సూర్యతో మరోసారి
on Apr 16, 2021
కోలీవుడ్ స్టార్ సూర్య కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`) ఒకటి. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. గత ఏడాది నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అయి విమర్శకుల ప్రశంసలను, వీక్షకాదరణను పొందింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. కట్ చేస్తే.. త్వరలో సూర్య, జీవీ ప్రకాశ్ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. `అసురన్` ఫేమ్ వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య `వాడివాసల్` పేరుతో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి జీవీ ప్రకాశ్ బాణీలు అందించనున్నారు. `వడ చెన్నై`ని మినహాయిస్తే వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన దాదాపు అన్ని చిత్రాలకీ ప్రకాశ్ నే స్వరాలు సమకూర్చారు. ఆయా సినిమాలను తన పాటలు, నేపథ్య సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్ళారు. మరి.. `వాడివాసల్`కి కూడా అదే పరంపరని కొనసాగించి.. సూర్యకి మరోసారి అచ్చొస్తారేమో చూడాలి.