తెలుగులో 'కాంతార'.. మరో 'కేజీఎఫ్' అవుతుందా!
on Oct 14, 2022

'కేజీఎఫ్' తర్వాత కన్నడ సినిమాలపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది. 'కేజీఎఫ్'ను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ నుంచి ఇటీవల వచ్చిన 'కాంతార'పై అందరి దృష్టి పడింది. కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకొని రూ.100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. రేపటి నుంచి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనుంది.
'కాంతార' చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రిషబ్ తో పాటు సప్తమి, కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించారు. తెలుగులో 'కాంతార'ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తుండటం విశేషం. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం రేపు(అక్టోబర్ 15న) విడుదల కానుంది. ఈ చిత్రం కూడా తెలుగులో 'కేజీఎఫ్'లాగా మంచి ఆదరణ పొందుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
తెలుగులో 'కేజీఎఫ్-1' రూ.10 కోట్లకు పైగా షేర్ రాబట్టగా, 'కేజీఎఫ్-2' మాత్రం ఏకంగా రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. డబ్బింగ్ సినిమాకి, అందునా కన్నడ సినిమాకి ఈ స్థాయిలో తెలుగు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం అదే మొదటిసారి. ఇప్పుడు 'కాంతార' కూడా 'కేజీఎఫ్' అంత కాకపోయినా చెప్పుకోదగ్గ ఆదరణ దక్కించుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
'కాంతార' తెలుగు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. డబ్బింగ్ సినిమా పరంగా చూస్తే తెలుగులో 'కాంతార' అడ్వాన్స్ బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. పైగా ఇప్పుడు థియేటర్స్ లో 'గాడ్ ఫాదర్' తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దానికితోడు సోమవారం నుంచి 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. తెలుగులోనూ 'కాంతార' హిట్ టాక్ తెచ్చుకుంటే.. ఈ వారం తెలుగు సినీ ప్రియులకు ఇదే ఫస్ట్ ఛాయస్ కానుంది. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 300 కి పైగా థియేటర్స్ లో విడుదలవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



