఆ నోరు. కాని ఏడుస్తున్న ప్రతి ఆడదీ అందంగానే వుంటుంది. బహుశా అందుకే ఆడది ఏడుస్తుంటే మగవాడు భరించలేడేమో! చంద్రం తన ఆలోచనకు తానే నవ్వుకున్నాడు.  

 

    "ఎందుకు ఏడుస్తావ్! ఏడుపు మానకపోతే టాక్సీనుంచి దింపేస్తాను" అన్నాడు చంద్రం, ఆ అమ్మాయి ఏడుపును మానిపించే ఉద్దేశంతో.

 

    గౌరి ఆ మాట వినగానే ఏడుపును దిగమింగుకోవటానికి ప్రయత్నించసాగింది. కొంగుతో ముఖం తుడుచుకొని తలవంచుకొని కూర్చుంది.  

 

    "నీ పేరేమిటి?"

 

    "గౌరి."

 

    చంద్రానికి ఆ పేరు ఎక్కడో విన్నట్లనిపించింది. కాని అంతగా పట్టించుకోలేదు.

 

    స్టేషన్ ముందు టాక్సీ ఆగింది. తన వెనకే దిగుతున్న గౌరిని చూసి "ఇక్కడే వుండు, సామాను పట్టించుకొస్తాను" అన్నాడు చంద్రం నవ్వుముఖంతో.  

 

    సామానుతో తిరిగివచ్చిన చంద్రం టాక్సీ డ్రయివర్ తో కొరిటిపాడు అన్నాడు. డ్రయివర్ అనుమానంగా చంద్రాన్నీ, గౌరిని మార్చి మార్చి చూసి ఏదో అర్థం అయినట్లు నవ్వుకున్నాడు. ఆ నవ్వు చంద్రానికి ఏదోగా అనిపించింది. జుగుప్సతో మనస్సు చికాకయింది.        

 

    కొరిటిపాడులో దాదాపు అందరూ బీదవాళ్ళే వుంటారు. తన వేష భాషలు చూసీ, గౌరి వేషం చూసీ డ్రయివర్ కు ఏదో అనుమానం కలిగినట్లుంది. ఆ ఆలోచన చంద్రానికి అసహ్యం కలిగింది. పక్కన  కూర్చొనివున్న గౌరిమీద చిర్రెత్తుకొచ్చింది. వీలయినంత త్వరలో వదుల్చుకోవాలని అనుకున్నాడు.

 

    టాక్సీ కొరిటిపాడు చేరింది. నగరంలో వింతమార్పు వచ్చినా ఆ బస్తీ మాత్రం చంద్రం చూసినది చూసినట్లే ఉంది. కాకపోతే కొంచెం శుభ్రంగా, పూరిఇళ్ళు కొంచెం మంచి దశలో కనిపిస్తున్నాయి. అంత పొద్దుటే ఆ బస్తీకి టాక్సీ రావటం చూసి పిల్లలూ, పెద్దలూ, అందరూ ఆశ్చర్యంతో బిలబిల్లాడుతూ వచ్చారు. పక్కన గౌరి లేకపోతే చంద్రం ఆ దృశ్యాన్ని ఎంతయినా ఆనందించి ఉండేవాడు. టాక్సీ ప్రకాశం ఇంటి ముందు ఆగింది. ఆ ఇల్లు చూడగానే మునుపటికంటే మెరుగ్గానే ఉంది అనుకున్నాడు చంద్రం.

 

    టాక్సీ దిగిన చంద్రం - తలుపు తాళం వేసి వుండటం చూశాడు. నిరాశతో మళ్ళీ టాక్సీ ఎక్కబోతున్న అతని చుట్టూ పిల్లలూ, ఒకరిద్దరు పెద్దలూ చేరారు.

 

    "ఓ రాజవ్వా! చూడు లీడరన్నకోసం ఎవరో వచ్చారు" అంటూ పిల్లలు కేకలు పెట్టసాగారు.

 

    "ప్రకాశం ఎక్కడకు వెళ్ళాడు?" అడిగాడు చంద్రం ఒక నడికారు మనిషిని.

 

    "కృష్ణ లంక వెళ్ళాడు బాబూ! అక్కడ వరదొచ్చి కొన్ని ఇల్లు పోయినయ్. ప్రకాశంబాబు అక్కడ సబబు, సందర్భం కనుక్కోటానికి వెళ్ళిండు." చెబుతూ చెబుతూ టాక్సీలో ఉన్న గౌరికేసి చూసి ఆగిపోయాడు ఆ పెద్దమనిషి.

