సస్లీవాడియా అసాసినేషన్ కేసులో బొంబాయి పోలీసులు బబారియా అనే వ్యక్తిని ట్రేస్ చేసి అతనితో కీర్తి అంబానితో మాట్లాడించి ఆ టెలీఫోన్ కాల్ ని రికార్డు చేశారు. లక్షలకు లక్షలు తీసుకొని పని చేయించ లేకపోయావు. అవతల పెద్దవాళ్ళు నన్ను మందలిస్తున్నారంటూ కీర్తి అంబాని చేసిన హెచ్చరిక రికార్డు అయింది.
    
    బబారియా మిడిల్ మెన్ - థర్డుపార్టీ తనకు ఎక్కువ మిగుల్చు కొనేందుకు ఎమెచ్యూర్ కిల్లర్ ని మాట్లాడుకున్నాడు. అదే జాప్యానికి కారణమయింది. అసాసినేషన్ జరక్కుండానే బొంబాయి పోలీసులు బబారియాని అరెస్టు చేశారు.
    
    'సుపారీ కాంట్రాక్ట్' పేరిట కిరాయి హంతకుల శిబిరాన్ని బొంబాయిలో కొన్నాళ్ళ క్రితం స్థాపించారు. ఇందులో సభ్యులయిన కిరాయి గూండాలను హత్యలకు ఉపయోగిస్తుండేవారు. ఒక సీనియర్ క్రైం బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ ఈ ప్రొఫెషనల్ శిబిరాన్ని కనిపెట్టటంతో కథ బయటకొచ్చింది.
    
    నస్లీవాడియా ఆఫీసు బల్లార్డులో ఉంది. సాధారణంగా రాత్రి ఎనిమిది గంటలకు ఆయన ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరతాడు. ఆ ప్రదేశమంతా చీకటిపడితే చాలు నిర్మానుష్యమై పోతుంది.
    
    వాడియా తన కారులో ఆ ప్రాంతానికి రాగానే ఒక కారుని ఆయన కారుకు అడ్డంగా పెట్టి, వాడియా కారు దిగగానే షూట్ చేయాలని ప్లాన్ చేశారు.
    
    అయితే వాడియాను చంపి, ఆ తరువాత క్షేమంగా బయటపడే మార్గం తోచక హత్యని ఆలస్యం చేసారు. టి.పి. బబారియా ఎమెచ్యూర్ కిల్లర్ ని సెలెక్ట్ చేసుకోవటం మూలంగా జరిగిన ఆలస్యమిది. కంట్రీక్లబ్ అంటే ఈ సుపారి కాంట్రాక్ట్ లాంటిదే.
    
    ఇలాంటి ప్రమాదకరమైన శిబిరానికి చెందిన నలుగురు ప్రొఫెషనల్ కిల్లర్స్ మాస్టర్ ని అసాసినేట్  చేసేందుకు సిద్దమవుతున్నారు.
    
    అలాంటి శిబిరంలోకి కూడా చొచ్చుకుపోయేందుకు గల అవకాశాల్ని జాన్ మిల్లర్ చాలాకాలంగా పరిశీలిస్తున్నాడు. తన మనిషిని ఆ కారిడార్స్ లోకి ప్రవేశపెట్టి మాస్టర్ పై జరగబోయే హత్యా ప్రయత్నాల ఆచూకీని ముందే తెలుసుకోవాలని మిల్లర్ ఆలోచన.
    
    సరిగ్గా తెల్లవారుఝామున మూడు గంటలకి లీలా కంపెన్ స్కీ హోటల్ సూట్ నుంచి బయలుదేరిన వ్యక్తులిద్దరూ కంట్రీక్లబ్ కి చేరుకున్నారు.
    
                                                 *    *    *    *    *
    
    బ్యాంకాక్ లోని ఓబరాయ్ ఇంటర్నేషనల్ హోటల్ నుంచి ఓవర్ సీస్ కాల్ ఒకటి కంట్రీ క్లబ్ కి చెందిన ఒక నెంబర్ ని కేచ్ చేసేందుకు అరగంట నుంచి ప్రయత్నం జరుగుతోంది.
    
    మొత్తానికి తెల్లవారుఝామున మూడున్నర గంటలకు లైన్ దొరికింది.
    
    "పని మొదలెట్టారా...?" లిండాహాన్ కంఠంలో ఆసక్తి ధ్వనించింది.
    
    సరిగ్గా ఆ ఫోన్ కాల్ కోసమే ఎదురుచూస్తున్న జోహ్రా టక్కున సమాధానం ఇచ్చాడు.
    
    "మొదలెట్టాం. ఫలితం కోసం ఆతృత చెందకండి. ఈ జోహ్రా ఒక్క పనిని టేకప్ చేస్తే ఆ పనిని అప్పగించినవాళ్ళు నిశ్చింతగా ఉండవచ్చు. మరి డబ్బు?"
    
