అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?
on Apr 21, 2021
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సూపర్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయగా నాగార్జున సరసన నటించిన 'సూపర్' (2005) మూవీతో ఆమె చిత్రసీమలోకి అడుగుపెట్టింది. అందులో మెయిన్ హీరోయిన్ ఆయేషా టకియా అయితే, అనుష్క సెకండ్ హీరోయిన్గా నటించింది. యస్.యస్. రాజమౌళి సినిమా 'విక్రమార్కుడు'లో రవితేజ జోడీగా నటించి అలరించాక ఆమె వెనుతిరిగి చూడాల్సిన అవసరం కలగలేదు. ఇక ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మించగా, కోడి రామకృష్ణ రూపొందించిన 'అరుంధతి' సినిమా ఆమెకూ సూపర్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చింది.
'బాహుబలి'లో చేసిన దేవసేన పాత్రతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క. 16 సంవత్సరాల సినిమా కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు చేసిన ఆమె, కొన్ని సినిమాలను తిరస్కరించింది కూడా. నిజానికి 'బాహుబలి' మూవీ రిలీజయ్యాక వచ్చిన ఓ బాలీవుడ్ ఆఫర్‌ను ఆమె తిరస్కరించింది. అది.. కరణ్ జోహార్ లాంటి బిగ్ ప్రొడ్యూసర్ ఇచ్చిన ఆఫర్ కావడం గమనార్హం. తాను తీస్తున్న ఓ సినిమా కోసం అనుష్కను కరణ్ సంప్రదించాడనీ, అయితే అతను ఆఫర్ చేసిన రోల్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆమె రెడ్ సిగ్నల్ ఇచ్చిందనీ బాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం మాత్రం లేదు. అలాగే 'గోల్మాల్' సిరీస్‌లోని ఓ సినిమాను కూడా ఆమె అంగీకరించలేదనే రూమర్స్ ఉన్నాయి.
అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల్లో మణిరత్నం లేటెస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ 'పొన్నియన్ సెల్వన్' కూడా ఉంది. మాగ్నమ్ ఓపస్‌గా తయారవుతున్న ఈ మూవీలో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్యా రాయ్, ప్రభు, జయరామ్ లాంటి పేరు పొందిన నటులు ఉన్నారు. అనుష్క కాదనుకున్న క్యారెక్టర్‌ను త్రిష చేస్తోంది.
రజనీకాంత్ హీరోగా ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన 'కొచ్చాడయాన్' మూవీలో హీరోయిన్గా దీపికా పడుకోనే నటించిందనే మనకు తెలుసు. నిజానికి ఆ క్యారెక్టర్‌కు ఫస్ట్ చాయిస్ అనుష్క. అయితే ఆ టైమ్‌లో ఆమె బాగా బిజీగా ఉండటంతో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమాని వదిలేసుకుంది.
ధనుష్ సూపర్ హిట్ ఫిల్మ్ 'అసురన్'కు తెలుగు రీమేక్ అయిన 'నారప్ప'లో వెంకటేశ్ భార్య పాత్రకు మొదట శ్రియా శరణ్‌ను అనుకున్నారు. ఆ తర్వాత అనుష్కను సంప్రదించారు. అప్పుడు 'నిశ్శబ్దం' సినిమా చేస్తుండటంతో 'నారప్ప'ను వదిలేసుకుందామె. దాంతో సుందరమ్మ పాత్రను ప్రియమణి చేసింది.
అనుష్క ప్రస్తుతం 'జాతిరత్నాలు' హీరో నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకుడు. తనకంటే పదేళ్లు చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడే పాత్రను అనుష్క చేస్తున్నట్లు సమాచారం.