చిన్నవయసులోనే ఆడపిల్లలకు మెచ్యురిటీ.. దీని పర్యవసానాలు ఏంటి తెలుసా!
posted on Jul 7, 2026
చిన్నవయసులోనే ఆడపిల్లలకు మెచ్యురిటీ.. దీని పర్యవసానాలు ఏంటి తెలుసా!
ప్రతి ఆడపిల్ల ఒక వయసుకు వచ్చాక ఋతుచక్రంలోకి అడుగు పెట్టడం సహజం. ఆడపిల్లలలో ఒకసారి ఋతుచక్రం మొదలైతే మెనోపాజ్ దశకు చేరేవరకు ప్రతి నెలా నెలసరిని ఎదుర్కుంటుంది. కొన్నేళ్ళ కిందటితో పోలిస్తే నేటికాలంలో ఆడపిల్లలు చాలా చిన్న వయసులో మెచ్యురిటీ అవుతున్నారు. గతంలో 14, 15 ఏళ్ల వయసులో మెచ్యురిటీ అయ్యేవారు.. కానీ నేటికాలంలో చాలామంది ఆడపిల్లలు 10 ఏళ్లకే మెచ్యురిటీ అవుతున్నారు. చిన్న వయసులో మెచ్యురిటీ కావడం పెద్దగా సమస్య ఏముంటుందిలే అని తల్లిదండ్రులు కూడా అనుకుంటారు. పైగా ఇది ప్రకృతి సిద్దమైన చర్య కావడం వల్ల దీని గురించి ఎక్కువగా ఆలోచించరు కూడా. కానీ చిన్న వయసులోనే మెచ్యురిటీ అవ్వడం వల్ల ఆడపిల్లలలో ఎదురయ్యే సమస్యలు కొన్ని ఉన్నాయి. అలాగే పిల్లలు చిన్న వయసులోనే మెచ్యురిటీ కాకుండా.. ఒక నిర్ణీత వయసు వచ్చాక మెచ్యురిటీ కావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే..
చిన్న వయసులో మెచ్యురిటీ ఇందుకే..
చిన్న వయసులోనే పిల్లలు మెచ్యురిటీ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అధిక బరువు పిల్లలను చాలా ప్రభావితం చేస్తుంది. అలాగే ఎక్కువ స్ట్రెస్ కూడా పిల్లలు చిన్న వయసులో మెచ్యురిటీ కావడానికి కారణం అవుతుంది. మార్కులు, ర్యాంకుల వంటివి పిల్లలను ఒత్తిడికి గురి చేస్తాయి. ఇది ఆడపిల్లలలో చిన్నతనంలో మెచ్యురిటీ కావడానికి కారణం అవుతుంది. అలాగే నేటికాలంలో జంక్ ఫుడ్ కూడా చాలా దారుణంగా తింటుంటారు. పిల్లలు జంక్ ఫుడ్ తినడాన్నే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగా కూడా పిల్లలు చిన్నతనంలో మెచ్యురిటీ కావడానికి కారణం అవుతుంది. ఇవన్నీ కలిసి పిల్లలు చిన్న వయసులో మెచ్యురిటీ కావడానికి దారి తీస్తాయి.
చిన్న వయసులో మెచ్యురిటీ అయితే ఎదురయ్యే సమస్యలు..
పిల్లలు చిన్న వయసులో మెచ్యురిటీ అవ్వడం వల్ల పిల్లల ఎదుగుదలలో సమస్యలు ఏర్పడతాయి. ప్రతి నెలా పీరియడ్స్ రావడం వల్ల పిల్లలలో ఎముకల ఎదుగుదల నెమ్మదించి, క్రమంగా తగ్గిపోతుంది. దీని వల్ల ఆడపిల్లలు ఎత్తు పెరగరు. తల్లిదండ్రులు బాగా ఎత్తు ఉన్న వారైనా సరే.. ఈ కారణాల వల్ల ఆడపిల్లల ఎత్తు పెరగరు.
పీరియడ్స్ కారణంగా పిల్లలలో శారీరక, మానసిక మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి కారణంగా పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారు. వారు తమ బాల్యాన్ని, తమ చదువును కూడా శ్రద్దగా అనుభూతి చెందలేరు.
చిన్నతనంలో మెచ్యురిటీ కాకుండా ఉండటానికి జాగ్రత్తలు..
ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్మోన్స్ ను డిస్టర్బ్ చేసే కెమికల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్, కంటైనర్స్, కాస్మెటిక్ ప్రోడక్ట్స్, క్రీములు, ,పౌడర్లు, నెయిల్ పాలిష్ వంటివి ఆడపిల్లలకు ఒక వయసు వరకు దూరంగా ఉంచడం మంచిది. అలాగే పెస్టిసైడ్స్ ను ఉపయోగించి పండించిన ఆహారాలు కూడా పిల్లల హార్మోన్స్ ను చాలా డిస్టర్బ్ చేస్తాయ్.
పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలి. రోజులో కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూడాలి. రోజూ కాసేపు వ్యాయామం చేయగలిగేలా పిల్లలను ప్రోత్సహించాలి. టీవీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటి వాటికి ఎక్కువ సమయం వెచ్చించకుండా పిల్లలకు టైమ్ సెట్ చేయాలి. ఇవన్నీ ఫాలో అయితే పిల్లలు చాలా చిన్న వయసులో మెచ్యురిటీ కావడాన్ని నివారించవచ్చు.
*రూపశ్రీ.