"పోనీ నలభై వేలివ్వు"

 

    "నా దగ్గర పైసా లేదు"

 

    "అయితే నువ్వు రాజకీయ నాయకుడివే"

 

    "ఈ సత్యమెలా కనిపెట్టావ్ మహానుభావా?" తలను గోడకేసి కొట్టుకోవడం ఆపి అడిగాడు కనకారావు.

 

    "ఒక పార్టీ అధికారం నుంచి దిగి కొత్త పార్టీ అధికారంలోకి రాగానే పాత పార్టీ ఖజానాను ఖాళీ చేసిందని, నిధులు చక్కబెట్టుకోవాలని కొత్త పార్టీ సెలవిస్తుందిగా... మరలా ఈ పార్టీ తరువాత ఎలక్షన్స్ లో ఓడిపోయి మరో పార్టీ అధికారంలోకి వస్తే అదీ అలాగే చెబుతోంది. మన దేశంలో ఏ పార్టీ అయినా ప్రజలకేదీ చేయదు. మరి ప్రజలు కడుతున్న కోట్లాది రూపాయల పన్నులు ఏమయిపోతున్నాయో? ప్రభుత్వ ఖజానాలు ఎందుకు ఖాళీ అవుతున్నాయో ఏ పరమాత్ముడికి తెలీదు. ఇలాంటి స్వార్థపరులకు, దౌర్భాగ్యులకు, నీచ రాజకీయ వేత్తలకు, పార్టీలకు ఓట్లేయడానికి పిచ్చి ప్రజలు పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరి నించుంటారు. ఎవరు మీటింగ్ పెట్టినా మందలా పోగయి, గొర్రెల్లా తలలూపి, వెర్రి వాళ్ళలా చప్పట్లు కొడతారు. వీళ్ళ కసలు ఓటు విలువ తెలుసా? తెలిస్తే గతంలో వందల కోట్లు సంపాదించుకున్న అవినీతిపరులకు ఓట్లేస్తారా? రౌడీలకు, గూండాలకు నీరాజనాలు పలుకుతారా? ఓట్లేయించుకోవడానికి నాయకుల కెలాగూ సిగ్గులేదు- వేసే వీళ్ళకయినా సిగ్గుండాలిగా?"

 

    "దొంగ వెధవలకి ఓట్లేసి గెలిపించిన జనాలకు సిగ్గులేదు. సరే, ఒప్పుకుంటాను. అయితే... దీనికి నేనేం చేయగలను చెప్పు? ఎందుకు నన్నిలా వేధిస్తావు?" పిచ్చివాడిలా అయిపోయాడు కనకారావు.

 

    "నాకెందుకో ఈ మధ్య రాజకీయ నాయకుల్ని చూసినా, రాజకీయాల గురించి విన్నా పిచ్చికోపం వస్తోంది"

 

    "నేను కాదుగా"

 

    "నువ్వు దొంగవెధవ్వి కదా..."

 

    "అయితే?"

 

    "దొంగ వెధవలంటే ఎవరు? రాజకీయ నాయకులేగా...?"

 

    "అట్లా పెట్టావా మెలిక మహానుభావా...? కోపగించుకున్నారు. తిట్టారు. చేసుకున్నవాడికి చేసుకున్నంత. లంచగొండులకు ఓట్లేస్తే వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకుంటారు. మధ్యలో నన్ను ఇరికించవద్దు. నీ కొడుకు చాలా బిజీగా వున్నాడు. క్షణం తీరికలేదు. అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. వస్తారా పోదాం?" ఆశగా, సహనంగా అడిగాడు కనకారావు.

 

    అతను వెంటనే సమాధానం చెప్పలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టు మౌనంగా వుండిపోయాడు.


                                                        *    *    *    *


    "విచిత్రమేమిటంటే డైమలర్, బెంజ్ నివాసాల మధ్య దూరం కేవలం వంద కిలోమీటర్లే అయినా ఎప్పుడూ ఆ ఇద్దరూ కలవలేదు.

 

    బెంజ్ వెస్ట్ జర్మనీలో మాన్ హెయిమ్ పట్టణంలో, డైమలర్ కేన్ స్టాట్ పట్టణంలో నివసిస్తూ ఎవరి వర్క్ షాపులు వాళ్ళు నిర్మించుకొని తొలి పెట్రోల్ ఇంజన్ కోసం నిరంతరం శ్రమించేవారు.

 

    మొత్తానికి 1886లోనే ఇద్దరూ విడివిడిగానే ఫస్ట్ పెట్రోల్ ఇంజన్ కార్లను కనిపెట్టడం జరిగింది. ప్రపంచంలోం మోటారు వాహనాలు సృష్టించిన మొదటి వ్యక్తులు వీళ్ళిద్దరే!

