పాన్ ఇండియా, పాన్ వరల్డ్ చిత్రాలంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే!
on Dec 30, 2022

ప్రస్తుతం తెలుగు నాట ఏ హీరో నోట చూసినా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ముచ్చటే వినిపిస్తోంది. వాస్తవానికి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లో ఓ సినిమా బాగా ఆడాలంటే కంటెంట్ అద్భుతంగా ఉండాలి. యూనివర్సల్ సబ్జెక్టుగా ఉండి చాలా ఫ్రెష్ గా ఉండాలి. మాస్ కమర్షియల్ సినిమా అయినప్పటికీ కాస్త రియలిస్టిక్‌గా ఉంటే అది మరింత ప్లస్ అవుతుంది. ఆ విషయం 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్', 'కార్తికేయ 2' లతో నిరూపితమైంది. ఇక 'పుష్ప' చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించింది. అయితే ఇలాంటి చిత్రాల విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కోట్లలో నష్టాలే కాక ఖర్చులు కూడా రావు. కంటెంట్ లేని చిత్రాలను ఈ రేంజిలో విడుదల చేస్తే తిప్పలు తప్పవు. అసలు నష్టాలు గాక మరిన్ని నష్టాలను నెత్తి మీదకు తెచ్చుకోవడమే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక సినిమా ప్రమోషన్ అనేది చాలా వ్యయంతో కూడుకున్న పని అయిపోయింది. సోషల్ మీడియా ఉన్నప్పటికీ ప్రెస్ మీట్ లు పెట్టడం, అన్ని భాషల మీడియా వారితో ప్రెస్ మీట్ లు పెట్టి ఈ సినిమాను ప్రమోట్ చేయడం, దేశవ్యాప్తంగా తిరుగుతూ అన్ని చోట్ల ప్రమోషన్స్ నిర్వహించడం, పోస్టర్ ఖర్చులు, ప్రింట్ ఖర్చులు, పబ్లిసిటీ ఖర్చులు ఇలా ఎన్నో ఉంటాయి.
ఇక విషయానికి వస్తే గత కొంతకాలంగా భారతీయ సినీ స్వరూపం సమూలంగా మారిపోయింది. కరోనా ఎఫెక్ట్ పుణ్యమా అని ఓటీటీలు తమ హవా కొనసాగిస్తున్నాయి. దాంతో మన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇంతకాలం తమదైన చిత్రాలను చూస్తూ వచ్చిన వారు తెలుగులో వచ్చే మాస్ యాక్షన్ భారీ చిత్రాలను చూసి ఔరా... ఇవి కూడా గమ్మత్తుగా ఉన్నాయి అనుకుంటున్నారు. ఎందుకంటే వారికి పాటలు, ఇలాంటి పోరాట దృశ్యాలు, ఇతర హాస్యం వంటివి సరికొత్తగా అనిపిస్తూ ఉంటాయి. కొత్త ఒక వింత... పాత ఒక రోత అన్న టైపులో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలామంది విదేశీ ప్రియులు కూడా తమ చిత్రాలను పక్కనపెట్టి తెలుగు చిత్రాలు భలే తమాషాగా ఉంటాయంటూ చూడటం మొదలుపెట్టారు. అది రాను రాను క్రేజీగా మారిపోయింది.
ఇక కన్నడ చిత్రం 'కాంతారా' విషయానికి వస్తే బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకి వందల కోట్ల వసూళ్ళతో కాసుల వర్షం కురిపించింది. కేవలం ఓ ప్రాంతీయ భాష నేటివిటీతో రూపొందిన ఈ చిత్రం ఏకంగా ఆ స్థాయిలో వసూళ్లను రాబట్టడం అనేది కనీవినీ ఎరుగని సంఘటన. ఒక లాంగ్వేజ్ లో వారి సాంప్రదాయాలకు అనుగుణంగా తీసిన చిత్రం ఇలా ప్రభంజనం సృష్టించడం ముందుగా ఎవరు ఊహించలేదు. రీసెంట్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైంది. అక్కడ 24 కోట్ల వరకు రాబట్టింది. ప్రమోషన్స్ కోసం కూడా భారీగానే ఖర్చు చేశారు. అయితే రికవరీ కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది.
పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో అంటే భారీ స్థాయిలో కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆ మొత్తం రిటర్న్ వస్తుందని గ్యారెంటీ కనిపించకపోవడం ఇక్కడ ఆందోళన కలిగించే విషయం. ఇదే రీసెంట్ గా 'పుష్ప' మూవీ విషయంలో జరిగింది. ఈ చిత్రాన్ని రష్యాలో భారీగా విడుదల చేశారు. ఇందుకోసం మూడు కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ ఈ సినిమా రష్యాలో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఫలితంగా ప్రమోషన్స్ కోసం ఇతర ఖర్చులు కోసం పెట్టినవి తిరిగి రావడం కూడా గగనమైపోయింది. దాంతో మైత్రి వారికి రష్యాలో పుష్ప విడుదల పెద్ద నష్టం కలుగజేసింది అని అంటున్నారు.
ఇప్పుడు ఇలా విడుదల చేయాలంటే మైత్రి వారు కాస్త భయపడుతున్నారట. 'పుష్ప2'ని కూడా ఇదే రేంజిలో విడుదల చేయాలని ముఖ్యంగా రష్యాలో తప్పనిసరిగా విడుదల చేయాలని మేకర్స్ పై ఒత్తిడి పెరిగిందని తెలుస్తోంది. దీంతో ఇది ఇప్పుడు మైత్రి వారికి పెద్ద తలనొప్పిగా మారినట్టు సమాచారం. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ దశలో ఉంది. మరి ఈ చిత్రాన్ని ఎక్కడ ఎలా ఎప్పుడు రిలీజ్ చేయాలనేది బన్ని, సుకుమార్ లపై ఆధారపడి ఉంది. అయితే వారు మైత్రి వారి బాధను అర్థం చేసుకొని తమ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటారని ఇన్ సైడ్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



