ఆగస్టు 25 ఇండియా షేక్ అయితది.. దేశంలో నెక్స్ట్ బిగ్ థింగ్ విజయ్!
on Jul 21, 2022

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్'(సాలా క్రాస్ బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో భారీగా విడుదలైంది. తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయగా, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అనిల్ తడాని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల కేరింతలు మధ్య లైగర్ ట్రైలర్ గ్రాండ్ గా విడుదలైంది.
''ఒక లయిన్ కి టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ'' అనే రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక చాయ్ వాలా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఎంఎంఎ టైటిల్‌ను గెలవడానికి చేసిన ప్రయాణాన్ని ట్రైలర్ లో పవర్ ప్యాక్డ్ గా చూపించారు. ఫైటింగ్ రింగ్ లో విజయ్ చేసిన పోరాటాలు ఎక్స్ ట్రార్డినరీగా వున్నాయి. ట్రైలర్ లో లెజెండ్ మైక్ టైసన్ స్టైలిష్ ఇంట్రో మ్యాజికల్ మూమెంట్ గా వుంది. '' ఐయామ్ ఏ ఫైటర్''అని విజయ్ అంటే.. దానికి బదులుగా ''నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి ? ''అనే అర్ధం వచ్చేలా మైక్ టైసన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ని ఇచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. రికార్డ్ వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది లైగర్ ట్రైలర్.

ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "అభిమానుల మెంటల్ మాస్ చూస్తుంటే పిచ్చేక్కిపోతుంది. అసలు ఏం అర్ధమైతలేదు. రెండేళ్ళు అవుతుంది సినిమా విడుదలై. ముందు రిలీజైన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. అయినా లైగర్ ట్రైలర్ కి అభిమానులు రచ్చ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది. మీ ప్రేమని మాటల్లో చెప్పాలంటే "ఐ.. ఐ.. ల వ్ యూ"(లైగర్ స్టైల్లో). ఈ సినిమా అభిమానులకు అంకితం చేస్తున్నా. ఈ సినిమాలో బాడీ చేయడం, ఫైట్స్ చేయడం ఒక ఎత్తు అయితే డ్యాన్స్ మరో లెవెల్. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలని డ్యాన్సులు చేశా. ఆగస్ట్ 25న ప్రతి థియేటర్ లో పండగ జరగాలి. ప్రేక్షకులతో నిండిపోవాలి. ప్రామిస్ చేస్తున్నా. ఆగస్ట్ 25 ఇండియా షేక్ అయితది. మనం ఆగస్ట్ 25 ఏం చేస్తున్నాం ? ఆగ్ లగా దేంగే. ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదని అభిమానులు కొంచెం ఫీలయ్యారు. పూరి గారి మాటల్లో చెప్పాలంటే..'ఎప్పుడు వచ్చామన్నది కాదు. బుల్లెట్ దిగిందా లేదా?.. లవ్ యూ ఆల్'' అన్నారు.
పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. "ట్రైలర్ ఎట్లుంది? విజయ్ ఎట్లున్నాడు? చింపిండా లేదా? లైగర్ గురించి కాదు విజయ్ గురించి చెబుతున్నా.. విజయ్ దేశంలో నెక్స్ట్ బిగ్ థింగ్, నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా.. రాసిపెట్టుకోండి. కరణ్ జోహార్ గారు మాకు బిగ్ సపోర్ట్. మిమ్మల్ని చూపించడానికి ఆయన్ని ఇక్కడికి పిలిచా. మాకు సినిమా అంటే ఎంతపిచ్చో చూపించడానికి ఇక్కడికి పిలిచాను. సరిగ్గా ఇంకా నెల రోజులు వుంది సినిమా. ఇలాగే వుండండి. ఇలాగే వుంటది. కుమ్మేద్దాం. లవ్ యూ'' అన్నారు.

కరణ్ జోహార్ మాట్లాడుతూ.. "ఫ్యాన్స్ రాక్స్. రౌడీ రాక్స్. లైగర్ రాక్స్. మీ అందరి ప్రేమకి కృతజ్ఞతలు. లైగర్ పై మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. లైగర్ ఆగస్ట్ 25 న థియేటర్ లోకి వస్తుంది. మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నా. ఆగస్ట్ 25న థియేటర్లో కలుద్దాం'' అన్నారు.
అనన్య పాండే మాట్లాడుతూ.. "మీ అందరి ప్రేమకి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పంచిన అభిమానం చాలా క్రేజీగా వుంది. వారి కుటుంబంలో ఒకరిగా వుండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