 

    1886లో లెదర్ బ్రేక్స్ తో తయారుచేసిన మూడుచక్రాల మోటారు వాహనాన్ని నడపడానికి ఒక కెమిస్ట్ షాప్ నుంచి క్లీన్ చేసిన ఫ్లూయిడ్ ని కొన్నాడు బెంజ్" సామంత్ చాలా ఇంట్రెస్టింగ్ గా, ట్రాన్స్ లో వున్నట్లుగా చెప్పుకుపోతుంటే అందరూ ఆసక్తిగా వింటున్నారు.

 

    చివరకు అర్జునరావు, పీటర్ లు కూడా వాళ్ళ పథకం గురించి తాత్కాలికంగా మర్చిపోయి సామంత్ చెప్పేది వినడంలో పూర్తిగా లీనమయి పోయారు.

 

    "బెంజ్ కనిపెట్టిన మోటార్ వెహికల్ దాదాపు విజయవాడలో తిరిగే రిక్షాలా వుండేది. వెనుక చక్రాలు పెద్దవిగా, ముందు చక్రం చిన్నదిగా వుండి, రిక్షా వెనుకభాగంలో ఇంజన్ వుండేది. ఆ ఇంజన్ నుంచి వెనుక వున్న రెండు చక్రాలకి రెండు చెయిన్స్ బిగించి వుండేవి. 230 కిలోగ్రాముల బరువు వుండే ఆ వెహికల్ పాయింట్ నైన్ హార్స్ పవర్ శక్తిని కలిగి, పాయింట్ నైన్ ఎయిట్ లీటర్ తో ఒక సిలిండర్ ఇంజన్ తో గంటకు 15 కిలోమీటర్లు వేగాన్ని అధిగమించేది.

 

    దాన్ని 3000 మార్క్స్ కి అమ్మేదుకు సిద్ధపడ్డారు బెంజ్ (20,000 డి.ఎమ్-80 వేల రూపాయలు) అది ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ దాన్ని ఆసక్తిగా చూసేవారే తప్ప కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

 

    అయినా బెంజ్ నిరుత్సాహపడకుండా తన పరిశోధనను కొనసాగిస్తూ 1893లో నాలుగు చక్రాల మోటార్ వాహనాన్ని సృష్టించి రోడ్ మీదకు తీసుకువచ్చాడు. దానికి బెంజ్ విక్టోరియా అని పేరు పెట్టాడు. అప్పటికీ అతని ప్రయోగాలకు ఆదరణ లభించలేదు. దాంతో బెంజ్ లోని పట్టుదల రెట్టింపయింది. మరో సంవత్సరానికి అంటే 1894 నాటికి బెంజ్ లెలో అనే పేరుతో లైట్ ఎకానమీ కారుని సృష్టించాడు.

 

    దీనికి రివర్స్ గేర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టూ ఫార్ వార్డ్ స్పీడ్ కలిగివున్న ఈ వాహనం 1.5 హార్స్ పవర్ ఇంజన్ ని కలిగి గంటకు 20 కిలోమీటర్లు వేగాన్ని అధిగమించగలిగేది. మూడు చక్రాల వాహనం కన్నా దీని వేగం అయిదు కిలోమీటర్లు ఎక్కువ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కమర్షియల్ గా ఎక్కువ సంఖ్యలో ఒక సిరీస్ గా రిలీజ్ అయిన కారు ఇదే.

 

    ఇదిలా వుండగా మరోవేపు బెంజ్ కి వ్యాపార శత్రువైన డైమలర్ కూడా రోజు రోజుకి తన పరిశోధనలో ముందడుగు వేయసాగాడు.

 

    డైమలర్ రొట్టెలు తయారుచేసి అమ్ముకొనే పేద కుటుంబంలో పుట్టాడు. చదువుకోవాలనే ఆసక్తి, తపనా వున్నా చదివించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని తెల్సుకొని యుక్తవయస్సు రాగానే ఎన్.ఎ.ఓటోన్ గేస్ మోటోరన్ ఫేబ్రిక్ లో కొంతకాలం పనిచేసి డబ్బు కూడబెట్టుకొని దాంతో స్టేషనరీ గేస్ పవర్డ్ ఇంజన్ ని కనిపెట్టాడు. 1882లో విల్ హేమ్ మే బాబ్ అనే యువ ఇంజనీర్ ని తోడుగా తీసుకొని తన పరిశోధనను మరింత ముమ్మరం చేశాడు.

 

    డైమలర్ కి గ్రీన్ ఫౌస్ పేరుతో ఒక ఇల్లుండేది. దాన్ని తన వర్క్ షాప్ గా మార్చుకున్నాడు. ఆ మరుసటి సంవత్సరానికే 900 ఆర్.పి.ఎం. శక్తిగల ఇంజన్ ని సృష్టించాడు.