ENGLISH | TELUGU  

'ఆర్జీవీ దెయ్యం' మూవీ రివ్యూ

on Apr 16, 2021

 

సినిమా పేరు: ఆర్జీవీ దెయ్యం
తారాగ‌ణం:  రాజ‌శేఖ‌ర్‌, స్వాతి దీక్షిత్, అనితా చౌద‌రి, హేమ‌సుంద‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, దేవ‌దాస్ క‌న‌కాల‌, అనంత్‌, ఆహుతి ప్ర‌సాద్‌, వై.ఎస్‌. కృష్ణేశ్వ‌ర‌రావు, జీవా, బెన‌ర్జీ.
సినిమాటోగ్ర‌ఫీ: స‌తీశ్ ముత్యాల‌
మ్యూజిక్‌:  డిఎస్ఆర్‌
ఎడిటింగ్‌: స‌త్య‌, అన్వ‌ర్
నిర్మాతలు: జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్
ద‌ర్శ‌క‌త్వం:  రామ్‌గోపాల్ వ‌ర్మ‌
బ్యాన‌ర్స్‌: నట్టీస్‌ ఎంటర్టైన్మెంట్స్, పెగాసస్ సినీ కార్ప్ యల్.యల్.పి.
విడుద‌ల తేదీ: 16 ఏప్రిల్ 2021 

ఆర్జీవీ 'దెయ్యం' పేరుతో ఎన్న‌డో 1996లో జె.డి. చ‌క్ర‌వ‌ర్తితో ఒక సినిమా చేశాడ‌ని తెలుసు కానీ, మ‌ళ్లీ కొత్త‌గా రాజ‌శేఖ‌ర్‌తో ఈ 'దెయ్యం' సినిమా ఎప్పుడు తీశాడా అనుకుంటా థియేట‌ర్‌కి వెళ్లా. సినిమా చూస్తుంటే అర్థ‌మైంది.. ఇది చాలా కాలం క్రితం తీసిన సినిమా అనీ, ఇప్పుడు రిలీజ‌య్యింద‌నీ. ఎందుకంటే ఈ సినిమాలో ఇప్ప‌టికే చ‌నిపోయిన ఇద్ద‌రు యాక్ట‌ర్లు క‌నిపించారు. వారిలో ఒక‌రు 2019లో క‌న్నుమూసిన దేవ‌దాస్ క‌న‌కాల అయితే, ఇంకొక‌రు అంత‌కంటే ముందు 2015లోనే చ‌నిపోయిన ఆహుతి ప్ర‌సాద్‌. దీన్ని బ‌ట్టి ఈ సినిమాని ఆర్జీవీ ఏడేళ్ల క్రితం తీసుంటాడ‌ని అర్థ‌మ‌వుతుంది. అప్పుడు రాజ‌శేఖ‌ర్‌తో 'ప‌ట్ట‌ప‌గ‌లు' అనే సినిమా తీస్తున్నాన‌ని ఆర్జీవీ అనౌన్స్ చేసిన విష‌యం మీకు గుర్తుందా.. అదే ఈ 'దెయ్యం' సినిమా అన్న‌మాట‌. 'ప‌ట్ట‌ప‌గ‌లు' అంటే పాత సినిమా అనుకుంటార‌ని.. టైటిల్ మార్చి ఇప్పుడు రిలీజ్ చేశార‌న్న‌ మాట‌.

క‌థ‌
శంక‌ర్ అనే మెకానిక్ కూతురు విజ్జీ కాలేజీలో చ‌దువుకుంటూ, ప్ర‌తి చిన్న విష‌యానికి కంగారుప‌డ‌తా, భ‌య‌ప‌డ‌తా ఉంటుంది. రాత్రిపూట బెడ్‌రూమ్‌లోనించి బ‌య‌ట‌కు వ‌చ్చి దెయ్యం ప‌ట్టిన‌దానిలా బిహేవ్ చేస్తుండేసరికి శంక‌ర్ ఆందోళ‌న‌ప‌డ‌తాడు. అత‌నికి దెయ్యాల మీద న‌మ్మ‌కం ఉండ‌దు. కానీ విజ్జీని ఆవ‌హించిన సైకో దెయ్యం మాట్లాడ‌టం మొద‌లుపెట్టినాక న‌మ్మ‌క త‌ప్ప‌దు. త‌న పేరు "గురు" అని కూడా ఆ సైకో కిల్ల‌ర్ దెయ్యం చెప్తుంది. అప్ప‌ట్నుంచి ఆ దెయ్యాన్ని విజ్జీ శ‌రీరంలోంచి బ‌య‌ట‌కు త‌రిమెయ్య‌డానికి శంక‌ర్ ఎట్లాంటి క‌ష్టాలు ప‌డ్డాడు, చివ‌రికి విజ్జీ ఏమైంది? అనేది ఈ సైకో దెయ్యం సినిమా అన్న‌మాట‌. 

