దేశంలోనే తొలి మహిళా రాయబారి - ముత్తమ్మ

 

 

అవకాశాలని అందిపుచ్చుకుని అందలాలు ఎక్కడం వేరు. అసలు అవకాశం అన్న పదమే లేని చోట తనే ఓ మార్గాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగిపోవడం వేరు. అలాంటి అరుదైన వ్యక్తులు తాము విజయం సాధించడమే కాదు... ముందు తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తారు. వారిలో ఒకరే సి.బి.ముత్తమ్మ!

 


సి.బి. ముత్తమ్మది కర్ణాటకలోని కూర్గ్‌ జిల్లా. ఆమెకి పట్టుమని పదేళ్లయినా నిండకముందే అటవీశాఖ అధికారిగా చేస్తున్న వాళ్ల నాన్నగారు చనిపోయారు. సహజంగానే అలాంటి పరిస్థితులలో ఏదో ఒకలా ఓ ఒడ్డుకి చేరితే చాలురా భగవంతుడా అనుకుంటాము. కానీ ముత్తమ్మ తల్లి అలా కాదు! తన నలుగరు పిల్లల్నీ ఎలాగైనా సరే బాగా చదివించాలనుకుంది. ముత్తమ్మ కూడా తల్లి తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. బంగారు పతకాలు సాధిస్తూ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో చదువు పూర్తిచేశారు.

 


చదువు పూర్తిచేసిన తరువాత తన తోటివారిలో ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోలేదు. కష్టతరమైన సివిల్‌ సర్వీస్ పరీక్షలకు సిద్ధపడిపోయారు. ఆ పరీక్షలలో నెగ్గిన తొలి భారతీయురాలిగా ముత్తమ్మది ఓ రికార్డు. అందులోనూ ఫారిన్‌ సర్వీస్‌ను ఎన్నుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు ముత్తమ్మ. ఆమెని ఇంటర్వ్యూ చేసిన బోర్డు అధికారులు... ఫారిన్‌ సర్వీసుకి మహిళలు తగరంటూ చాలా నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. ఆడవాళ్లు ఫారిన్‌ సర్వీసుకి పనికిరారంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు అధికారులు. ఒకవేళ ఆమెకు పెళ్లయితే, ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది అన్న షరతు మీద నియామకాన్ని అందించారు. ఓ రెండేళ్ల తరువాత ఈ నిబంధనలైతే మారాయి... కానీ స్త్రీగా ఆమెపట్ల వివక్షలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

 


ఎంత కష్టపడినా కూడా తన ప్రతిభకి తగ్గ పదోన్నతలు దక్కకపోవడంతో ముత్తమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది. ఆ సమయంలో స్త్రీలకు భిన్నమైన సర్వీస్‌ రూల్ప్‌ ఉండేందుకు భారత ప్రభుత్వం చెప్పిన కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఫారిన్‌ సర్వీసులో ఉండేవారికి దేశరక్షణకి సంబంధించి రహస్యాలు తెలిసి ఉంటాయనీ, మహిళలు ఈ సర్వీసులో ఉంటే వారి భర్తలకు సదరు రహస్యాలు తెలిసిపోయే ప్రమాదం ఉంటుందన్నదే ఆ వాదన! కానీ ఫారిన్‌ సర్వీసులో మగవారు ఉంటే ఇలాంటి ప్రమాదం ఎందుకు ఉండదు? అనే సుప్రీం కోర్టు ప్రశ్నకు ప్రభుత్వం తెల్లమొగం వేయాల్సి వచ్చింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది. ‘భారత ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీల పట్ల వివక్షాపూరితంగా ఉన్న నిబంధనలన్నింటినీ మరోసారి పరిశీలించి... ఎలాంటి పక్షపాతం లేనివిధంగా వాటిని సంస్కరించాలన్నదే,’ ఆ తీర్పులోని సారాంశం.

 


 

సుప్రీం కోర్టు తీర్పు తరువాత భారత ప్రభుత్వం ముత్తమ్మను హంగేరీకి రాయబారిగా నియమించింది. అలా తొలి మహిళా రాయబారిగా ముత్తమ్మ చరిత్ర సృష్టించారు. దురదృష్టవశాత్తూ తన విధులలో అడుగడుగుగా ముత్తమ్మని ఒక మహిళగానే భావించి, ఆమెను తక్కువ చేసే ప్రయత్నమే చేసింది ప్రభుత్వం. తన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కేందుకు ఆమె అనుక్షణం పోరాడాల్సి వచ్చేది. అందుకనే రిటైర్మెంట్‌ తరువాత కూడా భారత సివిల్‌ సర్వీసుల వెనుక దాగిన వివక్షని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. Slain by the System అనే పుస్తకంలో స్త్రీల పట్ల అధికారులలోని పక్షపాతాన్ని ఎండగట్టారు.

 


ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను నెగ్గిన తొలి మహిళగా, దేశంలోనే తొలి మహిళా దౌత్యవేత్తగా, తొలి భారతీయ మహిళా రాయబారిగా.... ముత్తమ్మ ఎన్నో తొలి ఘనతలను సాధించారు. ఉద్యోగం అంటే ముత్తమ్మకు ఎంత ఇష్టమో వంటలన్నా కూడా అంతే ఇష్టం! అందుకనే కర్ణాటకలోని వంటకాల మీద ఒక పుస్తకం రాశారు. ఇక దిల్లీలో తన పేరు మీద ఉన్న 15 ఎకరాల భూమిని ఓ అనాధాశ్రమానికి ఇచ్చేసి... మనసులో కూడా తనని మించినవారు లేరని నిరూపించారు. ఆమె చనిపోయి 8 సంవత్సరాలు కావస్తున్నా... ఇప్పటి తరానికి కూడా స్ఫూర్తిగా నిలిచారు.
 

 

- నిర్జర.