`శ్రీ మంజునాథ`కి 20 ఏళ్ళు!
on Jun 22, 2021

`పార్వతీ పరమేశ్వరులు` (1981), `ఆపద్బాంధవుడు` (1992) వంటి సాంఘీక చిత్రాల్లో శివుడి వేషంలో అలరించిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తిస్థాయిలో మహాశివుడిగా దర్శనమిచ్చిన భక్తిరస ప్రధాన చిత్రం `శ్రీ మంజునాథ`(2001). `అన్నమయ్య` (1997) వంటి విజయవంతమైన చిత్రం తరువాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆధ్యాత్మిక చిత్రమిదే కావడం విశేషం. తెలుగు, కన్నడ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రూపొందిన `శ్రీ మంజునాథ`.. `ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా`లో (కన్నడ వెర్షన్) ప్రదర్శితమవడం విశేషం.
కర్ణాటకలో శివుడిని శ్రీమంజునాథునిగా ఆరాధిస్తూ ఉంటారు. ఆయన మహిమతో పుట్టి.. నాస్తికుడు నుంచి ఆస్తికుడుగా మారిన మంజునాథ అనే భక్తుని కథతో రూపొందిన సినిమా ఇది. ఇందులో శివభక్తుడు మంజునాథుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ అభినయించగా.. అతని భార్య పాత్రలో అభినేత్రి సౌందర్య ఆకట్టుకున్నారు. పార్వతీదేవిగా మీనా, గంగ పాత్రలో యమున నటించిన ఈ సినిమాలో అంబరీశ్, సుమలత, ఆనంద్, సుధారాణి, ఆనంద్ వర్థన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
హంసలేఖ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. శ్రీ వేదవ్యాస రచనలో శంకర్ మహదేవన్ గానం చేసిన `ఓం మహాప్రాణ దీపం` చార్ట్ బస్టర్ గా నిలిచింది. నారా జయ శ్రీదేవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన `శ్రీ మంజునాథ`.. 2001 జూన్ 22న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ చిత్రం 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



