Read more!

నెయిల్ పాలిష్ రిమూవర్ లేకుండా నెయిల్ పెయింట్ తొలగించుకోవచ్చు..

నెయిల్ పాలిష్ రిమూవర్ లేకుండా నెయిల్ పెయింట్ తొలగించుకోవచ్చు..

 అమ్మాయిల అందానికి బోలెడు అలంకారాలు. వీటిలో దుస్తులు, నగలు, పాదరక్షల దగ్గర నుండి దుస్తులకు వేసుకుని పిన్నులు, జడలకు వేసుకుని క్లిప్పుల వరకు బోలెడు ఉంటాయి. ఇక చేతులు అందంగా కనిపించడం కోసం, బయటకు పార్టీలకు వెళ్లినప్పుడు అట్రాక్షన్ గా ఉండాలని గోళ్ళకు  నెయిల్ పాలిష్ వేస్తుంటారు. ఈ రోజుల్లో బట్టలకు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకునే ట్రెండ్ ఎక్కువైంది. నెయిల్ పాలిష్ వేయడం చాలా సులభం, కానీ దానిని తొలగించేటప్పుడు చాలా కష్టం. డ్రస్ మార్చిన ప్రతిసారి నెయిల్ పాలిష్ మార్చడం చాలామందికి సమస్యగా ఉంటుంది. కారణం నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా నెయిల్ పాలిష్ అంత ఖరీదైనదే.. భీభత్సంగా వాడితే అది మాత్రం అయిపోకుండా ఉంటుందా ఏంటి? అయితే  గోళ్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్ తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ కింది ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలు..

టూత్‌పేస్ట్..

పళ్లు తోమడానికి ఉపయోగించే టూత్‌పేస్ట్  గోళ్లకున్న పాత నెయిల్ పాలిష్ తొలగించడంలో  కూడా ఉపయోగించవచ్చు.  ఇందుకోసం గోళ్లపై టూత్‌పేస్ట్‌ను రాసి లైట్ గా  బ్రష్ సహాయంతో గోళ్లను తేలికగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ పాలిష్ తొలగిపోతుంది.

టూత్‌పేస్ట్,  బేకింగ్ సోడా..

టూత్‌పేస్ట్‌లో బేకింగ్ సోడా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని  గోళ్లపై రాస్తే పాత నెయిల్ పాలిష్ చాలా సులువుగా  తొలగిపోతుంది.

వేడి నీరు..

 వేడి నీటి సహాయంతో నెయిల్ పాలిష్‌ను తొలగించుకోవచ్చు. ఇందుకోసం కొంచెం నీటిని ఒక పాత్రలో వేడి చేయాలి.  తరువాత వేళ్లను  గోరు వెచ్చని నీటిలో 25-30 నిమిషాలు ఉంచాలి. ఇది ఓపికతో కూడుకున్నది అయినా గతిలేని పరిస్థితిలో కచ్చితమైన ఫలితాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది.  ఇలా ఉంచితే క్రమంగా నెయిల్ పెయింట్ దానంతట అదే రాలిపోతుంది.

నిమ్మరసం

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉపయోగించడం  ద్వారా కూడా గోళ్ళకు ఉన్న  నెయిల్ పాలిష్‌ను వదిలించుకోవచ్చు. నిమ్మరసం కలిపిన నీళ్లలో గోళ్ళను ముంచాలి. ఇలా కొద్దిసేపు ఉంచితే  నెయిల్ పాలిష్ పోవడమే కాదు గోర్లు పూర్తిగా శుభ్రంగా ఉంటాయి.


వెనిగర్

 నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి వెనిగర్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం వెనిగర్‌లో నిమ్మరసం మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే  నెయిల్ పాలిష్ ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది.

                                                          *నిశ్శబ్ద.