బన్నీకి సరైన విలన్ దొరికాడు!
on Oct 30, 2019
.jpg)
అల్లు అర్జున్ హీరోగా నటించే 20వ సినిమా ప్రొడక్షన్ వర్క్ ఈ రోజు.. అంటే అక్టోబర్ 30న మొదలైంది. సుకుమార్ డైరెక్ట్ చేసే ఈ మూవీలో సంచలన తార రష్మికా మందన్న హీరోయిన్. 'అల.. వైకుంఠపురములో..' మూవీ విడుదలయ్యాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ మూవీలో విలన్‌గా తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించనున్నాడనే వార్త అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. మేకర్స్ అయితే ఇంతవరకు అఫిషియల్‌గా ఈ న్యూస్‌ను అనౌన్స్ చెయ్యలేదు.
'పిజ్జా' మూవీతో తెలుగు ప్రేక్షకులకు సన్నిహితమైన విజయ్ సేతుపతి.. ఆ తర్వాత స్వల్ప కాలంలోనే తమిళ చిత్రసీమలో స్టార్‌గా ఎదిగాడు. ఇమేజ్ చక్రబంధంలో చిక్కుకోకుండా వెరైటీ రోల్స్‌తో ఆకట్టుకుంటూ అన్ని వయసువాళ్ల, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా రజనీకాంత్ మూవీ 'పేట'లో ఒక నెగటివ్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. అంతే కాదు.. 'ఖైదీ' ఫేం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో విజయ్ హీరోగా నటిస్తోన్న 64వ సినిమాలో విలన్ కేరెక్టర్‌కు ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బాలీవుడ్ స్టార్స్ తరహాలో కేరెక్టర్ నచ్చితే విలన్‌గా చెయ్యడానికి సైతం విజయ్ సేతుపతి రెడీ అంటున్నాడు.
అతనిలా సౌత్ ఇండియాలోని ఏ స్టార్ కూడా సొంత భాషా సినిమాల్లో విలన్‌గా నటించేందుకు ముందుకు రావడం లేదనేది వాస్తవం. ఇటీవలే అతను తెలుగులో తన తొలి సినిమా చేశాడు. అది.. చిరంజీవి టైటిల్ రోల్ చేయగా, ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన 'సైరా.. నరసింహారెడ్డి'. అందులో తమిళ ప్రాంతానికి చెందిన గిరిజన నాయకుడు రాజా పాండి కేరెక్టర్ పోషించాడు. నిడివి పరంగా చిన్న కేరెక్టర్ అయినా, తన విలక్షణ నటనతో అలరించాడు. బ్రిటిషర్లతో పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనుచరుడిగా మారి ప్రాణాలు అర్పించిన వీరునిగా ఉన్నత స్థాయి నటన ప్రదర్శించాడు.
'సైరా' మూవీ విడుదల కాకముందే మరో తెలుగు సినిమాకి సంతకం చేశాడు విజయ్ సేతుపతి. అది.. మెగాస్టార్ మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' మూవీ. అందులో విలన్ కేరెక్టర్‌ను పోషిస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మూవీలోనూ విలన్‌గా చేసేందుకు అంగీకరించాడనే ప్రచారంతో మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన తమిళ యాక్టర్‌గా వార్తల్లో నిలుస్తున్నాడు విజయ్ సేతుపతి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని సుకుమార్ రూపొందించనున్నాడు. అంటే యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఈ మూవీలో కొదవ ఉండదు. ఇందులో విలన్ ఎర్రచందనం స్మగ్లర్ కాబట్టి విజయ్ సేతుపతి ఆ కేరెక్టర్‌లో కనిపిస్తాడని ఊహించవచ్చు. విజయ్ సేతుపతి రాకతో తమిళంలోనూ ఈ మూవీని భారీ స్థాయిలో విడుదల చేయొచ్చని, ఆ మేరకు కమర్షియల్‌గా ప్రయోజనం కలుగుతుందనీ మేకర్స్ భావిస్తున్నారు. ఎటు తిరిగీ బన్నీకి కేరళలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, అక్కడా బాక్సాఫీసును గెలవవచ్చు.
అలాగే కన్నడ బ్యూటీ రష్మికకు కర్ణాటకలో ఉన్న క్రేజ్ అసాధారణం. అందువల్ల అక్కడ ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లను సాధించే అవకాశాలు పుష్కలం. ఆ విధంగా సౌత్ ఇండియాలో మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంటుందనేది దర్శక నిర్మాతల ఆలోచన. ఇవాళ్టి రోజుల్లో కలెక్షన్లకు కాంబినేషన్ క్రేజ్ అనేది బాగా ఉపయోగపడుతోంది. కాబట్టి హీరో విలన్లుగా అల్లు అర్జున్, విజయ్ సేతుపతి కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ కూడా ఆశపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