 

    ఇంతలో దాదాపు అరవయ్ సంవత్సరాల వయస్సు భారంతో కొంచెం నడుం వంగివున్న బక్కపల్చని ముసల్ది వచ్చి తలుపు తాళం తీసింది. చంద్రం తన సామాను దించుకున్నాడు. టాక్సీ డ్రైవర్ కు డబ్బిచ్చి పంపించేశాడు. అన్ని కళ్ళూ గౌరినే చూస్తున్నాయి. గౌరికి అదంతా ఏమీ పట్టనట్టు లేదు. ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.  

 

    "లోపలకు వెళ్ళు" అన్నాడు చంద్రం చిరాగ్గా.

 

    రాజవ్వ అదోలా నవ్వటం గమనించాడు చంద్రం. ప్రాణం చచ్చిపోయింది. వయసులో ఉన్న అమ్మాయితో ఒక యువకుణ్ణి చూస్తే ఈ మనుషులకు వేరే ఇంక ఏమీ ఆలోచించటానికి ఉండదేమో!

 

    వాళ్ళ తప్పు మాత్రం ఏముందిలే! తను ఓ గొప్పింటివాడిలా కనిపిస్తున్నాడాయె. గౌరిలాంటి బీదపిల్లతో చూసి ఎవరైనా 'ఎక్కడనుంచో లేపుకొచ్చాడ'నే అనుకుంటారు. ఇలాంటి జంటను చూస్తే తను ఏమనుకుంటాడో?

 

    సామాను లోపలపెట్టి, వాల్చివున్న నులక మంచం మీద కూలబడ్డాడు చంద్రం.

 

    "నీళ్లు పట్టిఉన్నాయి. స్నానం చెయ్యండి బాబూ!" అంది ఎదురుగా వచ్చి నిల్చొన్న రాజవ్వ.

 

    గోడకు ఆనుకొని బిక్కముఖంతో కూర్చుని వున్న గౌరిని చూచాడు చంద్రం.  జాలివేసింది. "ముందు నువ్వెళ్ళి స్నానం చేసిరా గౌరీ!" అన్నాడు.

 

    గౌరి వెంటనే లేచి దొడ్లోకి వెళ్ళింది. అలా వెళుతున్న గౌరినే చూస్తున్నది రాజవ్వ.

 

    "ప్రకాశం ఎప్పుడొస్తాడు?" అడిగాడు చంద్రం రాజవ్వను.

 

    "ఇవ్వాలో రేపో వస్తాడు" అందామె.

 

    చంద్రం చిన్నగా రాజవ్వను కబుర్లలోకి దించాడు. ఆమె ద్వారా ప్రకాశం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు.

 

    ప్రకాశం నాన్న చనిపోయి ఆరేళ్ళయింది. ప్రకాశం తండ్రిపోగానే ట్రాన్స్ పోర్టు సర్వీస్ లో మెకానిక్ గా చేరాడు. పెళ్ళి చేసుకోలేదు. కాని ఊళ్ళోవాళ్ళ సమస్యలన్నీ అతని సమస్యలేనట! రాజకీయాల్లో ప్రవేశించి ఒకసారి జైలుకు వెళ్ళాడట. ఆ తరువాత ఉద్యోగం పోయిందట.

 

    "అయితే అవ్వా! ఇప్పుడు ప్రకాశం ఏం చేస్తున్నాడు?" అడిగాడు చంద్రం.

 

    "మెకానిక్కు పనేదో సొంతంగానే చేసుకుంటున్నాడు. దొడ్లోకి వెళ్లినప్పుడు చూడండి. షెడ్డులోనూ, దొడ్లోనూ అంతా ఇనుపసామాన్లే. సంపాదిస్తాడు బాగానే. కాని ఏం లాభం? చేతిలో చిల్లిగవ్వ ఉండదంటే నమ్ము బాబూ!"

 

    "ఏంచేస్తాడు వచ్చిన డబ్బంతా?"

