రవితేజ ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అవుతాయని అనుకోలేదట!
on Dec 25, 2022

హీరోల మనసుకు నచ్చి నటించిన చిత్రాలు ప్రేక్షకులకు నచ్చి హిట్ అవ్వాలని లేదు. అలాగే జనాలు మెచ్చిన కాసుల వర్షం కురిపించిన చిత్రాలు ఆయా చిత్రాలలో నటించిన వారికి ఆత్మతృప్తిని ఇస్తాయనడం సరికాదు. దీనికి ఉదాహరణగా మెగాస్టార్ చిరంజీవినే తీసుకోవచ్చు. ఆయన ఎంతో ఇష్టంగా తమ సొంత బేనర్‌పై ఏకంగా తన సోదరుడు నాగబాబు నిర్మాతగా బాలచందర్ దర్శకత్వం వహించిన మూవీ రుద్రవీణ. నిజానికి ఇది అద్భుత చిత్రం. ఎన్నో అవార్డులు, మరీ ముఖ్యంగా నర్గీస్‌దత్ పురస్కారం లభించింది. ఇందులో హీరోయిన్‌గా శోభన, ఆమె తండ్రిగా పి.యల్. నారాయణ, చిరంజీవి తండ్రిగా నటించిన జెమిని గణేషన్ ఇలా అందరి నటన అద్భుతం. కానీ చిరంజీవి అంటే పాటలు, స్టెప్స్, కామెడీ, ఫైట్స్... ఇలా మాస్ మసాలా చిత్రాలను ఆశిస్తారు. దాంతో రుద్రవీణను ప్రేక్షకులు ఆదరించలేదు. ఇక చిరు నటించిన మరో చిత్రం ఆరాధన, భారతీరాజా దర్శకత్వంలో సుహాసిని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కూడా కలకాలం గుర్తుండి పోతుంది. కానీ కమర్షియల్‌గా ఈ చిత్రం కూడా భారీ నష్టాలను మిగిలించింది. ఇక చెప్పుకుంటే కళాతపస్వి దర్శకత్వంలో చిరంజీవి రెండు చిత్రాలలో నటించాడు. అందులో మొదటిది స్వయంకృషి. చిరుకి జోడీగా విజయశాంతి నటించిన ఈ చిత్రం కూడా చిరు, విజయశాంతిలు కలిసి నటించిన కమర్షియల్ చిత్రాల కంటే చాలా తక్కువ వసూళ్లు వసూలు చేసింది. ఇక ఆపద్బాంధవుడు విషయానికి వస్తే ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రిని చిరంజీవికి జోడీగా తీసుకున్నారు. జంధ్యాల అద్భుతంగా నటించాడు. ఈ మూవీ పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. ఇలా ఉంటాయి కొన్ని కొన్ని చిత్రాల వ్యవహారాలు.
ఇక విషయానికి వస్తే తాజాగా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కించగా మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో ధమాకా లాంటి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో రవితేజ మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. నా ఆటోగ్రాఫ్, నేనింతే చిత్రాలు తనని నిరాశపరిచాయని తెలిపాడు. నేను నటించిన చిత్రాలలో కలకాలం గుర్తుండిపోయే క్లాసిక్ గా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, నేనింతే వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు. కానీ ఈ చిత్రాలు సరిగా ఆడలేదని అన్నాడు. దాంతో రవితేజ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. నాకు ఎంతో ఇష్టమైన ఈ రెండు సినిమాలు బాగా ఆడుతాయని భావించాను. కానీ అవి దారుణంగా పరాజయం కావడం నన్ను బాధించింది. ఈ రెండు చిత్రాలను నా కెరీర్‌లో స్పెషల్‌గా భావిస్తాను. ఆ రెండు చిత్రాలు ఆడుంటే బాగుండు అని అనుకున్నాను. కానీ ప్రేక్షకుల రిజల్ట్ మరోలా ఉండటంతో బాధపడ్డాను. అవి దారుణంగా ఆడటం నన్ను చాలా బాధకు గురిచేసిందని రవితేజ చెప్పుకొచ్చాడు.
అయితే రవితేజ నటించిన చిత్రాల్లో షాక్, శంభో శివశంభో చిత్రాలు కూడా చాలా మంచి చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడకపోవడం నిజంగా దురదృష్టకరమని చెప్పాలి. మొత్తానికి రవితేజ నుంచి కాస్త హ్యూమన్ ఎమోషన్స్, ట్రాజెడీ లవ్ తరహా విభిన్న చిత్రాల కంటే మూస ధోరణిలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాలంటేనే ప్రేక్షకులకు ఇష్టపడుతున్నారని, ఆయన నుంచి అదే తరహా చిత్రాలను ఆశిస్తున్నారని చెప్పవచ్చు. అది ప్రేక్షకులు, అభిమానుల తప్పా లేక వారిని అదే తరహా చిత్రాలతో ముంచెత్తుతూ, రవితేజ చిత్రాలంటే ఇలా మాస్ ఎంటర్ టైనర్లే ఉండాలి అనేలా మైండ్ సెట్‌ని అలవాటు చేసి అదే మూస ధోరణి చిత్రాలకే ప్రేక్షకులను అలవాటు చేయడం రవితేజా తప్పా? అనేది అసలు ప్రశ్న.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



