ఫేషియల్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ నిజాలు తెలుసుకోవాలి..!

ఫేషియల్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ నిజాలు తెలుసుకోవాలి..!


అమ్మాయిల చర్మ సంరక్షణలో  ఫేషియల్ చాలా ముఖ్యమైనది.  ఇప్పట్లో చాలామంది బ్యూటీ పార్లర్ కు వెళ్లి వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి అయినా ఫేషియల్ చేయించుకుంటారు. మరీ ముఖ్యంగా పండుగలు,  శుభకార్యాలు, ఈవెంట్ల సమయంలో ముఖం మెరవాలంటే ఫేషియల్ కు ఓటు వెయ్యాల్సిందే అనుకుంటారు. అయితే చాలామందికి తెలియని నిజం ఏంటంటే.. ఫేషియల్ చేయించుకోవడానికి ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫేషియల్ వల్ల పూర్తీ ప్రయోజనాలు పొందవచ్చు. పైగా చర్మానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుకోవచ్చు.  ఇంతకీ అవేంటో తెలుసుకుంటే..

ఎండలో తిరగకూడదు..

ఫేషియల్ చేయించుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ ఫేషియల్ వల్ల చర్మాన్ని చాలా రుద్దుతారు.  ఈ కారణంగా చర్మం కాస్త సెన్సిటివ్ గా మారుతుంది.  ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ ఎండలోకి వెళితే చర్మం దెబ్బతింటుంది.  చాలా తొందరగా ట్యాన్ వస్తుంది.  ఒకవేళ తప్పనిసరిగా ఎండలో వెళ్లాల్సి వస్తే తప్పకుండా ముఖానికి సన్ స్క్రీన్ ఉపయోగించాలి.

ముఖాన్ని తాకడం..

ఫేషియల్ చేసినప్పుడు చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాంటప్పుడు ముఖ చర్మాన్ని పదే పదే తాకడం వల్ల చేతులకు ఉన్న మురికి కారణంగా ఇన్ఫెక్షన్లు, మొటిమలు వస్తాయి.  అందుకే ఫేషియల్ చేయించుకున్న తర్వాత ముఖ చర్మాన్ని పదే పదే తాకకూడదు.

మేకప్ వద్దు..

ఫేషియల్ చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయనే విషయం తెలిసిందే.  ఇలాంటి పరిస్థితిలో ముఖానికి మేకప్ వేయడం అస్సలు మంచిది కాదు.  ఫేషియల్ వేయించుకున్న తర్వాత సుమారు 24 నుండి 72 గంటల పాటు మేకప్ వేసుకోకూడదు.అంటే ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఒకటి నుండి 3 రోజులు మేకప్ వేసుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ మేకప్ వేసుకుంటే మేకప్ లోని రసాయనాలు చర్మ రంధ్రాలలోకి వెళ్లి ముఖ చర్మాన్ని దెబ్బతీస్తాయి.

ఫేష్ వాష్ వద్దు..

ఫేషియల్ చేయించుకున్న తర్వాత సుమారు 4 నుండి 6 గంటల పాటు ఫేస్ వాష్ చేయించుకోక పోవడం మంచిది. ముఖం కడుక్కోవడానికి పేస్ వాష్ లేదా సబ్బు వంటివి వాడకూడదు.  ముఖాన్ని శుభ్రం చేసుకోవాలంటే కేవలం సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ముఖ చర్మాన్ని కూడా చాలా రూడ్ గా రుద్దకూడదు.

వేడి నీరు..

ఫేషియల్ చేయించుకున్న తర్వాత ముఖానికి వేడినీరు ఆవిరి పట్టడం లేదా వేడి నీటితో ముఖం కడగటం వంటివి మానుకోవాలి.  ఫేషియల్ వల్ల సున్నితమైన చర్మం వేడినీరు లేదా వేడి ఆవిరి కారణంగా మరింత సున్నితంగా మారి దెబ్బతినే అవకాశం ఉంటుంది.

రసాయన ఉత్పత్తులు..

ఫేషియల్ చేయించుకున్న తర్వాత కొన్నిరోజుల పాటు ఎక్స్ఫోలియేటర్లు, టోనర్లు,  కెమికల్ పీల్స్ ఉన్న స్కిన్ ప్రోడక్ట్స్ వాడకుండా ఉండటం మంచిది.

ఫేషియల్ కు ముందు ఇవి మరవద్దు..

థ్రెడింగ్,  వ్యాక్సింగ్, బ్లీచింగ్ వంటివి అవసరం అయితే ఫేషియల్ చేయించుకోవడానికి ముందే వీటిని చేయించుకోవాలి. ఫేషియల్ తర్వాత చర్మం సున్నితంగా మారుతుంది కాబట్టి,  పైన చెప్పుకున్న ప్రాసెస్ లు ఫేషియల్ తర్వాత చేస్తే  చర్మానికి చాలా నష్టం చేస్తాయి.

                               *రూపశ్రీ.