పసిపిల్లల విసుగు పుట్టించే ప్రవర్తనతో విసిగిపోతున్నారా..ఈ షాకింగ్ నిజాలు తెలుసా!

పసిపిల్లల విసుగు పుట్టించే ప్రవర్తనతో విసిగిపోతున్నారా..ఈ షాకింగ్ నిజాలు తెలుసా!

పిల్లలను పెంచడం ఎంత ఛాలెంజెస్ తో  కూడుకున్నదో, అంతే అందమైనది కూడా. ముఖ్యంగా ఇంట్లో పసిపిల్లలు, అంటే 1 నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఉన్నప్పుడు, వారి కొన్ని అలవాట్ల వల్ల తల్లిదండ్రులు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ప్రతిదానికీ 'వద్దు' అని చెప్పడం, చిన్న విషయాలకే ఏడవడం లేదా కోపగించుకోవడం, ఆహారాన్ని పారేయడం వంటి పనులు చేస్తుంటారు. తమ పిల్లలు ఇలా ఎందుకు చేస్తున్నారని తల్లిదండ్రులను ఆలోచించేలా చేస్తాయి. కానీ చిన్న పిల్లల వైద్య  నిపుణులు ఈ ప్రవర్తన చాలా వరకు సాధారణమైనవేనని, ఇవి పిల్లల ఎదుగుదలలో ఒక సహజమైన భాగమని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

పిల్లలు అన్నింటికి వద్దని చెబుతుంటే..

పిల్లలు ప్రతిదానికీ 'కాదు' అని చెబితే, అది మొండితనం  లేదా పెద్దల మాట వినడం లేదని అనుకోవడం కాదని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు.  నిజానికి అది  పిల్లలు తమకంటూ ఒక స్వతంత్ర గుర్తింపును ఏర్పరచుకోవడం నేర్చుకుంటున్నారనడానికి ఒక సంకేతమట. ఈ వయస్సులో, పిల్లలు తమకు తమ సొంత ఇష్టాలు, అభిప్రాయాలు ఉండవచ్చని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారట. 'కాదు' అని చెప్పడమనేది వారు తమ నిర్ణయాలను వ్యక్తపరిచే ఒక మార్గంగా మారుతుందట.

ఆహారాన్ని పారవేసే అలవాటు..

భోజనం చేసేటప్పుడు పిల్లలు ఆహారాన్ని విసిరేయడం చాలా మంది తల్లిదండ్రులకు ఒక పెద్ద ఆందోళన కలిగించే విషయం. ఈ అలవాటు వల్ల కచ్చితంగా  పిల్లల చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చిందరవందర అవుతుంది, అయితే  ఇది పిల్లలు నేర్చుకునే దశ..   పిల్లలు ఈ విధంగా కారణం-ఫలితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని పిల్లల వైద్యులు చెబుతున్నారు. కొన్ని సార్లు పిల్లలు ఇలా చేయడం  వారి కడుపు నిండిపోయిందని, ఇంకా తినడానికి ఇష్టపడటం లేదని సూచించే ఒక సంకేతం కావచ్చని అంటున్నారు.

ఏడుపు, కోపం..

పిల్లలు చిన్న చిన్న విషయాలకే గట్టిగా ఏడవడం లేదా కోపగించుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. కొన్నిసార్లు, వారికి ఇష్టమైనది ఏదైనా దొరక్కపోయినా లేదా ఒక చిన్న మార్పు జరిగినా వారి మూడ్ పాడవుతుంది. ఈ వయస్సులో పిల్లల మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం పూర్తిగా అభివృద్ధి చెందదని చిన్న పిల్లల వైద్యులు వివరిస్తున్నారు. అందువల్ల, పెద్దలకు చిన్నవిగా అనిపించే విషయాలు పిల్లలకు చాలా ముఖ్యమైనవిగా ఉండవచ్చట.

చాలామంది పసిపిల్లలు ఒకే కథను పదే పదే వినాలని, ఒకే పాటను వినాలని, లేదా ప్రతిరోజూ ఒకే దినచర్యను అనుసరించాలని కోరుకుంటారు. తల్లిదండ్రులకు ఈ అలవాటు విసుగుగా అనిపించవచ్చు, కానీ పునరావృతం పిల్లలకు భద్రతా భావాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. సుపరిచితమైన విషయాలు వారికి సౌకర్యవంతంగా అనిపించేలా చేసి, అభ్యసన ప్రక్రియను బలపరుస్తాయి.

బొమ్మలు షేర్ చేసుకోవడం..

ఈ వయస్సు పిల్లలలో బొమ్మలు లేదా వస్తువులను పంచుకోవడానికి అస్సలు  ఒప్పుకోరు.  గొడవ చేయడం  కూడా సర్వసాధారణం. పసిపిల్లలు సహజంగానే స్వార్థపరులుగా ఉంటారని, పంచుకోవడం గురించిన నిజమైన అవగాహన సాధారణంగా మూడు నుండి నాలుగు సంవత్సరాల వయస్సులో అభివృద్ధి చెందుతుందిని, అందువల్ల పిల్లవాడు తన బొమ్మలు, వస్తువులు  పంచుకోవడానికి ఇష్టపడకపోతే, దానిని తప్పు ప్రవర్తనగా కాకుండా వారి వయస్సుకు తగినదిగా పరిగణించాలని పిల్లల వైద్యులు చెబుతున్నారు.

కాబట్టి  ఎవరైనా సరే.. పిల్లల ప్రవర్తన పైన చెప్పుకున్న విధంగా ఉంటే.. తమ పిల్లలు దురుసు ప్రవర్తనతో ఉన్నారని, వారు తప్పు చేస్తున్నారని అనుకోకుండా.. పిల్లల కోణం నుండి ఆలోచించి, అది వారి అభివృద్దికి మంచిదే అని అర్థం చేసుకోవాలి.

                            *రూపశ్రీ.