విశ్లేష‌ణ
ఈ మ‌ధ్య‌ ఆర్జీవీ ఎట్లాంటి సినిమాలు తీస్తున్నాడో చూస్తున్నాం క‌దా! ఏడేళ్ల క్రితం కూడా "ప‌ట్ట‌ప‌గ‌లు ఒక సైకో దెయ్యం" సినిమా తీశాడ‌న్న మాట‌. అదేంది అనుకుంటున్నారా? అంతే మ‌రి. మ‌నం ఇంత‌దాకా చాలా దెయ్యం సినిమాలు చూశాం కానీ, సైకో దెయ్యం సినిమా చూడ‌లేదు. దాన్ని చూసే అదృష్టాన్ని మ‌న‌కి క‌ల్పించాడు ఆర్జీవీ. 20 హ‌త్య‌లు చేసి, ఒక పోలీస్ ఎన్‌కౌంట‌ర్లో చ‌చ్చిన ఒక సైకో కిల్ల‌ర్‌.. దెయ్యంగా మారి ఒక అమ్మాయిని ఆవ‌హించి, త‌న పైత్యాన్ని ఎంత భ‌యంక‌రంగా చూపించాడనే పాయింట్‌తో ఆర్జీవీ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.

ఆర్జీవీ ఒక సినిమా తీశాడంటే అందులో క‌థ కోసం మ‌నం వెతుక్కోన‌క్క‌ర్లేదు. ఒక పాయింట్ చుట్టూ అల్లుకున్న సీన్లు వ‌చ్చిపోతుంటాయి. ఈ దెయ్యం సినిమా ఒక గంటా 39 నిమిషాలే ఉంది. చిన్న సినిమానే క‌దా అనుకుని కుర్చీలో కూర్చుంటే బుర్ర ఖ‌రాబైపోతుంది జాగ్ర‌త్త‌! 

ఒక అర్ధ‌రాత్రి పూట త‌న‌కు వ‌చ్చిన సైకో కిల్ల‌ర్‌ దెయ్యం ఆలోచ‌న‌తో స్క్రిప్ట్ రాసి, ఇట్లా సినిమా తీసి, ఎప్ప‌ట్లా క‌సిగా జ‌నం మీదికి వ‌దిలాడు ఆర్జీవీ. ఎప్ప‌ట్లా చూసి బ‌ల‌య్యేది మ‌న‌మేగా! డిఫ‌రెంట్‌గా ఆలోచించే ఆర్జీవీ ఈ సినిమాలో డిఫ‌రెంట్ సీన్లు తీయ‌డ‌మే కాదు.. మ‌నుషుల‌కు ఎట్లా అయితే హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉంటారో, అట్లాగే దెయ్యాల‌కు హెల్ప్ చేసే దెయ్యం ఫ్రెండ్స్ ఉంటార‌నే డిఫ‌రెంట్ పాయింట్‌ను ప్రెజెంట్ చేశాడు. సూప‌ర్ క‌దా!! టెక్నిక‌ల్‌గా చెప్పుకోడానికి పెద్ద‌గా ఏమీ లేదు. స‌తీశ్ ముత్యాల సినిమాటోగ్ర‌ఫీ, డీఎస్ఆర్ మ్యూజిక్ సోసోగా ఉన్నాయ్‌. అన్వ‌ర్‌, స‌త్య క‌లిసి స‌మ‌కూర్చిన ఎడిటింగ్ భ‌య‌పెట్టింది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ గురించి మ‌నం ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత చీప్‌గా ఉంది సినిమా క్వాలిటీ.

