ఓటీటీ రిలీజెస్.. ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్‌దే హవా
on Jun 8, 2020

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఇలా ప్రతీ చిత్రపరిశ్రమపై కరోనా ప్రభావం మామూలుగా లేదు. విడుదలకు సిద్ధమైన ఎన్నో సినిమాలు కరోనా కారణంగా థియేట్రికల్ రిలీజెస్‌ని మిస్ అయ్యాయి. పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాకే తమ సినిమాలను విడుదల చేయాలని, ఆడియన్స్‌కు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలోనే ఆనందం ఉందని చాలా మంది దర్శకనిర్మాతలు భావిస్తుంటే.. కొందరు మాత్రం ఓటీటీ (ఓవర్ ది టాప్) రిలీజెస్‌ను ఆశ్రయిస్తున్నారు.
ఈ క్రమంలోనే.. పలు ఆసక్తికరమైన సినిమాలను ఏదో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ (అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5..) రిలీజ్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇలా విడుదలవుతున్న సినిమాల్లో చాలామటుకు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కావడం విశేషం. ఇంకొన్ని మాత్రం కథానాయకుడి పాత్రకి ధీటుగా ఉండే నాయికల పాత్రల చుట్టూ తిరిగే సినిమాలు కావడం గమనార్హం.
తెలుగునాట తొలి ఓటీటీ మూవీ రిలీజ్‌గా వచ్చిన ‘అమృతరామమ్’ విషయానికొస్తే.. పేరుకిది ప్రేమకథా చిత్రమే అయినా అమృత (అమితా రంగనాథ్) పాత్ర చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ఇక ఇటీవల విడుదలైన ‘పొన్‌మగళ్ వందాళ్’ (తమిళం) సంగతి తీసుకుంటే.. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఓ లేడీ లాయర్ చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రలో టాలెంటెడ్ యాక్ట్రస్ జ్యోతిక కనిపించింది. ఇక ఈ నెల 19న రిలీజ్ కానున్న త్రిభాషా చిత్రం (తెలుగు, తమిళ, మలయాళం) ‘పెంగ్విన్’ కూడా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మే. ‘జాతీయ ఉత్తమ నటి’ కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా కూడా నాయిక పాత్ర చుట్టూనే తిరుగుతుంది.
అంతేకాదు.. త్వరలో ఓటీటీ రిలీజ్‌గా రానున్న బయోపిక్ మూవీ ‘శకుంతలా దేవి’(హిందీ) కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీనే. ‘జాతీయ ఉత్తమ నటి’ విద్యాబాలన్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రమిది. ఇక రీసెంట్‌గా రిలీజైన ‘చోక్డ్’(హిందీ) కూడా ఈ తరహా చిత్రమే. ‘రేయ్’ ఫేమ్ సయామీ ఖేర్ ముఖ్య భూమిక పోషించిన ఈ థ్రిల్లర్ మూవీ కూడా నాయిక పాత్ర చుట్టే తిరుగుతుంది. అంతేకాదు.. త్వరలో రాబోతున్న ఓటీటీ రిలీజ్ మూవీస్ ‘లా’ (కన్నడ - రాగిణి ప్రజ్వల్ ప్రధాన పాత్రధారిణి), ‘సుఫియుమ్ సుజాతయుమ్’ (మలయాళం - అదితీరావ్ హైదరి ప్రధాన పాత్రధారిణి) కూడా ఇదే కేటగిరీకి చెందిన సినిమాలే. అలాగే ఓటీటీ రిలీజ్‌గానే జనం ముందుకు వచ్చే అవకాశం ఉన్న ‘మిస్ ఇండియా’ (కీర్తి సురేష్) కూడా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తోనే తెరకెక్కింది.
మొత్తమ్మీద ఓటీటీ రిలీజ్ మూవీస్‌కి సంబంధించి ఇన్షియల్ రిలీజెస్‌లో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌దే హవా కావడం వార్తల్లో నిలుస్తోంది. మున్ముందు కూడా ఇదే శైలి కొనసాగుతుందేమో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



