చరక సంహితలో చెప్పిన 5 చిట్కాలు పాటిస్తే చాలు..హెయిర్ ఫాల్ మాయం..!

చరక సంహితలో చెప్పిన 5 చిట్కాలు పాటిస్తే చాలు..హెయిర్ ఫాల్ మాయం..!

 

 

జుట్టు రాలడం సమస్య దాదాపు అన్ని వయసుల,  లింగాల వారిని వెంటాడుతోంది. ఈ రోజుల్లో 16-17 సంవత్సరాల పిల్లలు కూడా జుట్టు రాలడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఎక్కువగా ఈ సమస్య వాతావరణంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా సీజన్ మారినప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది.  వర్షాకాలంలో ఈ హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎక్కువ.  అయితే అసలు వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య ఎందుకు పెరుగుతుంది? ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఆయుర్వేద గ్రంథం అయిన చరక సంహితలో ఎలాంటి చిట్కాలు పేర్కొన్నారు? తెలుసుకుంటే..

జుట్టు ఎందుకు రాలిపోతుంది?

పిత్త స్వభావం క్షీణించినప్పుడు జుట్టు సమస్యలు వస్తాయి. ఎవరికైనా  జుట్టు రాలడం, విరిగిపోవడం,  తెల్లగా మారడం జరుగితే అది పిత్త స్వభావం క్షీణించడం వల్ల జరిగేదే. జూలై నుండి అక్టోబర్ వరకు పిత్త ధోరణి ఎక్కువగా ఉంటుంది.  ఈ కారణంగానే  చాలామందికి  జుట్టు రాలడం,  బూడిద రంగులోకి మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.   జుట్టు సమస్యలను నివారించడానికి శరీరంలో పిత్త స్వభావాన్ని సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం కొన్ని చిట్కాలు పాటించాలి.

స్వీట్లు, పాలు..

శరీరంలో పిత్త స్వభావాన్ని  సమతుల్యం చేయడానికి, ఆహారం నుండి తీపి పదార్థాలు,  పాలు,  పాల  ఉత్పత్తులను తొలగించాలి. ఈ రెండు తీసుకుంటే శరీరంలో  పిత్తాన్ని సమతుల్యం చేసే ప్రక్రియ జరగదు.  జుట్టు రాలడంతో పాటు శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తాయి.అందుకే స్వీట్లు, పాలు, పాల ఉత్పత్తులను మానేయాలి.

నాన్ వెజ్..

శ్రావణ మాసంలో సాధారణంగా  మాంసాహారం తినవద్దని చెబుతారు. దీని వెనుక మతపరమైన కారణమే కాకుండా  శాస్త్రీయ కారణం కూడా ఉంది.  పిత్తాన్ని సమతుల్యం చేయడానికి మాంసాహారం తినకుండా ఉండాలి.

ఎండ..

పిత్తాన్ని సమతుల్యం చేయడానికి ఎండలో తక్కువగా బయటకు వెళ్లాలి.  ఎక్కువ నీరు త్రాగాలి. ఇది జుట్టు రాలడం సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది . ఇది జుట్టుకే కాదు..   ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

చియా విత్తనాలు..

పిత్త స్వభావాన్ని సమతుల్యం చేయడానికి  చియా విత్తనాలను నీటిలో నానబెట్టి త్రాగాలి. దీని కోసం  చియా విత్తనాలను ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

బాదం బంక..

బాదం బంకను గోండ్ కటిరా అంటారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. దీన్ని కొద్దిగా నీటిలో నానబెట్టి సుమారు 4 గంటల తరువాత తినవచ్చు. ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.  జుట్టు సమస్యలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

                               *రూపశ్రీ.