పాటకి పల్లవి ఎంత ముఖ్యమో.. 'విరాటపర్వం'కు సాయిపల్లవి అంత ముఖ్యం!
on Jun 16, 2022

'విరాటపర్వం' కథ సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్ర చుట్టూ నడుస్తుందని ఇదివరకే మనకు తెలిసిపోయింది. అయితే వెన్నెల పాత్రలో సాయిపల్లవి నటన ఏ స్థాయిలో ఉంటుందో తన ఒక్క మాటతో చెప్పేశాడు దర్శకుడు వేణు ఊడుగుల. పాటకి పల్లవి ఎంత ముఖ్యమో.. ఈ విరాటపర్వంకు సాయిపల్లవి అంత ముఖ్యం అని అతనన్నాడు. సాయిపల్లవి, రానా ప్రధాన పాత్రధారులుగా అతను రూపొందించిన సినిమా 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
బుధవారం రాత్రి జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన వేణు, "1990వ దశకంలో ఒక రాజకీయ సంక్షోభాన్ని కాన్వాస్‌గా చేసుకొని ఆనాటి హ్యూమన్ కండిషన్‌ని చర్చించిన ఒక సబల్‌టర్న్ లవ్ స్టోరీ 'విరాటపర్వం'. పాటకి పల్లవి ఎంత ముఖ్యమో, ఈ విరాటపర్వానికి సాయిపల్లవిగారు అంత ముఖ్యం." అని చెప్పాడు. ఆ వెంటనే ఎదురుగా కుర్చీలో కూర్చున్న సాయిపల్లవి హావభావాలు చూసి తీరాల్సిందే. వేణు అలా చెప్తాడని ఊహించలేదన్నట్లు ఓవైపు నవ్వు, ఇంకో వైపు ఆశ్చర్యాన్ని తన ముఖంలో పలికించింది.
అయితే కేవలం సాయిపల్లవిని మాత్రమే కాకుండా రానాను కూడా తన మాటలతో ప్లీజ్ చేశాడు వేణు. "లిరిక్ లేకుండా పాట ఉంటుందా? అలాగే ఈ సినిమాకు రానా అంత ముఖ్యం" అన్నాడు. "అతను చంద్రుడైతే, ఆమె వెన్నెల. ఈ సినిమాలో ఎనిమిది కీలక పాత్రల్లో ఐదు స్త్రీలే పోషించారు. ఒక్కో పాత్ర ఒక్కో దశలో కథను మలుపు తిప్పుకుంటూ వెళ్తుంది." అని చెప్పాడు
ఈ మూవీలో సాయిపల్లవి తల్లితండ్రులుగా ఈశ్వరీరావు, సాయిచంద్ నటించగా, రానా తల్లిగా జరీనా వహాబ్ నటించారు. నవీన్‌చంద్ర, ప్రియమణి, నందితా దాస్, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రధారులు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించగా, డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్స్‌గా వర్క్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



