Read more!

పిల్లలకు బాధ్యత నేర్పడం పెద్దల బాధ్యత

 

పిల్లలకు బాధ్యత నేర్పడం పెద్దల బాధ్యత


‘‘నీకస్సలు బాధ్యత తెలియదు’’... మనం తరచుగా పిల్లలతో అనే మాట ఇది. మనం అలా అనగానే ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేస్తారు పిల్లలు. ఆ పదానికి అర్థంకాని, అలా మనం అనకుండా ఉండాలో ఏం చేయాలో కానీ తెలియని వయసు వారిది. అందుకే ‘బాధ్యత’ లాంటి  పెద్ద పదాలు వాడకుండా ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం అలవాటు చేసుకోండి అంటున్నారు పిల్లల మానసిక నిపుణులు. అందుకు వారు చేస్తున్న కొన్ని సూచనలు ఇవే.

1. పిల్లలకి తల్లిదండ్రులే రోల్ మోడల్స్ కాబట్టి ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారో దాన్ని మీరు ఆచరణలో పెట్టండి అంటున్నారు నిపుణులు. మీరు పదేపదే చెప్పినదానికన్నా, చేసినది పిల్లల మనసులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. దారు దానిని తెలియకుండానే అనుసరిస్తారు అంటున్నారు వీరు.

2. పిల్లలు ఓ పనిని పూర్తి బాధ్యతతో చేయాలని మీరు ఆశిస్తే మొదట వారితో కలసి ఆ పనిని మీరూ చేయండి. ఉదాహరణకి రోజూ ఈ సమయం నుంచి ఈ సమయం దాకా చదువుకోవాలి. అని పిల్లలకి చెప్పినప్పుడు ఆ సమయంలో వారితోపాటు మీరూ పక్కన కూర్చుని చదివించండి. అది వారికి అలవాటుగా మారేదాకా అలా చేయాల్సిందే. ఒకవేళ అలా వారు చెప్పిన సమయానికి చదువుకోకపోతే మీరెలా స్పందిస్తారన్న విషయాన్ని కూడా వారికి ముందే చెప్పాలి. అయితే ఒక్కమాట... అది బెదిరింపులా వుండకూడదు.

3. ఇక పిల్లలకి చిన్నచిన్న పనులు చెప్పడం, వారి పనులు వారే చేసుకునేలా ప్రోత్సహించడం, వాటిని తేలిగ్గా ఎలా చేసుకోవచ్చో చెప్పడం... ఇవన్నీ పిల్లలకి బాధ్యతగా వుండటం ఎలాగో చెప్పడంలో భాగమే. ఉదయం స్కూలుకి టైంకి వెళ్ళాలంటే రాత్రే బ్యాగు సర్దుకోవడం, యూనీఫాం రెడీ చేసుకోవడం, షూ పాలిష్ వేసుకోవడం... ఇవన్నీ ఓ క్రమపద్ధతిలో ప్రతిరోజూ చేసుకునేలా పిల్లలకి అలవాటు చేయాలి.

4. పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని మనం ఆశించడంలో తప్పేం లేదు. కానీ, ఏ వయసు పిల్లల నుంచి ఎంత బాధ్యతాయుత ప్రవర్తనని ఆశించవచ్చు అన్న అవగాహన వుండాలి మనకు. పిల్లల వయసును బట్టి వారికి పనులు చెప్పాలి.

5. పిల్లలు ఒక్కోసారి మర్చిపోయో, లేకపోతే చిన్నతనం వల్ల ఆ పనులని తేలిగ్గా తీసుకోవడమో చేస్తారు. అలాంటప్పుడు చాలా ఘోరమైన తప్పు చేసినట్టుగా పిల్లలని నిందించకుండా మొదట్లో మనమే గుర్తుచేసి చేయించాలి. అలా ఎన్నిసార్లు  అన్న లెక్క లేదు. వాళ్ళు ఆ పనిని బాధ్యతగా ఫీల్ అయ్యి చేసేదాకా గుర్తుచేయడమే.

6. పిల్లలకి బాధ్యతగా వుండటం నేర్పించడంలో ఉన్న ఒక ముఖ్యమైన కిటుకు... మెచ్చుకోవటం. అదే పిల్లలకి హుషారునిచ్చే టానిక్. ‘అరె భలే చేశావే... మర్చిపోకుండా చేస్తున్నావ్’ లాంటి పదాలు వాడితే... ఆ మెప్పు దేనికోసమే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. మళ్ళీ, మళ్ళీ ఆ మెప్పు మననుంచి పొందటానికి ప్రయత్నిస్తారు.

బాధ్యత అనేది ఓ క్రమశిక్షణ. ఒక పనిని స్వంతంగా తన తీరుతో చేయటం. అవీ ఓ పద్ధతిలో. ఒక్కచోట ఆ పద్ధతి అలవాటు అయితే అది జీవితంలో అన్నిచోట్లా కనిపిస్తుంది. ఓ వ్యక్తి ఉన్నతంగా ఎదగడానికి అది చాలా అవసరం. మరి అంత ముఖ్యమైన విషయాన్ని పిల్లలకి నేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఎంత ఓపిగ్గా ఉండాలో ఆలోచించండి. మనం కూడా బాద్యతగా మన పిల్లలకి బాధ్యత నేర్పిద్దాం.

-రమ