Read more!

చలికాలంలో జుట్టు మెరవడానికి అదిరిపోయే అయిదు హెయిర్ ప్యాక్ లు!

చలికాలంలో జుట్టు మెరవడానికి అదిరిపోయే అయిదు హెయిర్ ప్యాక్ లు!

 జుట్టు అందంగా ఉంచుకోవడం అమ్మాయిలకు ఇష్టం. కానీ ఎంత ప్రయత్నం చేసినా చాలామంది జుట్టు అందంగా ఉండదు. మరీ ముఖ్యంగా చలికాలంలో జుట్టు సంబంధ సమస్యలు కూడా అధికం అవుతాయి. చలిగాలుల కారణంగా జుట్టులో తేమ కోల్పోయి పొడిబారుతుంది. జుట్టు జీవం కోల్పోయినట్టు టెంకాయ పీచులాగా కనిపిస్తుంది. కొందరికి చలికాలంలో చుండ్రు సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యలేవీ ఉండకూదన్నా, జుట్టు ఆరోగ్యంగా పట్టుకుచ్చులా మెరవాలన్నా కింది అయిదు హెయిర్ ప్యాకులు వాడితే సరి..

గ్రీన్ టీ హెయిర్ ప్యాక్..

ఒక గిన్నెలో గుడ్డులోని పచ్చసొన తీసుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల గ్రీన్ టీ వెయ్యాలి. దీన్ని బాగా మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుండి జుట్టు అంచుల వరకు మొత్తం పట్టించాలి. జుట్టు కుదుళ్లకు బాగా అంటేలా మసాజ్ చేయాలి. కేవలం ఇరవై నిమిషాలు దీన్ని జుట్టుమీద ఉంచుకుంటే సరిపోతుంది. తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. హెయిర్ ఫాల్ ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. జుట్టు మృదువుగా పట్టుకుచ్చులా మారుతుంది.

మందారపూలు..

కప్పు మందార పూలతో జుట్టు మెరుస్తుందండోయ్. మందార పువ్వులను రెక్కలుగా విడదీసి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. మరుసటిరోజు దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. దీన్ని కూడా జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. గంట సేపు  అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చెయ్యాలి.  ఈ ప్యాక్ జుట్టును మెరిపిస్తుంది.

పెరుగు..

ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండే పెరుగు జుట్టును పట్టుకుచ్చులా మారుస్తుంది. పెరుగులో ఒక చెంచా తేనె, చెంచా బాదం నూనె కలపాలి. దీన్ని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఇరవై నిమిషాలు అలాగే ఉంచి తరువాత  గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి.

పాలు, తేనె..

పాలలో తేనె కలుపుని తాగితే అమృతంలా ఉంటుంది. కానీ ఈ రెండూ కలిపి మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. ఈ ప్యాక్ రిమూవ్ చేయడానికి గాఢత లేని షాంపూను మాత్రమే వాడాలి. లేదంటే మెరుపు కోల్పోతారు. ఇది జుట్టు పెరుగుదను కూడా ప్రోత్సహిస్తుంది.

అరటిపండు..

అరటిపండు శరీర ఆరోగ్యానికే కాదు సౌందర్య సాధనంగా కూడా భలే ఉపయోగపడుతుంది. కాస్త పండిన అరటిపండు ముక్కలు, కొన్ని చుక్కల బాదం నూనె కలిపి మిక్సీ పట్టాలి. మెత్తగా అయిన ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుండి అంచుల వరకు అప్లై చెయ్యాలి.  ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో తల స్నానం చెయ్యాలి. ఇది తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. జుట్టును పట్టుకుచ్చులా మారుస్తుంది. డాండ్రఫ్ సమస్య తొలగిస్తుంది.

                   
(గమనిక: ఈ హెయిర్ ప్యాక్ లు  వివిధ వేదికలలో హెయిర్ కేర్ నిపుణులు సూచించినవి. సైనస్ సమస్యలు, జుట్టు సంబంధ సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)

  *నిశ్శబ్ద.