మంటల్లో 'లక్ష్మీ' అక్షరాలు.. తేజ మార్క్ విన్యాసాలు!
on Aug 28, 2020

ఎక్కడైనా అగ్గిపుల్ల గీస్తే వస్తే మంటల్లో అక్షరాలు కనిపిస్తాయా? ఎక్కడా, ఎవరికీ ఆ అనుభవం కలిగి ఉండదు. కానీ డైరెక్టర్ తేజ మాత్రం తెరమీద మనకు ఆ విచిత్రానుభవాన్ని కలిగించాడు. అభూత కల్పనలకూ, అవాస్తవికతకూ తన సినిమాల్లో తేజ జయం నుంచీ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న విషయం మనకు తెలుసు. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ఆయన రూపొందించిన 'లక్ష్మీ కల్యాణం' చిత్రంలో మనకు ఈ వింత సన్నివేశం ఎదురవుతుంది. ఆ సినిమాతో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది.
'లక్ష్మీ కల్యాణం' చూస్తుంటే, మళ్లీ 'జయం' సినిమానే వేరే యాక్టర్లతో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అయిపోయిందని అందరూ లేవబోతుంటే తెరపై ఎడ్ల పందాల ఎపిసోడ్ మొదలవడంతో, ఆశ్చర్యపోతూ జనం మళ్లీ సీట్లలో కూర్చోవడం ఈ సినిమాకు సంబంధించిన ఒక విశేషం. ఆ పందాల్లో విన్నర్‌గా ఎవరు నిలుస్తారో మనకు ముందే తెలుసు కాబట్టి ఆ క్లైమాక్స్ సీన్ ఏమాత్రం ఆసక్తి కలిగించలేదు.
ఇక కొబ్బరికాయల్లో నూనె నింపి వాటిని భూమిపై కొట్టి అగ్గిపుల్ల గీస్తే ఆ వచ్చే మంటల్లో 'లక్ష్మీ' అనే అక్షరాలు కనిపించడం తేజ ఇమాజినేషన్‌కీ, క్రియేటివిటీకీ పరాకాష్ఠ!! ఏమాత్రం కొత్తదనం లేని కథ, పాత చింతకాయ పచ్చడి తరహా సన్నివేశాలతో తమ ముందుకు వచ్చిన 'లక్ష్మీ కల్యాణం' సినిమాకు ఎలాంటి ఫలితాన్ని అందించాలో అలాంటి ఫలితాన్నే ఇచ్చారు జనం. అప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తేజకు ఈ సినిమా కూడా అలాంటి అనుభవాన్నే మళ్లీ ఇచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



