సూర్య `24`కి ఐదేళ్ళు
on May 6, 2021
వైవిధ్యానికి పెద్దపీట వేసే కథానాయకుల్లో కోలీవుడ్ స్టార్ సూర్య ఒకరు. అదే బాటలో పయనించే దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తో జట్టుకట్టి.. సూర్య తనే స్వయంగా నిర్మించిన చిత్రం `24`. `టైమ్ ట్రావెల్` కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీలో మూడు విభిన్న పాత్రల్లో నటించారు సూర్య. మరీ ముఖ్యంగా.. ఆత్రేయ పాత్రలో సూర్య పండించిన విలనిజం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సూర్యకి జోడీగా సమంత, నిత్యా మీనన్ నటించగా శరణ్య, అజయ్, గిరీశ్ కర్నాడ్, సుధ, సత్యన్, హర్షవర్థన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతసారథ్యంలో రూపొందిన గీతాల్లో ``ప్రేమ స్వరములలో``, ``దైవం రాసిన కవిత``, ``కాలం నా ప్రేయసిలే`` ఆకట్టుకున్నాయి. తిరు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. `బెస్ట్ సినిమాటోగ్రఫీ`, `బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్` విభాగాల్లో జాతీయ పురస్కారాలను.. `క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్` విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డుని సొంతం చేసుకుంది `24`. 2016 మే 6న తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజున విడుదలై ఆదరణ పొందిన `24`.. నేటితో ఐదు వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read