ఫుట్ వేర్ నుండి జీన్స్ వరకు.. వర్షాకాలానికి పర్ఫెక్ట్ సెట్ అయ్యే ఫ్యాషన్ చిట్కాలు..!

వర్షాకాలం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఫ్యాషన్ సెన్స్ కు కూడా అంతే సవాలు విసురుతుంది. రోడ్లపై నీరు, బురద, తేమతో కూడిన వాతావరణం తరచుగా స్టైల్ గా తయారై వెళ్లడానికి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది అన్నట్టు.. ఇలాంటి వర్షాభావ పరిస్థితులలో కూడా ఫ్యాషన్ గా కనిపించడానికి పర్పెక్ట్ చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసకుంటే..
ఫుట్ వేర్..
వర్షం పడినప్పుడు ముందుగా శ్రద్ధ వహించాల్సినది పాదరక్షల గురించి. వర్షానికి ఫ్యాషన్ లెదర్ షూలు, క్లాత్ చెప్పులు పాడైపోతాయి. అందుకే వీటిని వాడకూడదు. వీటిని జాగ్రత్తగా దాటి పెట్టాలి. వర్షాలు పడుతున్న సమయంలో రబ్బరు లేదా PVC మెటీరియల్‌తో తయారు చేసిన చెప్పులు, ఫ్లోటర్లు లేదా క్రోక్‌లు మంచి ఎంపికలు. ఇవి త్వరగా ఆరిపోతాయి, పైగా జారిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
వర్షాకాలంలో జెల్లీ చెప్పులు, బూట్లు చాలా ట్రెండీగా ఉన్నాయి. రంగురంగుల జెల్లీ బూట్లు లేదా చెప్పులు దుస్తులకు అదనపు ఆకర్షణను ఇస్తాయి. పాదాలు తడిసిపోకుండా కాపాడతాయి. ఒకవేళ ఎక్కువ నీరు ఉన్న ప్రదేశంలో ఉంటే, ట్రెండీ రబ్బరు లేదా ప్లాస్టిక్ బూట్లు ధరించడం మంచిది. ఇవి పాదాలను సురక్షితంగా ఉంచడమే కాకుండా స్టైలిష్ లుక్ కూడా ఇస్తాయి.
దుస్తులు..
వర్షంలో బట్టల మెటీరియల్ చాలా ముఖ్యం. కాటన్, లినెన్, రేయాన్ లేదా త్వరగా ఆరిపోయే సింథటిక్స్ వంటి తేలికపాటి బట్టలను ఎంచుకోవాలి. డెనిమ్ లేదా మందపాటి కాటన్‌ను నివారించాలి. ఎందుకంటే ఇవి ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి తేమ కారణంగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
జీన్స్..
భారీ డెనిమ్ జీన్స్ వర్షంలో తడిసిన తర్వాత బరువుగా మారతాయి. ఇవి ఆరడానికి చాలా సమయం పడుతుంది, ఇది చర్మంపై దద్దుర్లు కలిగిస్తుంది. బదులుగా క్రాప్ ప్యాంటు, ప్లాంజో, ట్రాక్ ప్యాంటు లేదా తేలికపాటి ఫాబ్రిక్‌తో తయారు చేసిన షార్ట్‌లను ధరించడం మేలు. ప్రస్తుత మార్కెట్లలో రేయాన్ లేదా లైక్రా మిక్స్ మెటీరియల్‌తో తయారు చేసిన సన్నని జీన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి త్వరగా ఆరిపోతాయి.
రంగులు..
ముదురు రంగు దుస్తులను ఎంచుకోవడం చాలా బాగుంటుంది. ఉదాహరణకు నేవీ బ్లూ, నలుపు, ముదురు ఆకుపచ్చ లేదా మెరూన్. లేత రంగు దుస్తులపై బురద లేదా నీటి మరకలు ఎక్కువగా కనిపిస్తాయి. పొడవాటి దుస్తులు లేదా ప్లాంజోలకు బదులుగా, మోకాలి పొడవు లేదా కొంచెం ఎత్తులో ఉండే దుస్తులు, స్కర్టులు లేదా జంప్‌సూట్‌లను ధరించడం మేలు. ఇవి బురద, వర్షపపు నీటి నుండి రక్షిస్తాయి, దాంతోపాటు స్టైలిష్‌గా కూడా కనిపిస్తాయి.
రెయిన్ కోట్స్..
శైలికి అనుగుణంగా ట్రెండీ రెయిన్ కోట్స్ లేదా విండ్ చీటర్లను ఎంచుకోవాలి. ఈ రోజుల్లో అనేక డిజైనర్, స్టైలిష్ రెయిన్ కోట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి వర్షం నుండి కాపాడుతూ ఫ్యాషన్ లుక్ కూడా ఇస్తాయి.
మేకప్..
మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు వాటర్ ప్రూఫ్ కాజల్, లైనర్, మస్కారా ఉపయోగించాలి. బరువైన బేస్ లేదా ఫౌండేషన్‌ను నివారించాలి. అలాగే మెటల్ ఆభరణాలను నివారించాలి. ఎందుకంటే అవి తేమ కారణంగా దెబ్బతింటాయి లేదా స్కిన్ రియాక్షన్ కు అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్, రబ్బరు లేదా నీటి నిరోధక పదార్థాలతో తయారు చేసిన ఉపకరణాలను ధరించండి.
హెయిర్ కేర్..
వర్షంలో జుట్టు తడిస్తే అది పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో జుట్టును లూజ్ గా ఉంచే బదులు వాటిని పోనీటైల్, బన్ లేదా జడగా వేసుకోవాలి. ఇది జుట్టు తడి కాకుండా కాపాడుతుంది దానిని నిర్వహించడం సులభం అవుతుంది.
తేమ కారణంగా జుట్టు తరచుగా చిట్లుతుంది. యాంటీ-ఫ్రిజ్ సీరం లేదా స్ప్రే ఉపయోగించాలి. వర్షాకాలాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ.. స్టైల్ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదంటే.. ఈ చిట్కాలను పాటిస్తే సరి.
*రూపశ్రీ.


.webp)
