'వాల్తేరు వీరయ్య' విశేషాలివే!
on Nov 14, 2022

'గాడ్‌ఫాదర్' మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. బాబీ (కె.ఎస్. రవీంద్ర) డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో చిరు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంకో విశేషమేమంటే మాస్ మహారాజా రవితేజ ఇందులో చిరు సవతి తమ్మునిగా నటిస్తుండటం! స్టార్ హీరో అయ్యాక రవితేజ మరో స్టార్ హీరో మూవీలో కీలక పాత్ర చేస్తుండం ఇదే ఫస్ట్ టైం. చిరు, రవితేజ మధ్య వచ్చే ఒక ఎమోషనల్ బ్లాక్ సినిమాకి హైలైట్ అవుతుందనీ, అది ఇంటర్వెల్ బ్యాంగ్‌గా వస్తుందనీ ఇన్‌సైడ్ టాక్. ఈ సీక్వెన్స్‌తోనే రవితేజ క్యారెక్టర్ ఏమిటనేది రివీల్ అవుతుందనీ, ఈ సీన్ సినిమా రేంజ్‌ని ఇంకో లెవల్‌కు తీసుకు వెళ్తుందనీ అంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న 'వాల్తేరు వీరయ్య'ను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు మరో రెండు నెలలు కూడా లేకపోవడంతో పబ్లిసిటీ విషయంలో దృష్టి పెట్టారు మేకర్స్. ఫస్ట్ సింగిల్‌ను ఈ వారంలో రిలీజ్ చేస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సమకూర్చిన ఈ సాంగ్‌ను ఇటీవలే చిరంజీవి, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాపై చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ స్పెషల్ సాంగ్ ఆడియెన్స్‌ను బాగా అలరిస్తుందని మూవీ టీం గట్టి నమ్మకంతో ఉంది. మూవీలో ఆరు పాటలున్నాయనీ, వీటికి డీఎస్పీ ఇచ్చిన మ్యూజిక్‌కు చిరు బాగా ఇంప్రెస్ అయ్యారనీ యూనిట్ మెంబర్స్ నుంచి అందుతున్న సమాచారం. చిరంజీవి, దేవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా ఆడినా మ్యూజికల్‌గా మాత్రం సూపర్ పాపులర్ అయ్యాయి.
నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన బాబీ సింహా ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. ఆమధ్య రిలీజ్ చేసిన అతని లుక్ కూడా కిక్కిచ్చింది. చిరంజీవి మునుపటి సినిమాల్లో 'ఆచార్య' డిజాస్టర్ అయినా, 'గాడ్‌ఫాదర్' ఆశించిన రీతిలో బ్లాక్‌బస్టర్ కాకపోయినా, 'వాల్తేరు వీరయ్య'పై బిజినెస్ వర్గాల్లో క్రేజ్ ఏర్పడింది. ఒక్క రాయలసీమ ఏరియాలోనే ఈ మూవీ రైట్స్ రూ. 16 కోట్ల మేరకు అమ్ముడయ్యాయని సమాచారం. చిరుతో పాటు రవితేజ కూడా ఉండటం కూడా దీనికి కారణమని చెప్పాలి.
టైటిల్ రోల్‌లో చిరు కనిపిస్తున్న తీరు, టీజర్.. ఇప్పటికే సినిమాపై ఆడియెన్స్‌లో అంచనాలు పెంచాయి. దీపావళి టైంలో రిలీజ్ చేసిన చిరు ఫస్ట్ లుక్‌ను మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్స్ తమ కాంపౌండ్‌లో గీసి, ఆ ఆకారంలో దాదాపు 6 వేలమంది కూర్చోవడం.. ఈ మూవీపై యూత్‌లో ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. దానికి సంబంధించిన విజువల్స్‌ను వీడియో తీసి, తమ యూనివర్సిటీలో నిర్వహించిన క్యాన్సర్‌పై పోరాటం ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వచ్చిన చిరును సర్‌ప్రైజ్ చేస్తూ, ఆ వీడియోను ప్లే చేయడం, అది చూసి చిరు మురిసిపోవడం వైరల్ అయ్యింది. ఇన్ని విశేషాలతో తయారవుతున్న 'వాల్తేరు వీరయ్య' 2023 సంక్రాంతికి బాక్సాఫీసును దున్నేస్తుందనీ, తమకు పండగ సంబరాన్ని రెట్టింపు చేస్తుందనీ ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



