అనుపమ మనసు మెగా ఫోన్ పై పడింది!
on Dec 27, 2022

తెలుగులో మహిళా దర్శకులు చాలా తక్కువ అని చెప్పాలి. అందులోనూ హీరోయిన్లుగా కొనసాగుతూ మెగా ఫోన్ చేపట్టిన వారు చాలా తక్కువ. సినిమా రంగం అనేది పురుషాధిక్య ప్రపంచం. అన్ని రంగాల్లాగానే ఇక్కడ కూడా మేల్ డామినేషన్ కొనసాగుతుంది. అయితే అది మిగిలిన రంగాల కంటే ఒక వంద పాళ్లు ఎక్కువ. అందుకే ఇక్కడ పెద్దగా హీరోయిన్లకు ప్రాధాన్యం ఉండదు. వారు ఏదో హీరోల పక్కన పాటలు, స్టెప్స్ వేస్తూ అందాలను ఆరబోసే బుట్ట బొమ్మలుగానే వారిని చూస్తారు. వారి టాలెంట్‌ను అసలు పట్టించుకోరు. అయినా కూడా టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు దర్శకరాళ్లుగా మారి రాణించారు. వారిలో ఎన్నో చిత్రాల్లో నటించి, ఏకంగా 48 చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన నటి, దర్శకురాలు విజయనిర్మల పేరు ముందుగా చెప్పుకోవాలి. ఆ తర్వాత వరసలో సావిత్రి, భానుమతిలు కూడా మెగా ఫోన్ చేపట్టారు. ఇటీవల దృశ్యం చిత్రంతో ఒకనాడు అంతులేని కథ, చిలకమ్మ చెప్పింది, వయసు పిలిచింది, బెజవాడ బెబ్బులి, కొంగుచాటు కృష్ణుడు వంటి చిత్రాల్లో నటించిన శ్రీ ప్రియ మెగా ఫోన్ చేపట్టింది. వీరందరూ బాగానే రాణించారు.
ఇక నేటి హీరోయిన్లలో కీర్తి సురేష్, సాయి పల్లవి, సమంత వంటి వారికి కూడా మెగా ఫోన్ చేపట్టాలని ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ వంతు మరో టాలెంటెడ్ మలయాళకుట్టి అనుపమ పరమేశ్వరన్ దగ్గరకు వచ్చింది. ఈమె నటిగా తనదైన ప్రతిభతో, గ్లామర్ తో విశేషంగా రాణిస్తోంది. మలయాళ సినిమాల ద్వారా పరిచయమైన ఈమె తెలుగులో ‘అ ఆ, ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ ఐ లవ్ యు, హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్, అంటే సుందరానికి, కార్తికేయ 2, 18 పేజెస్’ చిత్రాల్లో నటించి మెప్పించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆమె ప్రతిభకు మాత్రం ఎవ్వరు వంక పెట్టలేదు. ఆమె నటించిన కార్తికేయ 2 ఇటీవలే పాన్ ఇండియా వైడ్‌గా సంచలనం సృష్టించింది.
ఇక 18 పేజెస్ చిత్రం ఫీల్‌గుడ్ మూవీగా, సెన్సిబుల్ లవ్ స్టోరీ గా ప్రశంసలు అందుకుంటుంది. ఈమె తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘‘తన కెరీర్ గురించి తన అభిరుచులు, గోల్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నటిగా నాకు ఎన్నో సినిమాల్లో నటించాలని ఉంది. ఇప్పటివరకు నేను ప్రేమ కథ చిత్రాల్లోనే నటించాను... మరెన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని ఉంది. నాకు నటన కాకుండా డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. నా జీవితంలో ఒక్కసారి అయినా మెగా ఫోన్ పట్టుకోవాలని నా కోరిక. అయితే ఎప్పుడైతే మెగా ఫోన్ చేపట్టాలని అనుకుంటానో ఆ సమయంలో ఒక ఏడాదిపాటైన నటనకు బ్రేక్ ఇస్తాను.
మంచి డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తాను. ఒక ఏడాదిలో వారి నుండి శిక్షణ తీసుకొని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోని మెలకువలు నేర్చుకుంటాను. ఇప్పటికే నా మదిలో చాలా కథలు ఉన్నాయి. అయితే నటిగా ముందు మరికొన్ని సినిమాల్లో నటించాలని ఉంది. అందుకని ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై కాకుండా కేవలం నటనపై దృష్టి పెట్టాను’’ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ హీరోయిన్ మెగా ఫోన్ చేపట్టాలని తన కోరికను బాహాటంగా స్వయంగా వెల్లడించింది. మరి ఈమె నటించే చిత్రాల్లాగానే ఈమె డైరెక్షన్ చేయబోయే చిత్రం కూడా మంచి అభిరుచి కలిగిన చిత్రమై ఉంటుందని భావించవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



