తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే
on Dec 25, 2021

ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు తగ్గించిందని థియేటర్ల యాజమాన్యం నుంచి సినీ ప్రముఖుల వరకు ఆందోళన చెందుతుంటే.. మరో పక్క తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచి సినీ పరిశ్రమలో ఆనందం నింపింది. దీంతో సినీ పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతోంది. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించాడు.
తెలంగాణలో సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విజయ్ అన్నాడు. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒకటని పేర్కొన్న విజయ్.. పరిశ్రమ అభివృద్ధి కోసం సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. తన ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్ కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని విజయ్ కొనియాడాడు. ఇందుకు నిదర్శనమే తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరింపు అని గుర్తుచేస్తూ టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



