ENGLISH | TELUGU  

విశాల్ రెడ్డి ఫలితం అనుభవిస్తున్నాడా?

on Dec 25, 2022

సినిమాలకు, రాజకీయాలకు తెలుగు, తమిళ రంగాలలో అవినాభావ సంబంధం ఉంది. సినీ నటులుగా, సినీ ప్రముఖులుగా వెలుగొందిన పలువురు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. వారిలో అతి కొద్ది మంది మాత్రమే విజయం సాధించారు. కొందరు ఒకటి, రెండు ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత రాజకీయాలకు దండం పెట్టేశారు. వీరిలో కృష్ణ, కృష్ణంరాజు వంటి ఉద్దండులతోపాటు కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, బాబు మోహన్ ఇలా ఎందరో ఉన్నారు. కానీ సక్సెస్ అయిన వారిలో మాత్రం కేవలం సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయ పార్టీని స్థాపించి ఆ తర్వాత త‌న పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేశారు. ఇక దాసరి, విజయశాంతిలు కూడా సొంత పార్టీలు పెట్టి దుకాణాలు మూసేశారు. 

తమిళనాడు విషయానికి వస్తే ఎంజీఆర్ నుంచి విజయ్‌కాంత్ వరకు ఎందరో రాజకీయాల్లో ప్రవేశించారు. వారిలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత మాత్రమే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగారు. కాబట్టి అందరూ నటులు సినిమాలలో ఎవర్ గ్రీన్ గా ఉన్నప్ప‌టికీ వారంద‌రు రాజకీయాల్లో సక్సెస్ అవుతారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కాబట్టి తొందరపడి సినీ నటులందరూ రాజకీయాల్లో రాణిస్తారు అనుకోవడం పొరపాటు. అసలు సినిమాలలో రాణిస్తున్న వారు తొందరపడి రాజకీయాల్లోకి రాకూడదు. ఏదో సినిమాలు తగ్గిపోయి తమ హవా తగ్గి సినిమా కెరీర్  ముగిసింది అనుకునే సమయంలో రాజకీయాలకు వస్తే సక్సెస్ అయినా కాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. 

ఇక్క‌డ మ‌నం మ‌రో ఉదాహ‌ర‌ణ కూడా చెప్పుకోవాలి. సీనియ‌ర్ ఎన్టీఆర్ ని ముఖ్య‌మంత్రిని చేసి, ఆయ‌న‌ను దేవుడిలా అంద‌రు కొలుస్తున్న స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ కృష్ణ ఏలూరు నుంచి ఎంపీగా గెలిచారు. అదే స‌మ‌యంలో ఆయ‌న ఎన్టీఆర్‌ని సెటైరిక‌ల్‌గా చూపిస్తూ ప‌లు చిత్రాలు తీశారు. ఆయ‌న తెలుగుదేశం అధికారంలోకి రావ‌డానికి ఈనాడు అనే చిత్రం స‌హాయ‌ప‌డింది. ఇది కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా కృష్ణ తీసిన చిత్రం. నాడు ఎన్టీఆర్ ఊపు బాగా ఉండ‌టం, కాంగ్రెస్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌టంతో ఈ చిత్రం విజ‌యం సాధించింది. కానీ ఎన్‌టిఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌లో చేరి.. నా పిలుపే ప్ర‌భంజ‌నం, సాహ‌స‌మే నా ఊపిరి చిత్రాలు తీశారు. ఇక తానే నిర్మాతగా ఆయ‌న మండ‌లాదీశుడు, గండిపేట ర‌హ‌స్యం చిత్రాలు తీశారు. ఆపై సింహాస‌నం చిత్రంలో కూడా ఎన్‌టిఆర్‌కి స‌న్నిహితుడైన స‌త్య‌నారాయ‌ణ పాత్ర ద్వారా ఎన్టీఆర్ పై సెటైర్స్ వేశారు. ఇందులో చాలా భాగం కృష్ణ‌పై వ్య‌తిరేక‌త‌ను పెంచి, త‌ర్వాత రెండోసారి కృష్ణ బోళ్ల‌బుల్లిరామ‌య్య‌పై ఓట‌మి చెంద‌డానికి కార‌ణం అయ్యాయి. 

ఇక విషయానికి వస్తే కొన్ని రోజుల కిందట నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకుడు శేఖర్. ఇతను పలు చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి మాచర్ల నియోజకవర్గంతో దర్శకునిగా మారాడు. ఇతను వైయస్సార్ పార్టీకి వీరాభిమాని. ఇతని పూర్తి పేరు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి. గతంలో ఈయన వైయస్సార్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం, జనసేన పై పలు విమర్శలు చేశాడు. ఇది టిడిపి, జనసేన మద్దతు దారులకు చాలా కోపం తెప్పించింది. దాంతో వారు మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల సమయంలో ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసలే ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. భారీ వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దాంతో ఆ ఎఫెక్ట్ మాచర్ల నియోజకవర్గం సినిమాపై పడింది. ఈ నెగటివ్ ప్రభావం సాధారణంగా కాంట్రవర్సీలకు దూరంగా ఉండే హీరో నితిన్ రెడ్డి పై కూడా పడింది. నిజానికి నితిన్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. కానీ జనసేన మద్దతు దారులు ఈ విషయంలో మాత్రం నితిన్ ని కూడా విమర్శించారు. అతను నితిన్ రెడ్డి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తిని దర్శకుడుగా పెట్టుకున్నాడు అంటూ మండిపడ్డారు. దాంతో ఈ చిత్రం ఘోర పరాజయాన్ని పరిచయం చూసింది. నితిన్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. అడ్వాన్స్ బుకింగ్ దగ్గరే సినిమా తుస్సుమ‌నిపించింది.  ఇప్పుడు అదే నెగటివిటీని విశాల్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు. 

ఇటీవల అతను లాఠీ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగిన సందర్భంగా తాను జగన్ కు వీరాభిమానిన‌ని,  ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో తనకు జగన్ అంటే భలే ఇష్టమని... ఐ లవ్ జగన్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అసలే వైసిపి పై ఏపీలో తీవ్ర ప్రభావం ఉన్న సమయంలో సినీ ప్రేక్షకులు కూడా సినిమాలు, రాజకీయాలు వేరనే విషయాన్ని మరిచిపోయి విశాల్ పై తీవ్ర‌ ప్రభావం చూపించారు. విశాల్ నటించిన లాఠీ చిత్రం ఈ వ్యాఖ్యల ఫలితాన్ని అనుభవిస్తుంది. విశాల్ కి మామూలుగా మాస్ యాక్షన్ హీరోగా ఓ మోస్త‌రు మార్కెట్ తెలుగులో ఉంది. దాంతో కనీస ఓపెనింగ్స్ అయినా ఆయన గత చిత్రాలకు వచ్చేవి. కానీ లాఠీ గురించి నెగటివ్ ప్రచారం జరగడంతో ఈ  సినిమాపై ఆ ఎఫెక్ట్ పడి.... విశాల్ గత చిత్రాలతో పోలిస్తే దీనికి ఓ మోస్త‌రు కనీసపు ఓపెనింగ్ కూడా రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే సినిమా తేలిపోయింది. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఇకపై హీరోలు చిరంజీవి కే సాధ్యం కానీ సినీ రాజకీయం తమకు ఎందుకని ఆలోచించి రాజకీయాలపై ఆచితూచి మాట్లాడడం మంచిదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.