గొప్పనటుడిని ఏమాత్రం పట్టించుకోని కేంద్రం.. పద్మశ్రీకి కూడా అర్హుడు కాదా?
on Dec 26, 2022

సినీ పరిశ్రమలో కొంతమంది నటీనటులు భౌతికంగా మన మధ్య లేకపోయినా మనం బతికున్నంత కాలం.. ఈ జాతి ఉన్నంతకాలం మనకు గుర్తుండి పోతారు. ఎందుకంటే వాళ్లు పాత్రను పోషించే విధానం, అందులోకి పరకాయ ప్రవేశం చేసే తీరు, వారి బహుముఖ ప్రజ్ఞ, పాత్రలను పోషించే ఔన్నత్యం, వారి నిబద్ధత అలాంటివి. వారికి ఎలాంటి పాత్రలైనా కొట్టిన పిండి. ఏ పాత్రలను ఎలా రక్తి కట్టించాలనేది వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రేక్షకుల హృదయాలలో వేసుకున్న చిరస్థాయి ముద్ర అలాంటిది. అలాంటి వారికి నిజానికి అవార్డుల కంటే ప్రేక్షకులు ఇచ్చే రివార్డులే ముఖ్యం. వారికి ఏదైనా అవార్డు ఇస్తే అది ఆ అవార్డుకే నిండుతనం తెస్తుంది. అలాంటి అవార్డులు వారి ప్రతిభకు ఏమాత్రం కొలమానం కాదు.
సూపర్ స్టార్ కృష్ణ కూడా దీనికి ఓ ఉదాహరణ. ఒకసారి అవార్డులపై మండిపడిన నందమూరి బాలకృష్ణ తన ఆవేశం ఆపుకోలేక ఇవి నంది అవార్డులా? లేక పంది అవార్డులా?.. అని తన కోపాన్ని వెల్లగక్కారు. అలాంటి వారిలో కైకాల సత్యనారాయణ ఒకరు. 87 ఏళ్ల వయసు గల కైకాల సినిమాల కోసం 65 ఏళ్ల విలువైన కాలాన్ని కేటాయించారు. పౌరాణికం, జానపదం, కుటుంబం కథాచిత్రాలు నుండి కమర్షియల్ చిత్రాల వరకు తన సత్తా చాటారు. కైకాల సత్యనారాయణ పోషించని పాత్ర అంటూ ఏదీ లేదు. ఎస్వీ రంగారావు తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రలు పోషించిన ఏకైక నటుడు సత్యనారాయణ మాత్రమే. ఆయన యావత్ భారత దేశ చలనచిత్ర పరిశ్రమకి గర్వకారణం. ఆయన కన్నుమూయడం సినీలోకాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. సినిమా రంగంలో ఆయన చూడని శిఖరాలు మిగిలి లేవు. రాజకీయంగా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి మచిలీపట్నం నుంచి గెలుపొందారు. అలాంటి ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కకపోవడం అనేది సినీ పరిశ్రమకే అవమానం వంటిది. కేంద్రంలో ఇన్ని దశాబ్దాలలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ ఒక్క ప్రభుత్వం కూడా ఈ మేలిమి నట బంగారాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వలేదు అనేది ఇప్పటికే అర్థం కాని విషయం.
మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏనాడు అందుకోసం కృషి చేయలేదు. కైకాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కైకాలకు పద్మశ్రీ పురస్కారం ఇప్పించేందుకు ఏమాత్రం కృషి జరిగినట్లు కనిపించదు. ఎన్టీఆర్ కే భారతరత్న ఇప్పించలేని తెలుగువారు సత్యనారాయణకు పద్మ పురస్కారాలు ఇప్పించలేకపోవడంలో ఆశ్చర్యం ఏముంది...? అని కొంతమంది ప్రముఖులు వాపోతున్నారు. బతికి ఉన్నపుడు ఎలాగూ గుర్తించలేదు. కనీసం ఇప్పుడైనా సత్యనారాయణకి పద్మ పురస్కారం ఇస్తారో లేదో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