 

    "ఇక్కడ ఇన్ని గుడిసెలు ఉన్నయ్యా! ఎక్కడ ఏ గుడిసెలో నూకలు లేకపోయినా ప్రకాశంబాబే ఆదుకుంటాడు. ప్రకాశం బాబే ఆళ్ళందరికి దేముడితో సమానం. ప్రకాశం 'ఊ' అంటే గుంటూర్లో ఉన్న పాటక జనం నిప్పుల్లో దూకుతారనుకోండి! లీడరుబాబు ఇల్లంటే చాలు - ఏ రిక్షావాడైనా, టాక్సీవాడైనా తీసుకొస్తాడనుకోండి!"

 

    "అయితే పెళ్ళెందుకు చేసుకోలేదు?"

 

    "అదేబాబూ! అందరం సెప్పీ సెప్పీ ఊరుకున్నాం. పెళ్ళి చేసుకుంటే సేవ చేయటానికి ఈలుండదంట! అయ్యో నా మతి మండిపోను! మాటల్లోనే పడిపోయాను. వంట చేస్తాను," అని లేవబోతున్న అవ్వను వారించాడు చంద్రం.

 

    "అక్కర్లేదవ్వా? హోటల్లో భోజనం చేసి, ఆ తరవాత  ఆ అమ్మాయిని అనాధ శరణాలయంలో చేర్పించాలి. ఆ తరవాత మా వాళ్ళందర్నీ చూసి ఏ రాత్రి కొస్తానో; తాళంచెవి నా కిచ్చి నువ్వెళ్ళిపో," అన్నాడు చంద్రం. గౌరి గురించి అలా చెప్పగానే కొంత భారం తగ్గినట్లనిపించింది చంద్రానికి.  

 

    రాజవ్వ తాళంచెవి యిచ్చి వెళ్ళిపోయింది.

 

    ప్రకాశం ఎలాంటి జీవితం గడుపుతున్నాడో అవ్వ మాటలద్వారా వూహించుకున్నాడు చంద్రం. అంత నిదానంగా, అమాయకంగా, పిరికివాడిలా ఉండే ప్రకాశం - ఎలా మారిపోయాడో ఊహించుకోటానికే ఆశ్చర్యంగా ఉంది.   

 

    ప్రకాశం తండ్రిని తను చూసి కృతజ్ఞతను తెలుపుకోలేకపోయాడు. తను నిజంగానే దురదృష్టవంతుడు.  

 

    చంద్రం ఆలోచిస్తూ నాలుగువైపుల దృష్టి సారించాడు. ఇల్లు రెండు నిట్టాళ్ళతో వేసిన పూరి ఇల్లే అయినా ఎంతో శుభ్రంగా ఉంది. మధ్య మట్టిగోడతో రెండు గదులుగా విభజించి ఉంది. ఒకటి వంటకూ సామానుకూ అయి ఉంటుంది. తను కూర్చొని ఉన్నది ప్రకాశం డ్రాయింగురూంలాగుంది. చిన్న టేబులు - చుట్టూ నాలుగు చెక్క కుర్చీలు ఉన్నాయి. గోడలోకి ఉన్న అలమరు నిండా దేశనాయకుల ఫోటోలు ఉన్నాయి.  

 

    యధాలాపంగానే లేచి పుస్తకాలున్న అలమారు దగ్గరకు వెళ్లాడు చంద్రం. కింద అరలో అన్నీ వారపత్రికలూ, దినపత్రికలూ వున్నాయి మొదటిసారిగా చేతికి అందింది గోర్కీ  'అమ్మ' ఇంకా కొన్ని గోర్కీ పుస్తకాలూ, చెకోవ్ పుస్తకాలూ, శ్రీశ్రీ మహాప్రస్థానం. టాల్ స్టాయ్ పుస్తకాలూ ఉన్నాయి. ప్రకాశం పుస్తకాలు చదివే అలవాటు అలవర్చుకున్నందుకు చంద్రానికి సంతోషం కలిగింది. ఆకస్మాత్తుగా తన మొదటి నవల "భగ్నప్రేమ" కనిపించింది. ఆశ్చర్యం వేసింది. ఇతర పుస్తకాలను పట్టిచూస్తే ప్రకాశం ఎలాంటి భావాలు కలవాడో అర్థం అవుతుంది. ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాడో తెలుస్తూనే ఉంది. కాని ఆ గ్రంథాల మధ్య తన పుస్తకం ఉండటం ఆశ్చర్యంగానే ఉంది. అది తన చిన్ననాటి స్నేహితుడు రచించిందని గ్రహించి వున్నాడేమో?