న‌టీన‌టుల అభిన‌యం
ఈ సినిమాలో నాకు న‌చ్చిన విష‌యం ఒక‌టుంది. అది విజ్జీ క్యారెక్ట‌ర్‌లో స్వాతి దీక్షిత్ ప‌ర్ఫార్మెన్స్‌. బిగ్ బాస్ సీజ‌న్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌లో ఇంత‌టి టాలెంట్ ఉందా అని నాకు ఆశ్చ‌ర్య‌మేసింది. సైకో దెయ్యం త‌న‌ని ఆవ‌హించాక ఆమె ఫేషియ‌ల్ ఎక్స్‌ప్రెష‌న్స్ సూప‌ర్బ్. ఇది సెటైరిక‌ల్‌గా చెప్తున్న‌ది కాదు.. సీరియ‌స్‌లీ.. షి డిడ్‌ ఎ వెరీ గుడ్ జాబ్‌. క‌ళ్ల‌తోనే కాకుండా, నోటితోనూ ప‌ర్ఫార్మెన్స్ చెయ్యొచ్చ‌ని ఆమె చూపించింది. ఈ సినిమాని మ‌న డైరెక్ట‌ర్లు చూస్తే, క‌చ్చితంగా ఆమెకు మంచి క్యారెక్ట‌ర్లు ఆఫ‌ర్ చేస్తారు. 

విజ్జీ ఫాద‌ర్ శంక‌ర్ క్యారెక్ట‌ర్‌లో రాజ‌శేఖ‌ర్ యాక్టింగ్ గురించి కొత్త‌గా చెప్పేదేముంటుం‌ది! కూతుర్ని సైకో దెయ్యం ఆవహించడంతో, ఆమె ప‌డే పెయిన్ చూస్తా,  న‌ర‌క‌యాత‌న ప‌డే క్యారెక్ట‌ర్‌లో జీవించాడు. రాజ‌శేఖ‌ర్ భార్య‌గా అనితా చౌద‌రి న‌టించింది. ఇలాంటి డిఫ‌రెంట్ కాంబినేష‌న్ థాట్ ఆర్జీవీకే వ‌స్తుంది క‌దా! సీనియ‌ర్ యాక్ట‌ర్ స‌న లెక్చ‌ర‌ర్ రోల్‌లో డిఫ‌రెంట్ కాస్ట్యూమ్స్‌తో ద‌ర్శ‌న‌మిచ్చింది. విజ్జీని ఆవ‌హించిన సైకో కిల్ల‌ర్ గురు ఎట్లా ఉంటాడో చూపించ‌కుండా డిజ‌ప్పాయింట్ చేశాడు ఆర్జీవీ. మంత్ర‌గాడిగా వై.య‌స్‌. కృష్ణేశ్వ‌ర‌రావు, పోలీస్ ఆఫీస‌ర్లుగా జీవా, బెన‌ర్జీ, సైకియాట్రిస్ట్‌గా దేవ‌దాస్ క‌న‌కాల‌, రాజ‌శేఖ‌ర్ ప‌క్కింటాయ‌న‌గా హేమ‌సుంద‌ర్‌, విజ్జీలోని దెయ్యాన్ని వ‌దిలించ‌డానికి ట్రైచేసే క్యారెక్ట‌ర్‌లో ఆహుతి ప్ర‌సాద్‌, డాక్ట‌ర్లుగా త‌నికెళ్ల భ‌ర‌ణి, అనంత్ త‌మ‌కు ఆర్జీవీ అప్ప‌గించిన ప‌నిని చేసుకుపోయారు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
ఏతావాతా.. గంట‌న్న‌ర‌సేపు సైకో కిల్ల‌ర్ దెయ్యం చేష్ట‌లు చూసే ద‌మ్మున్నోళ్లు, స‌హ‌న‌శీలురు ఈ సినిమాని చూడొచ్చు. మిగ‌తావాళ్లు దీని జోలికి వెళ్ల‌కుంటే మంచిది. లేదంటే.. ఏదో రోజు ప‌ట్ట‌ప‌గ‌లే వ‌చ్చేసి సైకో దెయ్యం మిమ్మ‌ల్ని ఖ‌తం చేసేస్తుంది.

రేటింగ్ - 1.5/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.