ప్రభాస్ రేంజ్‌ని అందుకోగలడా.. చిరంజీవి కోరిక తీరుతుందా?
on Dec 27, 2022

ప్రస్తుతం తెలుగులో ఉన్న దర్శకులలో మారుతి, అనిల్ రావిపూడి వంటి వారు మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తీస్తారు. మారుతి విషయానికి వస్తే కెరీర్ మొదట్లో ఆయన లో- బడ్జెట్ లో ‘ఈరోజుల్లో, బస్ స్టాప్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకుని డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తన కెమెరామెన్ ప్రభాకర్ రెడ్డితో ‘ప్రేమకథా చిత్రం’ తీశారు. ఈ మూవీ పెద్ద హిట్ అయింది. హర్రర్ కామెడీ చిత్రాలకు నాంది పలికింది. ఆ తర్వాత ఆయన ‘రొమాన్స్, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్, లవర్స్’ వంటి చిత్రాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు. ఇవేమీ ఆయనకు పెద్దగా పేరు తీసుకొని రాలేదు. అల్లు అరవింద్ దృష్టిలో పడిన తర్వాత అల్లు శిరీష్ తో కొత్తజంట అనే సినిమా తీసే అవకాశం వచ్చింది, అల్లు శిరీష్ కెరీర్‌లో కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు మాత్రమే చెప్పుకోదగ్గ చిత్రాలు.
ఇక మారుతి నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ తో ఒక్కసారిగా టర్న్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించి తీరు, ఎంటర్టైన్మెంట్ ను వైవిధ్యంగా చూపించిన విధానం అందరికీ బాగా నచ్చాయి. ఆ వెంటనే వెంకటేష్ తో బాబు బంగారం అనే సినిమాల్లో అవకాశం వచ్చిన ఆ మూవీ పెద్దగా హిట్ కాలేదు. ఇక శర్వానంద్ హీరోగా మహానుభావుడు అనే సినిమాని మానసిక సమస్య అయిన ఓసిడి మీద తీసి మెప్పించారు. ఈ పాయింట్‌ను ఆయన ఎంతో సున్నితంగా, ఎంటర్టైన్మెంట్ రంగరించి చూపించిన విధానం చాలా నచ్చింది. కానీ ఆ వెంటనే నాగచైతన్యతో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో శైలజా రెడ్డి అల్లుడు తీస్తే అది మెప్పించలేకపోయింది. తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా ఆయన చేసిన ప్రతిరోజు పండగే మంచి విజయాన్ని నమోదు చేసింది. మంచి రోజులు వచ్చాయి పెద్దగా ఆడలేదు. ఇటీవల గోపీచంద్ తో పక్కా కమర్షియల్ చిత్రం తీసిన అది కూడా పెద్దగా మెప్పించలేదు. ఇలా ఈయన వెంకటేష్, గోపీచంద్ వంటి ఇమేజ్ ఉన్న వారిని సరిగా డీల్ చేయలేకపోయారనే అపవాదు వచ్చింది.
మరోవైపు ప్రభాస్ విషయానికి వస్తే... ఆయనకు బాహుబలి 1, బాహుబలి 2 ల తర్వాత సరైన హిట్టు లేదు. సాహో, రాధేశ్యామ్‌లు నిరాశపరిచాయి. ఇక ఆయన ఫీచర్ ప్రాజెక్ట్ అయిన సలార్, ఆదిపరుష్, ప్రాజెక్టుకె, స్పిరిట్ వంటివి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇలాంటి సమయంలో కాస్త వేగంగా సినిమాలను తీసే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక విభిన్న ప్రయత్నం చేస్తున్నారు. హర్రర్ కామెడీ చిత్రంగా ఓ మూవీని ఏకంగా ప్రభాస్‌తో తీస్తున్నారు. మరి ఇది పాన్ ఇండియా లెవెల్ చిత్రమా కాదా అనేది ఇంకా తెలియదు. తాజాగా ఈ చిత్రం లోకేషన్ నుండి ప్రభాస్ లుక్ లీక్ అయింది. పక్కా కమర్షియల్ సినిమా రిజల్ట్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని బాగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో మారుతి ఈ చిత్రం అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. సినిమా పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆయన అప్డేట్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. కాగా లీకైన లుక్కుపై ప్రభాస్ అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్నటిదాకా ట్రోల్ చేసిన అభిమానులు ఇప్పుడు తమ హీరోని కొత్తగా చూపిస్తున్నారు అని ఆనందపడిపోతున్నారు. ఎంతైనా అభిమానులు అంటే బోళా శంకరులు కదా...!
ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట. దాంతో ఈ ముగ్గురు హీరోయిన్లు ఈ చిత్రంతో తమ జాతకం మారిపోతుందని నమ్ముతున్నారు. మరి మారుతి ప్రభాస్‌కి సరైన సక్సెస్ ఇస్తాడా? ప్రభాస్ నమ్మకాన్ని నిలబెడతారా? ప్రభాస్ రేంజ్ స్టార్‌ని మారుతి సరిగా హ్యాండిల్ చేయగలరా? అనేవి ప్రశ్నార్థకాలు. ఎందుకంటే ప్రభాస్ మూవీ హిట్ అయితే మారుతి తో సినిమా చేయడానికి అల్లు అర్జున్ తో పాటు చిరంజీవి కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. చిరంజీవి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో నటించిన ఎంతో కాలమైంది. నాటి దొంగ మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు రేంజ్‌లో మారుతీ తో ఓ పూర్తి అవుటెండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చిత్రం చేయాలనుకుంటున్నారు. అల్లుడా మజాకా లాంటి చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ప్రభాస్ చిత్రం విడుదల అయితే గానీ మారుతి కోరికతో పాటు చిరంజీవి కోరిక కూడా తీరుతుందా? లేదా? అనే విషయాలపై క్లారిటీ వస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



