పిల్లలు ఎత్తుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!

పిల్లలు ఎత్తుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా, బలంగా , పొడవుగా ఉండాలని కోరుకుంటారు. పిల్లల ఎత్తు అనేది వంశపారంపర్యత, పోషణ, శారీరక శ్రమ , జీవనశైలి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎత్తు పెరుగుదలలో జన్యువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆరోగ్యకరమైన ఆహారం , ఆరోగ్యకరమైన అలవాట్లు పిల్లల ఎత్తును  మెరుగుపరచడంలో సహాయపడతాయి.  తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు పొడవు పెరగడం లేదని  ఆందోళన చెందుతూ, రకరకాల పరిష్కారాల కోసం చూస్తుంటారు. కొన్ని ఇంటి చిట్కాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం పిల్లల శారీరక అభివృద్ధికి తోడ్పడుతుంది.  పిల్లల ఎత్తు మెరుగ్గా ఉండటానికి సహాయపడే చిట్కాలేంటో తెలుసుకుంటే..

పాలు, పాల ఉత్పత్తులు..

పాలు, పెరుగు, జున్ను , ఇతర పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్ , విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.
ఈ పోషకాలు ఎముకలను బలపరచడానికి , శరీర పెరుగుదలకు సహాయపడతాయి.  పిల్లల ఆహారంలో క్రమం తప్పకుండా పాలు చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రోటీన్..

శరీర కణాలు , కండరాల అభివృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం.  పిల్లలకు పప్పులు, గుడ్లు, సోయాబీన్, జున్ను, పాలు , డ్రై ఫ్రూట్స్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి.

వ్యాయామం, క్రీడలు..

శారీరక కార్యకలాపాలు పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. తాడుతో గెంతులు వేయడం, సైక్లింగ్, ఈత , ఇంటి బయట ఆడుకునే  ఆటలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.  ఇవి ఎముకలు,  కండరాల అభివృద్ధికి సహాయపడతాయి.

నిద్ర..

గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో పెరుగుదల హార్మోన్ అధికంగా స్రవిస్తుంది. పిల్లలు వారి వయసుకు తగినట్లుగా తగినంత, నాణ్యమైన నిద్ర పొందడం చాలా ముఖ్యం.

జంక్ ఫుడ్  వద్దు..

అధికంగా జంక్ ఫుడ్ , చక్కెర పానీయాలు తీసుకోవడం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మెరుగైన ఎదుగుదల కోసం, సమతుల,  పోషకమైన ఆహారంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం.

                                     *రూపశ్రీ.