గోపీసుందర్ మరో విద్యాసాగర్ కాబోతున్నారా!?
on Dec 30, 2022

వాస్తవానికి తెలుగువాడైన విద్యాసాగర్ తెలుగులో పలు చిత్రాలకు సంగీతం అందించారు. కానీ ఆ చిత్రాలు సరైన పేరును తీసుకుని రాకపోవడంతో సరైన అవకాశాలు రాక, మలయాళ పరిశ్రమకు వెళ్లి అక్కడ తన సత్తా చాటుకున్నారు. విద్యాసాగర్ అతికొద్ది చిత్రాలతోనే తన సత్తా చాటుకున్నప్పటికీ ఆయనకెందుకో తెలుగులో వరుస అవకాశాలు రాలేదు. ఆయనకు వచ్చిన ఒకే ఒక పెద్ద చిత్రం అంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'ముగ్గురు మొనగాళ్లు'. ఆ చిత్రం మ్యూజికల్ గా హిట్ అయినా సినిమా ఫ్లాప్ కావడంతో ఆ ఎఫెక్ట్ విద్యాసాగర్ పై తీవ్రంగా పడింది.
ఎంతో టాలెంట్ ఉన్న ఆయనకు మన స్టార్ హీరోలు, మేకర్స్ అవకాశాలు ఇవ్వలేదు. దాంతో ఆయన తమిళ, మలయాళ భాషలకు తరలి వెళ్లారు. ఇతర భాషల్లో ఆయన ట్యూన్ చేసిన ఒరిజినల్ సాంగ్స్ నే తెలుగులో మనవారు ఇతర సంగీత దర్శకులను పెట్టి కాపీ కొట్టేవారు.
ప్రస్తుతం ఇదే పరిస్థితి గోపీసుందర్ కు కూడా ఎదురయ్యేటట్టు ఉంది. వాస్తవానికి ఈయన మలయాళీ. కానీ ఈయనకు తెలుగులో కూడా ఓ మోస్తరు అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన అవకాశాలన్నింటిని ఆయన ఎంతో బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా గీత ఆర్ట్స్ 2లో ఆయన ఆస్థాన సంగీత దర్శకునిగా సాగుతున్నారు. తెలుగులో ఆయన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', 'భలేభలే మగాడివోయ్', 'ఊపిరి', 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు', 'బ్రహ్మోత్సవం', 'మజ్ను', 'ప్రేమమ్', 'నిన్ను కోరి', 'గీతగోవిందం', 'మజిలీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', '18 పేజెస్' వంటి చిత్రాలకు సంగీతం అందించారు.
ఆయనకు వచ్చిన పెద్ద ఆఫర్ అంటే అది 'బ్రహ్మోత్సవం' చిత్రమే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ చిత్రం కూడా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. దాంతో గోపి సుందర్ కు పెద్ద పెద్ద హీరోలు ఛాన్స్ ఇవ్వడం మానేశారు. అయినప్పటికీ ఆయన తనకు వచ్చిన అవకాశాలన్నింటిలో తన సత్తా చాటుకుంటూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా 'గీత గోవిందం', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', 'భలేభలే మగాడివోయ్', 'ఊపిరి', 'ప్రేమమ్', 'మజిలీ', '18 పేజెస్' చిత్రాలకు ఆయన అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం అని చెప్పాలి. కానీ ఎందుకనో ఆయనకు సరైన అవకాశాలు రావడం లేదు.
తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలకు, భారీ బడ్జెట్ చిత్రాలకు కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే పరిశీలిస్తున్నారు. వారిలో ఒకరు దేవి శ్రీప్రసాద్ కాగా మరొకరు తమన్. అప్పుడప్పుడు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ కి అవకాశాలు ఇస్తున్నారు. కాని గోపీసుందర్ అంటే పెద్దగా పట్టించుకోవడం లేదు. సంగీతం అందించిన 'గీత గోవిందం' చిత్రం పెద్ద హిట్ కావడంతో ఈయనకు ఇక అవకాశాలు బాగా వస్తాయి అని అందరూ భావించారు. అంతకుముందు 'భలే భలే మగాడివోయ్' సమయంలో కూడా అదే జరిగింది. కానీ టాప్ స్టార్స్ ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఆయన అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఇప్పటివరకు పెద్ద స్టార్స్ ఎవరూ ఆయనకి ఛాన్సులు ఇవ్వలేదు. స్టార్ డైరెక్టర్స్ ఆయన పేరును అసలు పరిశీలించడం లేదు. ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు అదృష్టం, మాటకారితనం కూడా ఉండాలి. ఆ విషయాలలో గోపీసుందర్ వెనుకబడి ఉన్నారు. అందుకే టాలీవుడ్ లో ఇంకా చిన్న హీరోలకు, మీడియం బడ్జెట్ సినిమాలకు మాత్రమే సంగీత దర్శకునిగా మిగిలిపోతున్నారు. ముందు ముందు అయినా ఆయనకు పెద్ద సినిమాలు వస్తాయో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



