'సూరారై పొట్రు' లాభాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి రూ. 1.5 కోట్లు ఇచ్చిన సూర్య!
on Aug 28, 2020

దాతృత్వం విషయంలో ఎప్పుడూ ముందుండే స్టార్ యాక్టర్ సూర్య మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) కార్మికులకూ, కోలీవుడ్‌లోని ఇతర సంఘాలకూ, కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వారికీ రూ. 1.5 కోట్లను విరాళంగా అందజేశాడు. వినాయక చవితి నాడు తన అభిమానులను, ఫిల్మ్ ఇండస్ట్రీ వారినందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తన సినిమా 'ఆకాశం నీ హద్దురా' (తమిళంలో 'సూరారై పొట్రు') అక్టోబర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించాడు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామనీ, తన తదుపరి రెండు సినిమాలు థియేటర్లలోనే రిలీజ్ అవుతాయనీ ఆయన తెలిపాడు. 'సూరారై పొట్రు' బిజినెస్ ద్వారా వచ్చిన రూ. 5 కోట్లను కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి డొనేట్ చేస్తానని వెల్లడించాడు. చెప్పిన మాట ప్రకారమే, అందులో తొలి విడతగా ఫిల్మ్ ఇండస్ట్రీకి రూ. 1.5 కోట్లను విరాళంగా శుక్రవారం అందజేశాడు. సూర్య తరపున ఆయన తండ్రి సీనియర్ యాక్టర్ శివకుమార్ ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె. సెల్వమణికి రూ. 80 లక్షలు, తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కలైపులి ఎస్. థానుకు రూ. 30 లక్షలు, నడిగర్ సంగమ్ అధ్యక్షుడు నాజర్‌కు రూ. 20 లక్షలు భారతీరాజా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చెక్కుల రూపేణా అందజేశారు. అలాగే మరో రూ. 20 లక్షలను డైరెక్టర్స్ యూనియన్‌కు కూడా ఇచ్చారు.

సుధ కొంగర డైరెక్ట్ చేసిన 'ఆకాశం నీ హద్దురా' (సూరారై పొట్రు) మూవీ నిజానికి ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇప్పటికీ విడుదల కాలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని సూర్య నిర్ణయించుకున్నాడు. అయితే హరి లాంటి దర్శకులు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించగా నిర్మాత సి. అశ్వినీదత్, డైరెక్టర్ భారతీరాజా లాంటి ప్రముఖులు సమర్ధించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



