పండుగల వేళ సంప్రదాయం ఉట్టిపడే చీరకట్టు చిట్కాలు..!
posted on Oct 24, 2026
పండుగల వేళ సంప్రదాయం ఉట్టిపడే..చీరకట్టు చిట్కాలు..!
పండుగలు వస్తున్నాయంటే చాలు మన ఇళ్లలో ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు సందడి మొదలవుతుంది. పూజలు, బంధువుల రాకపోకలు, పిండి వంటల గుమగుమలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతుంది. ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో భారతీయ మహిళలు ఎక్కువగా ఇష్టపడేది సంప్రదాయ చీరకట్టునే. చీర ఎంత అందమైనదో, దాన్ని సరైన పద్ధతిలో కట్టుకున్నప్పుడే దాని లుక్ మరింత రెట్టింపు అవుతుంది. పండుగల రోజుల్లో అమ్మాయిల అందాన్ని మరింత పెంచి, నిండుగా కనిపించేలా చేసే కొన్ని సులువైన చీరకట్టు చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
చీర సెలక్షన్..
చీరలో అందంగా కనిపించాలంటే మొదట చీర సెలక్షన్ చాలా ముఖ్యం. పండుగల రోజుల్లో పట్టు, చందరి, కాటన్ సిల్క్ లేదా జరీ వర్క్ ఉన్న చీరలు చాలా బాగుంటాయి. పూజల సమయంలో కాస్త వెలుగునిచ్చే పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, మెరూన్ వంటి రంగులు సంప్రదాయ రూపాన్ని తెస్తాయి. ఉదయం పూట తేలికపాటి చీరలు, సాయంత్రం వేళల్లో కాస్త గ్రాండ్ గా ఉండే చీరలను ఎంచుకోవడం మంచిది.
బ్లౌజ్ డిజైన్..
చీర అందం మొత్తం బ్లౌజ్ డిజైన్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి చీర కట్టినా బ్లౌజ్ సరిగ్గా కుదరకపోతే లుక్ పాడవుతుంది. కాబట్టి పండుగ చీరలకు ఫిట్టింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎల్బో లెంగ్త్ హ్యాండ్స్, మగ్గం వర్క్ లేదా కాంట్రాస్ట్ రంగుల బ్లౌజులు సంప్రదాయ లుక్ కి చాలా బాగా సరిపోతాయి.
కొంగు, కుచ్చిళ్లు..
చీర కట్టేటప్పుడు కుచ్చిళ్లు, పల్లూ మీద శ్రద్ధ పెట్టాలి. కుచ్చిళ్లను సమానంగా మడతపెట్టి, నడుము భాగంలో గట్టిగా పిన్ చేసుకోవాలి. ఇది పొడుగ్గా, సన్నగా కనిపించేలా చేస్తుంది. పల్లూ విషయానికి వస్తే, పూజలు లేదా ఇంట్లో పనుల వేళ పల్లూను చిన్న చిన్న మడతలుగా పెట్టి పిన్ చేసుకుంటే తిరగడానికి వీలుగా ఉంటుంది. సాయంత్రం వేడుకల్లో పల్లూను ఫ్రీగా వదిలేస్తే గ్రాండ్ లుక్ వస్తుంది.
జ్యువెలరీ ముఖ్యం..
చీరకట్టుకు తగ్గట్టుగా ఆభరణాలు వేసుకుంటే ఆ కళే వేరు. సంప్రదాయ చీరలపైకి గుత్తుసౌసర్లు, కాసుల పేరు, క్వాలిటీగా ఉండే టెంపుల్ జ్యువెలరీ చాలా చక్కగా సెట్ అవుతాయి. పెద్ద హారం వేసుకున్నప్పుడు చెవులకు చిన్న దిద్దులు, లేదా కేవలం పెద్ద జుంకాలు మాత్రమే వేసుకుని మెడ ఖాళీగా వదిలేయడం ఇప్పుడు మంచి ట్రెండ్. చేతులకు గాజులు వేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు.
మేకప్..
అందమైన చీరకట్టుకు తగిన మేకప్, హెయిర్ స్టైల్ తోడు అయితే లుక్ పర్పెక్ట్ గా కంప్లీట్ అవుతుంది. హెవీ మేకప్ కాకుండా నాచురల్ గా కనిపించేలా కాటుక, ముక్కుపుడక, చిన్న బొట్టు పెట్టుకుంటే చాలా ముచ్చటగా ఉంటారు. జుట్టును కొప్పులా ముడివేసి చుట్టూ మల్లెపూలు చుట్టుకున్నా, లేదా జడ వేసుకుని పువ్వులు పెట్టుకున్నా సంప్రదాయం ఉట్టిపడుతుంది.
ఇది గుర్తుపెట్టుకోండి..
అంతా రెఢీ అయ్యాక వేసుకునే పాదరక్షలు కూడా చీర నడకను ప్రభావితం చేస్తాయి. కాబట్టి చీర కింద పడిపోకుండా నడవడానికి వీలుగా ఉండే ఫ్లాట్స్ లేదా చిన్న హీల్స్ ఎంచుకోవడం మంచిది. ఇవన్నీ పాటిస్తే పండుగల సమయంలో అందరి దృష్టి అమ్మాయిల పైనే ఉంటుంది.
*రూపశ్రీ