పిల్లలు పుట్టాక తిరిగి యవ్వనంగా అందంగా కనిపించాలంటే ఏం చేయాలి.!

పిల్లలు పుట్టాక తిరిగి యవ్వనంగా అందంగా కనిపించాలంటే ఏం చేయాలి.!

పిల్లలు పుట్టిన తర్వాత ఒక స్త్రీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. బిడ్డను ప్రపంచంలోకి తీసుకురావడం ఎంతటి అద్భుతమైన అనుభవమో, ఆ సమయంలో శరీరం, మనస్సు పొందే శ్రమ కూడా అంతే గొప్పది. ప్రసవం తర్వాత శారీరక మార్పులు, నిద్రలేమి, కొత్త బాధ్యతల వల్ల కలిగే అలసట ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది తల్లులు తమ వివాహమైన కొత్తలో  ఎంత అందంగా ఉన్నామో.. అలాంటి రూపాన్ని , కాంతిని తిరిగి ఎలా పొందాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. అయితే, సరైన జాగ్రత్తలు, సరైన అలవాట్లు, కొద్దిగా ఓర్పు ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా మునుపటి కంటే మరింత ఆరోగ్యంగా, అందంగా, చిన్నవయస్సు వారిలా కనిపించడం ఖచ్చితంగా సాధ్యమే. అందుకోసం ఏం చేయాలో వివరంగా తెలుసుకుంటే..

ప్రసవం తర్వాత..

​తల్లిగా మారిన కొత్తలో శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ప్రసవం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి సమయం పడుతుంది. అందుకే మొదటగా శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి. పాప లేదా బాబు నిద్రపోయే సమయంలో తల్లి కూడా నిద్రపోవడం వల్ల శరీర అలసట తగ్గుతుంది. ఇది ముఖంపై కాంతిని పెంచడానికి, కళ్ల కింద నల్లటి వలయాలు రాకుండా చూడడానికి సహాయపడుతుంది.

ఆహారం..

​ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  తినే ఆహారమే  అందానికి, ఆరోగ్యానికి పునాది. ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను, విటమిన్లను అందిస్తాయి. 

నీరు..

చర్మం మృదువుగా, కాంతివంతంగా మారడానికి రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చర్మం తేమగా ఉంటుంది.

బరువు..

ప్రసవం తర్వాత బరువు పెరగడం సాధారణం. అయితే, వెంటనే తీవ్రమైన వ్యాయామాలు చేయకూడదు. డాక్టర్ సలహాతో తేలికపాటి నడకతో ప్రారంభించాలి. కొన్ని నెలల తర్వాత యోగా లేదా సాధారణ వ్యాయామాలు చేయడం ద్వారా పొట్ట తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి, చర్మానికి మంచి రంగు వస్తుంది. అంతేకాకుండా, ఇది మనస్సును ఉల్లాసంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది.

స్కిన్ కేర్..

చర్మ సౌందర్యానికి క్రమబద్ధమైన సంరక్షణ అవసరం. ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పుల వల్ల చర్మం పొడిబారడం లేదా నల్లబడటం జరుగుతుంది. రోజువారీగా ముఖాన్ని శుభ్రం చేసుకోవడం, మంచి మాయిశ్చరైజర్ రాయడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ఎండ నుండి రక్షణ కోసం సన్‌స్క్రీన్ వాడడం మంచిది. ఇంట్లోనే లభించే శనగపిండి, పెరుగు, పసుపు, అలోవెరా వంటి పదార్థాలతో సహజమైన ప్యాక్‌లు వేసుకోవడం వల్ల చర్మం ఎలాంటి రసాయనాలు లేకుండా మెరుస్తుంది.

హెయిర్ కేర్..

​జుట్టు రాలడం అనేది ప్రసవానంతరం ఎదురయ్యే మరో పెద్ద సమస్య. హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. దీనికి కంగారు పడకుండా క్రమం తప్పకుండా కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు మళ్లీ ఒత్తుగా పెరుగుతుంది. సరైన హెయిర్ కట్ ఎంచుకోవడం వల్ల కూడా వయస్సు చిన్నదిగా కనిపిస్తుంది.

మానసిక ప్రశాంతత..

అన్నింటికంటే ముఖ్యమైనది మానసిక ప్రశాంతత. తల్లి అయ్యే ప్రక్రియలో ఒత్తిడి, ఆందోళన సహజం. కానీ ఆ ఒత్తిడి ముఖంపై ప్రభావం చూపుతుంది. రోజూ కొంత సమయం తమ కోసం తాము కేటాయించుకోంవాలి.  ఇష్టమైన సంగీతం వినడం లేదా ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక సంతోషం ముఖంలో వెలుగును తెస్తుంది.

​పిల్లలు పుట్టినంత మాత్రాన మహిళల  అందం తగ్గిపోదు. సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన సంరక్షణ , సంతోషకరమైన మనస్సు ఉంటే  ఎల్లప్పుడూ అందంగా, యవ్వనంగా కనిపిస్తారు.

                    *రూపశ్రీ.