చిన్న పిల్లలు గురక పెట్టడం సహజమేనా..ఏ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.!

చిన్న పిల్లలు నిద్రలో అప్పుడప్పుడు గురక పెట్టడం సాధారణంగానే కనిపించవచ్చు. ముఖ్యంగా జలుబు, ముక్కు దిబ్బడ లేదా అలర్జీ కారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు తాత్కాలికంగా గురక రావచ్చు. అయితే ప్రతిరోజూ లేదా తరచుగా గురక పెట్టడం మాత్రం  మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో ఇది పిల్లల శ్వాసకు సంబంధించిన సమస్యకు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

 పిల్లలు గురక ఎందుకు పెడతారు?

నిద్రలో శ్వాస వెళ్లే మార్గం కొద్దిగా ఇరుకుగా మారినప్పుడు గాలి కదలిక వల్ల గొంతులోని కణజాలాలు కంపించి గురక శబ్దం వస్తుంది. పిల్లల్లో దీనికి అనేక కారణాలు ఉండే అవకాశం ఉంది.

జలుబు, ముక్కు దిబ్బడ..

జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ సమయంలో ముక్కు మూసుకుపోవడం వల్ల పిల్లలు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. దీంతో నిద్రలో గురక రావచ్చు. జలుబు తగ్గిన తర్వాత గురక కూడా తగ్గిపోతే సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ పెద్దగా ఉండటం..

పిల్లల్లో తరచుగా కనిపించే ముఖ్యమైన కారణాల్లో టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ పెరగడం ఒకటి. ఇవి గొంతు లేదా ముక్కు వెనుక భాగంలో ఉండే కణజాలాలు. ఇవి ఎక్కువగా పెరిగితే శ్వాస మార్గం ఇరుకుగా మారి గురక, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వంటి సమస్యలు రావచ్చు.

అలర్జీలు..

దుమ్ము, ధూళి, పెంపుడు జంతువుల వెంట్రుకలు వంటి వాటి వల్ల కొంతమంది పిల్లలకు అలర్జీ రావచ్చు. ముక్కు నిరంతరం మూసుకుపోవడం లేదా కారడం వల్ల రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి గురక రావచ్చు.

 నోటి ద్వారా శ్వాస తీసుకోవడం..

ముక్కు తరచుగా మూసుకుపోయే పిల్లలు నిద్రలో నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల నోరు తెరిచి నిద్రపోవడం, గురక పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

స్లీప్ అప్నియా..

కొంతమంది పిల్లల్లో Obstructive Sleep Apnea (OSA) అనే నిద్ర సంబంధిత శ్వాస సమస్య ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో నిద్రలో శ్వాస మార్గం కొంతసేపు మూసుకుపోయి, శ్వాస ఆగినట్లు అనిపించి మళ్లీ ప్రారంభమవుతుంది. ఇది సాధారణ గురక కాదు.. దీన్ని కాస్త సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది.  

పిల్లల గురకతో పాటు కింది లక్షణాలు కనిపిస్తే పిల్లల గురకను నిర్లక్ష్యం చేయకుండా పిల్లల వైద్యుడిని సంప్రదించడం మంచిది..

 ప్రతిరోజూ లేదా వారంలో ఎక్కువ రాత్రులు గురక పెట్టడం,  నిద్రలో శ్వాస ఆగినట్లు కనిపించడం,  నిద్రలో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం,   నిద్రలో ఉలిక్కిపడటం లేదా తరచుగా మేల్కొనడం.

నోరు తెరిచి నిద్రపోవడం,   ఉదయం లేవగానే నోరు పొడిగా ఉండటం,  పగటిపూట ఎక్కువగా నిద్రమత్తుగా ఉండటం,   పిల్లల్లో ఏకాగ్రత లేదా ప్రవర్తనలో మార్పులు కనిపించడం, ఉదయం తలనొప్పి రావడం,  ఎదుగుదల లేదా బరువు పెరుగుదల సరిగా లేకపోవడం.  ఇవన్నీ ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు.

ప్రతి గురకకు చికిత్స అవసరమా?

సాధారణ గురకకు చికిత్స అవసరం లేదు. జలుబు లేదా తాత్కాలిక ముక్కు దిబ్బడ వల్ల వచ్చే గురక సాధారణంగా సమస్య తగ్గిన తర్వాత తగ్గిపోతుంది.

అయితే గురక తరచుగా వస్తుంటే, చాలా బిగ్గరగా ఉంటే లేదా నిద్రలో శ్వాసకు అంతరాయం కలిగిస్తే..  కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. వైద్యుడు పిల్లల ముక్కు, గొంతు, టాన్సిల్స్, అడినాయిడ్స్ తదితరాలను పరిశీలించి అవసరమైతే మరిన్ని పరీక్షలు సూచించవచ్చు.


                                                                                                                                                  *రూపశ్రీ.