'సరిలేరు నీకెవ్వరు'.. అప్పుడే రికార్డులు మొదలు! విజయశాంతి కేరెక్టర్ రివీల్!
on Oct 30, 2019

సూపర్ స్టార్ మహేశ్ హీరోగా నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీ విడుదలకు ముందు రికార్డులు షురూ చేసింది. పోటీ సినిమా 'అల.. వైకుంఠపురములో' పాటలతో ఇప్పటికే రికార్డులు స్టార్ట్ చేస్తే, 'సరిలేరు నీకెవ్వరు' పోస్టర్‌తో రికార్డులు మొదలుపెట్టింది. అవును. దీపావళి పండగ సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' కొత్త పోస్టర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మహేశ్ లాంచ్ చేశాడు. ఇందులో మోటార్ బైక్ నడుపుతున్న మహేశ్ స్టైలిష్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అందుకే ట్విట్టర్ వేదికపై అత్యధిక లైక్స్ సాధించిన తెలుగు మూవీ పోస్టర్‌గా అది సరికొత్త రికార్డు సృష్టించింది. అది కూడా మూడు రోజుల్లోనే 73 వేలకు పైగా లైక్స్ సాధించి, ఈ ఫీట్ చేసిన మొదటి తెలుగు సినిమా పోస్టర్‌గా నిలిచింది. దీన్నిబట్టి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు ఏ లెవల్ క్రేజ్ ఉన్నదో అర్థమవుతోంది.
రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో 13 సంవత్సరాల విరామంతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తుండటం పెద్ద విశేషం. దీపావళికి రిలీజ్ చేసిన ఆమె పోస్టర్‌కు కూడా విపరీతమైన స్పందన లభించింది. చైర్‌లో ఠీవిగా కూర్చొని ఉన్న ఆమెను చూస్తుంటే, ఈ 13 ఏళ్ల కాలం ఆమెను తెలుగు సినిమా మిస్ చేసుకున్నదనే అభిప్రాయం కలగక మానదు. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్ భారతి అనే కేరెక్టర్ చేస్తున్నారు. ఆమెను దృష్టిలో పెట్టుకొనే ఈ కేరెక్టర్‌ను అనిల్ రావిపూడి మలిచాడు. ఈ విషయమే చెప్పి ఆమెను ఒప్పించాడు. మరోవైపు 'కిలాడీ కృష్ణుడు'లో తన తొలి హీరో కృష్ణ కావడం, మహేశ్‌కు తల్లిగా 'కొడుకు దిద్దిన కాపురం' చేసి ఉండటంతో, మహేశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తనకు పేరలల్ కేరెక్టర్ లభించడంతో.. చెయ్యడానికి విజయశాంతి అంగీకరించారు.

అలాగే ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్ కేరెక్టర్లు కూడా ఈ సినిమాకు బలంగా నిలవనున్నాయి. మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తుండటం, పవర్ఫుల్ కేరెక్టర్లకు పెట్టింది పేరైన విజయశాంతి 13 ఏళ్ల గ్యాప్‌తో నటిస్తుండటంతో ఇది ఒక సీరియస్ సినిమా అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ఆ అభిప్రాయానికి భిన్నంగా రెండున్నర గంటలసేపు హిలేరియస్‌గా నవ్వించే స్టోరీ, సన్నివేశాలతో ఈ మూవీని అనిల్ రూపొందిస్తున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్న మాట. సెట్స్‌లో సీన్స్ తీస్తున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా పడీ పడీ నవ్వుతున్నారని వాళ్లంటున్నారు. అంటే 'ఎఫ్2'తో క్రేజీ డైరెక్టర్‌గా మారిన అనిల్ రావిపూడి.. 'సరిలేరు నీకెవ్వరు'ను కూడా అదే స్థాయిలో ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఆ సబ్జెక్టుకు మహేశ్ సూపర్ స్టార్‌డం తోడై, బాక్సాఫీసును బద్దలుచేసే కలెక్షన్లను ఈ సినిమా సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మునుపటి రెండు సినిమాల్లో 'భరత్ అనే నేను' రూ. 90 కోట్లకు పైగా షేర్ సాధించడం, 'మహర్షి' రూ. 100 కోట్ల క్లబ్బులో చేరడంతో, 'సరిలేరు నీకెవ్వరు'పై ట్రేడ్ వర్గాల్లో అమితమైన డిమాండ్ నెలకొంది.
మహేశ్ జోడీగా క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్న ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా ఫ్యాన్స్‌లో ఉంది. వాళ్లిద్దరి మధ్యా కెమిస్ట్రీ ప్రేక్షకులు ఊహించిన దానికి మించి అందంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. 'పోకిరి'లో మహేశ్, ఇలియానా మధ్య 'దూకుడు'లో మహేశ్, సమంతా మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అయ్యిందో, 'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్, రష్మిక మధ్య అలాంటి కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందని ఇన్‌సైడర్స్ అంటున్నారు. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా వస్తోన్న ఈ మూవీ, ప్రేక్షకులకు ఎలాంటి సంబరాలు తెస్తుందో.. చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



