కృష్ణకు గుండెపోటు.. విషమంగా ఆరోగ్య స్థితి!
on Nov 14, 2022

సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదనీ, అయితే వైద్యులు తమ శక్తివంచన లేకుండా ఆయనకు చికిత్స అందిస్తున్నారనీ కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ గురు ఎన్. రెడ్డి తెలిపారు. అపస్మారక స్థితిలో కృష్ణను హాస్పిటల్‌కు తీసుకు వచ్చారనీ, రాత్రి 2 గంటలకు ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చిందనీ వెల్లడించారు. వెంటనే కార్డియాలజిస్టులు ఆయనకు చికిత్స అందించారని చెప్పారు. ప్రస్తుతం కృష్ణకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామనీ, తాము అన్ని విధాలుగా మెరుగైన ట్రీట్‌మెంట్‌ను ఆయనకు అందజేస్తున్నామనీ తెలిపారు.
కృష్ణ ఆరోగ్యం విషయంలో రాగల 24 నుంచి 48 గంటలు కీలకమైనవనీ, ఆయన ఆరోగ్య స్థితిని బట్టి తదుపరి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేస్తామన్న్నారు. వైద్యులను తమ పని చేయించుకోనివ్వాలనీ, కుటుంబ సభ్యులకు ప్రైవసీ ఇవ్వాలనీ మీడియా ప్రతినిధులను కోరారు. 9 సంవత్సరాలుగా కృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు తమ హాస్పిటల్‌కి వస్తున్నారని గురు ఎన్. రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ప్రతి గంట విలువైనదని ఆయన అన్నారు. చికిత్సకు కృష్ణ స్పందిస్తున్నారా అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్‌కు దీటైన చికిత్సను ఆయనకు అందిస్తున్నామని అన్నారు.
కృష్ణ ఆరోగ్యానికి సంబంధించిన తదుపరి హెల్త్ బులెటిన్ మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు వచ్చే అవకాశం ఉంది. ఆదివారం శ్వాసకోశ సమస్య రావడంతో కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ హాస్పిటల్ సమీపంలోనే నానక్‌రాంగూడలో ఆయన నివాసం ఉంటున్నారు. కాగా తండ్రి ఆరోగ్య స్థితి తెలుసుకొనేందుకు మహేష్ హాస్పిటల్‌కు వెళ్లాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



