వర్షాకాలంలో సన్ స్క్రీన్ వాడాలా..అసలు నిజాలేంటి.!

వర్షాకాలంలో సన్ స్క్రీన్ వాడాలా?  అసలు నిజాలేంటి?

వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, అవి అనేక కొత్త చర్మ సమస్యలను కూడా వెంట తెస్తాయి. వర్షా కాలంలో సరైన చర్మ సంరక్షణ చాలా అవసరం, కానీ వర్షాకాలంలో ఎండ ఉండదు కాబట్టి సన్‌స్క్రీన్ అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. ఈ కారణంగా, చాలా మంది వర్షాకాలంలో తమ స్కిన్ కేర్ రొటీన్  నుండి సన్‌స్క్రీన్‌ను పూర్తిగా అవాయిడ్ చేస్తారు. కానీ ఇలా చేయడం సరైనదేనా? వర్షాకాలంలో సన్‌స్క్రీన్‌ను వాడకుండా ఉండాలా? దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెప్తున్నారు?  వివరంగా తెలుసుకుంటే..


వర్షాకాలంలో సన్ స్క్రీన్..

స్కిన్ కేర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం వర్షాకాలంలో ఎండ లేకపోయినా, మేఘాలు దట్టంగా ఉన్నప్పటికీ సూర్యుని నుండి వెలువడే UVA , UVB కిరణాలలో ఎక్కువ భాగం భూమిని చేరుతుంది. ముఖ్యంగా,  ముడతలు, చర్మంపై మచ్చలు , దీర్ఘకాలిక చర్మ నష్టానికి కారణమయ్యే UVA కిరణాలు, మేఘాలను దాటుకుని మరీ రాగవట.  ఇంటి బయటకు వెళ్లేటప్పుడు ఈ కిరణాల నుండి రక్షణ కోసం వర్షాకాలంలో కూడా సన్ స్క్రీన్ ను వాడటం చాలా అవసరం.

అయితే, ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. అందువల్ల, చర్మ రకం, బయట గడిపే సమయం , చేసే పనుల  ఆధారంగా సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. వర్షాకాలంలో సన్‌స్క్రీన్ వాడాలా వద్దా, ఏ సన్‌స్క్రీన్ ఉత్తమమైనది, ఎంత మోతాదులో పూయాలి , ఏ తప్పులు చేయకూడదు.. ఇవన్నీ తెలుసుకోవాలి.


వర్షాకాలంలో ఏ సన్ స్క్రీన్ ఎంచుకోవాలి..

బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి.  SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నది చాలా మంచి  ఎంపికగా పరిగణించబడుతుంది.  PA+++ లేదా PA++++ రేటింగ్ ఉన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది.  జిడ్డు చర్మం ఉన్నవారు జెల్ లేదా మ్యాట్ ఫినిష్ వాడాలి,  పొడి చర్మానికి, తేమను అందించే ఫార్ములాను ఎంచుకోవాలి.  చెమట పట్టినా లేదా తేలికపాటి వర్షం పడినా, వాటర్ ఫ్రూప్ సన్ స్క్రీన్ ఎంచుకోవాలి.


సన్ స్క్రీన్ ఎలా పూయాలి..

ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి,  దీని తర్వాత, తగినంత సన్‌స్క్రీన్‌ను రాసుకోవాలి.  బయటకు వెళ్లే ముందు సుమారు 15-20 నిమిషాల ముందు రాసుకోవాలి.  ఎక్కువసేపు ఆరుబయట ఉన్నట్లయితే, ప్రతి 2-3 గంటలకు మళ్లీ పూయాలి.  ఎక్కువ చెమట పట్టిన తర్వాత, వర్షంలో తడిచిన తర్వాత లేదా ముఖం కడుక్కున్న తర్వాత మళ్లీ రాసుకోవాలి.

ఈ స్కిన్ కేర్ టిప్స్ తప్పనిసరి..

ముఖాన్ని రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి,  చర్మ రకానికి అనుగుణంగా తేలికపాటి మాయిశ్చరైజర్‌ను వాడాలి,  తగినంత నీరు త్రాగాలి,  సమతుల్య ఆహారం తీసుకోవాలి,  తడి చర్మాన్ని ఎక్కువ సేపు తేమగా ఉంచకూడదు,  వర్షంలో కూడా గొడుగు లేదా టోపీని వాడాలి.

                            *రూపశ్రీ.