రక్తపాతంలో 'వెన్నెల' జననం.. గూజ్ బంప్స్ సీన్
on Jun 16, 2022

'విరాట పర్వం' సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోగా.. తాజాగా 'ది బర్త్ ఆఫ్ వెన్నెల' పేరుతో విడుదలైన వీడియో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తోంది.
'విరాట పర్వం' సినిమాలో వెన్నెల అనే ప్రధాన పాత్రలో సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే. "ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది" అంటూ ట్రైలర్ లో సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అయితే ఒక యుద్ధం తనకు ప్రాణం ఎలా పోసింది అనేది 'ది బర్త్ ఆఫ్ వెన్నెల' వీడియోలో చూపించారు.

ఇందులో వెన్నెల తల్లితండ్రులుగా ఈశ్వరి, సాయి చంద్ కనిపిస్తున్నారు. ఈశ్వరికి నొప్పులు రావడంతో రాత్రిపూట వర్షంలో ట్రాక్టర్ కి పరదా కట్టుకొని తీసుకెళ్తుంటారు. అలా వెళ్తుండగా దారిలో పోలీసులకు, నక్సల్స్ కి మధ్య కాల్పులు జరుగుతుంటాయి. దీంతో భయపడిపోయిన డ్రైవర్ ట్రాక్టర్ ఆపేసి ట్రక్ లో తలదాచుకుంటాడు. నక్సల్స్ లో నివేతా పేతురాజ్ కూడా ఒక సభ్యురాలు. నొప్పులతో బాధపడుతున్న ఈశ్వరి గొంతు ఆమె చెవిన పడటంతో.. భుజానికి బుల్లెట్ తగిలినా లెక్కచేయకుండా ట్రాక్టర్ దగ్గరకు వెళ్తుంది. తాను డాక్టర్ ని అని చెప్పి, ఈశ్వరికి ఇంజక్షన్ చేసి.. పురుడు పోస్తుంది. పుట్టిన ఆడబిడ్డని చూసి మురిసిపోతూ పేరు పెట్టమని సాయి చంద్ అడుగుతాడు. వర్షం వెలిసిపోయి ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ కనిపిస్తుండటంతో వెన్నెల అని పేరు పెడుతుంది పేతురేజ్. తన భుజానికి కారుతున్న రక్తాన్ని వెన్నెల నుదుటున తిలకంలా దిద్ది.. నవ్వుతూ 'లాల్ సలామ్' అనగానే పేతురేజ్ తలలోకి బుల్లెట్ దూసుకుపోతుంది. స్లో మోషన్ లో పేతురేజ్ వాలిపోతుండగా "ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను వెన్నల. ఇది నా కథ" అంటూ సాయి పల్లవి వాయిస్ వస్తుంది. మొత్తానికి ఈ వీడియో గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