    "రేపు సాయంత్రం ఆరుగంటలకు మీ హోటల్ రూమ్ కి ఒక బ్రీఫ్ వస్తుంది. రిసెప్షన్ కౌంటర్ వాళ్ళు దాన్ని మీకు పంపిస్తారు. బీకేర్ ఫుల్ ఎబౌట్ మిల్లర్ అండ్ మాస్టర్. ముఖ్యంగా మిల్లర్ పట్ల.... మిల్లర్ ని తక్కువ అంచనా వేయకండి. ఉంటాను మరి" లిండాహాన్ ఫోన్ క్రెడిల్ చేసి ఛుండూ హాన్ కేసి ప్లెజెంట్ గా చూశాడు.
    
    జోహ్రా ఉత్సాహంగా తనకు కావల్సిన వస్తువుల గురించి ఓ స్లిప్ మీద రాసుకోసాగాడు. మంచి కండిషన్ లో ఉన్న జీప్ ఒకటి, కర్ణాటకకు చెందిన నెంబర్ ప్లేట్సు రెండు, ఢిల్లీ కి చెందిన నెంబర్ ప్లేట్సు రెండు, పాయింట్ త్రి ఎయిట్ రివాల్వర్ ఒకటి, థాంప్సన్ సబ్ మెషిన్ గన్ ఒకటి, నాలుగువేపులా వెలిగేలా ఉండే వెర్టికల్ బ్యాట్రీ లైట్ ఒకటి, నైలాన్ తాడ్లు రెండు, ఫియట్ టాక్సీ ఒకటి, ఔరంగాబాద్ జిల్లా నెంబర్ ప్లేట్సు రెండు, ఒక సెట్ గ్లాసెస్, లాంగ్ కోట్, హేట్, ఫాంట్, షూస్ అన్నీ నలుపురంగులోనే ఉండాలి. గ్రీజ్ డబ్బా, బ్యాట్రీలైట్.
    
    జోహ్రా తనకు కావలసిన వస్తువుల లిస్ట్ రాసుకున్నాడు. వాటన్నింటికీ జోహ్రా అద్దె కట్టవలసి ఉంటుంది. ఒకవేళ అసాసినేషన్ సందర్భంలో ఆ వస్తువుల్లో ఏదయినా పోయినా, డేమేజ్ అయినా, వాటికి కంట్రీ క్లబ్ క్రిమినల్ లాబీ నిర్ణయించే ధరల్ని పే చేయవలసి ఉంటుంది.
    
    ఆర్డినరీ పిస్టల్ దారే పాతికవేలతో ప్రారంభమవుతుంది. థాంప్సన్ సబ్ మెషిన్ గన్ అయితే రెండు లక్షల దాకా ఉంటుంది.
    
    లిస్టు రాయటం పూర్తికాగానే జోహ్రా దాన్ని తీసుకొని కంట్రీక్లబ్ బిల్డింగ్ వెనుకవేపుకు వెళ్ళాడు. అక్కడే అవసరమయిన వస్తువుల్ని అద్దెకు ఇచ్చే వ్యక్తి వుంటాడు. లిస్టు అతనికిచ్చి ఓ యాభైవేలు కేష్ అతనికి అందించాడు. క్రిమినల్ లావాదేవీల్లో సాక్ష్యాలు లేకుండా చూసుకోవటం వారి ప్రధమ లక్ష్యం నమ్మకం. రెండో ప్రధాన లక్షణం.
    
    ఆ ఇద్దరి మధ్య హిందీలో సంభాషణ జరిగింది కాసేపు.
    
    "ఎప్పటికి?" ఆ వ్యక్తి అడిగాడు.
    
    "రేపు సరిగ్గా మధ్యాహ్నం రెండుగంటలకు" జోహ్రా సమాధానమిచ్చాడు.
    
    "ఎవరు భాయ్?" కుతూహలం కొద్దీ అడిగాడా వ్యక్తి.
    
    "టైగర్" ఎక్కడో ఆలోచిస్తూ అన్నాడు జోహ్రా.
    
    "అదే.... ఎవరని?"
    
    "మాస్టర్ స్టేన్ లీ"
    
    "వ్వాట్?" అదిరిపడ్డాడా వ్యక్తి.
    
    "ఎస్"
    
    "పెద్ద చేపే"
    
    "అవును"
    
    "జాగ్రత్త మిల్లర్ అనే వ్యక్తి రక్షణలో అతను ఉంటున్నట్లు తెలిసింది. మిల్లర్ ఒకప్పటి ఎఫ్.బి.ఐ. ఆఫీసర్ స్కాట్ లాండ్ యార్డు, ఇంటర్ పోల్లో పని చేసిన అనుభవం ఉందతనికి. ఎందుకయినా మంచిది జాగ్రత్తగా ఉండు."
    
    "నా జాగ్రత్త కోసం చెబుతున్నావా? లేక నీ వస్తువులు..." అనుమానిస్తున్నట్లుగా అన్నాడు జోహ్రా.