ప్రపంచంలో అత్యంత ఖరీదైన హీల్స్ గురించి తెలుసా...

 

ఒక జత బూట్లు లేదా హీల్స్ కొనడానికి  ఎంత డబ్బు ఖర్చు చేయవచ్చు? మహా అయితే 500, 1000, 10000 లేదా అంతకంటే కొంచెం ఎక్కువ కూడా. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హీల్స్ ధర వేల లక్షల కంటే చాలా ఎక్కువ. ఇది విన్నవాళ్లు నమ్మడానికి సంశయిస్తారు.  కానీ ఈ హీల్స్ డిజైన్,  మెరుపు చూస్తే మాత్రం కళ్లు తిప్పుకోలేరు.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హీల్స్ తయారు చేయడానికి చాలా విలువైన మెటీరియల్ ఉపయోగించారట.  అసలు ఈ హీల్స్‌ను ఏ బ్రాండ్ తయారు చేసిందో,  దాని ధర ఏంటో తెలుసుకుంటే..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన హీల్స్..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాదరక్షలను తయారు చేసే బ్రాండ్ పేరు జాడా దుబాయ్. ఖరీదైన పాదరక్షలను తయారు చేయడంలో ఈ బ్రాండ్ ఒక్కసారి మాత్రమే కాదు, చాలాసార్లు వార్తల్లో నిలిచింది. వీరు తయారు చేసిన 'ప్యాషన్ డైమండ్ షూస్' ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పాదరక్షలలో ఒకటిగా పరిగణించబడుతోంది. వీటి రంగు వీటిని ఇతన బ్రాండ్ లు, ఇతర హీల్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంచుతోంది.

వీటి సైజ్ ఎంతంటే..

ఈ హీల్స్ యూరోపియన్ సైజు 36. ఎవరైనా తమ సైజు  ఎంపిక ప్రకారం దీన్ని తయారు చేయించుకోవచ్చు. ఇది కేవలం ఒక షోపీస్ కోసం  మాత్రమే తయారు చేసినవి కాదు. వీటిని ధరించాలని అనుకునేవారు ఎంచక్క ఆర్డర్ ఇచ్చి వీటిని తయారుచేయించుకుని ధరించవచ్చు.   ఇది ఎవరినైనా రాయల్‌గా చూపిస్తుంది . కానీ ఒక జత హీల్స్ కోసం  కోట్ల రూపాయలు ఎవరు  ఖర్చు చేస్తారనేది ప్రశ్న.

బంగారంతో..

సాధారణంగా  చాలా వస్తువులతో తయారు చేసిన హీల్స్ చూసి ఉంటారు. కానీ 'ప్యాషన్ డైమండ్ షూస్' బంగారంతో తయారు చేయబడతాయి. అందుకే వాటి రంగు స్వచ్ఛమైన బంగారంగా కనిపిస్తుంది. ఇది మెరుపుతో చాలా అందంగా కనిపిస్తుంది. హీల్స్ కోణాల కాలి శైలిని కలిగి ఉంటాయి. అలాగే హీల్స్ ఎత్తు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ధరించే వారి లుక్‌ను పెంచుతుంది.

వజ్రాలు జోడించారు..

'ప్యాషన్ డైమండ్ షూస్' కు డైమండ్ డిటెయిలింగ్ జోడించబడింది. ముందుగా హీల్స్ మధ్యలో ఒక వజ్రం ఉంటుంది. దీని తరువాత హీల్స్ కు రెండు వైపులా చిన్న వజ్రాలను జోడించడం ద్వారా డిజైన్ చేయబడింది. బంగారు మెరుపుతో వజ్రం అందం మరింత మెరుగుపడుతోంది. అందుకే వాటి ధర కోట్లలో ఉంది.

అసలు ధర ఎంతంటే..

ఈ హీల్స్ ధర 17 మిలియన్ డాలర్లు. ఇది భారత రూపాయిలలో దాదాపు 141 కోట్ల రూపాయలు.  దీనిని విని ఆశ్చర్యపోవచ్చు. కానీ దానిపై ఉన్న వివరాలు దాని పూర్తి ధరను సమర్థిస్తాయి. అయితే ఈ ధర సామాన్యులకు చాలా ఎక్కువ. కానీ ధనవంతులు వీటిని కొనడానికి ఎలాంటి భయం వ్యక్తం చేయరు. ఈ విషయం జగమెరిగిన సత్యం మరి.


                                         *రూపశ్రీ.