గేయరచయిత వెన్నెలకంటి ఇక లేరు
on Jan 5, 2021

2021 ఆరంభంలోనే చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. వెన్నెలకంటిగా సుప్రసిద్ధులైన సినీ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం గుండె పట్టేయడంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. మొదట్లో స్ట్రయిట్ సినిమాలకు పాటలు రాసిన ఆయన తదనంతర కాలంలో తమిళం నుంచి డబ్ అయిన తెలుగు సినిమాలకు అత్యధికంగా పాటలు, సంభాషణలు రాశారు. పదకొండేళ్ల చిన్నవయసులోనే కవితలు, పద్యాలు రాయడం ద్వారా ప్రతిభ ప్రదర్శించిన వెన్నెలకంటి ఏక్ దిన్ కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి జంద్యాల రాసిన నాటకాలలో నటించారు.
1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించారు వెన్నెలకంటి. బీకామ్ చదివి, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగంలో చేరారు. ఆ టైమ్‌లోనే 'ఉషోదయం ఆపలేవు' అనే కవితా సంకలనంతో సాహితీ లోకంలో తన రాకను బలంగా తెలియజేశారు. ఆ సంకలనంపై, వెన్నెలకంటిపై అప్పటి ప్రఖ్యాత కవి నాగభైరవ కోటేశ్వరరావు, "ఇది ఆవేదన - ఆవేశం - ఆశ - సంతాపం - సంకల్పం - సంఘర్షణ - నిరీక్షణల ఏడు రంగుల్ని తన గుండెల్లో యిముడ్చుకొని ఏకవర్ణాన్ని పైకి చిమ్ముతోన్న యింద్ర ధనస్సు" అని అభివర్ణించడం ఆయన అసామాన్య కవితా శక్తికి నిదర్శనం.
డా. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలంతో శ్రీరామచంద్రుడు సినిమాలో రాసిన చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాటతో గీత రచయితగా చిత్రసీమకు పరిచయం అయ్యారు వెన్నెలకంటి. అయితే ముందుగా విడుదలైన చిత్రం 'ఇదా ప్రపంచం' (1987). కమల్ హాసన్ టైటిల్ రోల్ చేయగా మణిరత్నం రూపొందించిన 'నాయకుడు' సినిమాతో అనువాదం రంగంలోకి ప్రవేశించారు.
మహర్షి, చెట్టుకింద ప్లీడరు, ఏప్రిల్ 1 విడుదల, ఆదిత్య 369, స్వాతి కిరణం, అల్లరి ప్రియుడు, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, అన్నయ్య, నరసింహనాయుడు, చంద్రముఖి తదితర చిత్రాలు వెన్నెలకంటి రచనా ప్రతిభకు నిదర్శనం. ఆయన పాటలెన్నో పాపులర్ అయ్యాయి. దాదాపు 2000 పాటలు రాసిన ఆయన 300 సినిమాలకు సంభాషణలు అందించారు. ఆయన కుమారుల్లో శశాంక్ ఆయన వారసుడిగా డబ్బింగ్ సినిమాల మాటల రచయితగా, రాకేందు మౌళి నటుడిగా, గేయ రచయితగా రాణిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



