మ్యూజికల్ బ్లాక్ బస్టర్ `100 % లవ్`కి పదేళ్ళు
on May 6, 2021
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ - రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరు జట్టుకట్టిన సినిమాలన్నీ మ్యూజికల్ గా మెప్పించాయి. ఇక కమర్షియల్ గానూ సక్సెస్ సాధించి.. మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో `100 % లవ్` ఒకటి. బాలు, మహాలక్ష్మి అనే ఇద్దరు బావామరదళ్ళ మధ్య ఉండే `లవ్ - హేట్ రిలేషన్ షిప్`ని కథాంశంగా చేసుకుని తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నాగచైతన్య, తమన్నా జంటగా నటించారు. కేఆర్ విజయ, విజయ్ కుమార్, నందు, తారా అలీషా బెర్రీ, నరేశ్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించగా.. మేఘనా నాయుడు, మరియమ్ జకారియా ప్రత్యేక గీతంలో చిందులేశారు.
డీఎస్పీ బాణీలతో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ కుర్రకారుని ఫిదా చేశాయి. ``ఇన్ఫాచ్యుయేషన్``, ``ఏ స్క్వేర్ బి స్క్వేర్`` (రెండు వెర్షన్స్), ``దటీజ్ మహాలక్ష్మి``, ``అహో బాలు``, `దూరం దూరం``, `బంధమెక్కడో``, ``డియాలో డియాలో``.. ఇలా ప్రతీ పాట సందర్భానుసారంగా తెరకెక్కి ఆకట్టుకున్నాయి. తమిళంలో `100% కాదల్`, బెంగాలీలో `ప్రేమ్ కీ భుఝుని` పేర్లతో `100% లవ్` రీమేక్ అయింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2011 మే 6న విడుదలై జననీరాజనాలు అందుకున్న `100% లవ్`.. నేటితో పది వసంతాలను పూర్తిచేసుకుంది.