బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక విన్.. అసలంక 80 నాటౌట్!
on Oct 24, 2021

బంగ్లాదేశ్‌పై శ్రీలంక టీమ్ 5 వికెట్ల తేడాతో గెలిచి టీ20 వరల్డ్‌కప్‌లో శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేయగా, టార్గెట్‌ను శ్రీలంక మరో 7 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో మూడో నంబర్ బ్యాట్స్‌మన్ చరిత అసలంక 49 బంతుల్లోనే 80 పరులుగు చేసిన నాటౌట్‌గా నిలిచి, తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతనికి ఆరో నంబర్ బ్యాట్స్‌మన్ భనుక రాజపక్స (31 బంతుల్లో 53 రన్స్) తోడ్పాటునిచ్చాడు.
మొదట స్కోరు 2 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ కుశాల్ పెరీర్ ఔటయినా, మరో ఓపెనర్ పథున్ నిస్సంకతో కలిసి అసలంక స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అయితే 71 పరుగుల వద్ద నిస్సంక (24)తో పాటు నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్ అవిష్క ఫెర్నాండో (డకౌట్)ను క్లీన్ బౌల్డ్ చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్ వైపు తిప్పాడు. ఆ వెంటనే ఐదో నంబర్ బ్యాటర్ హసరంగ డిసిల్వ కూడా ఫాస్ట్ బౌలర్ సైఫుద్దీన్ బౌలింగ్‌లో 6 రన్స్‌కే క్యాచ్ అవుటయ్యాడు. అయితే ఆ టీమ్ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
ఆరో నంబర్ బ్యాటర్ రాజపక్సే తోడవడంతో అసలంక కదం తొక్కాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను కడదాకా నిలిచి 80 రన్స్ చేశాడు. అతడికి ఇదే తొలి టి20 ఫిఫ్టీ. అతడి స్కోరులో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. రాజపక్సే కూడా తనేం తక్కువ తినలేదన్నట్లు మరింత స్పీడుగా ఆడి 28 బాల్స్‌లోనే 50 రన్స్ చేశాడు. టార్గెట్ దగ్గరకు వచ్చాక 53 రన్స్ వద్ద నాసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే అప్పటికే శ్రీలంక విజయం ఖాయమైంది.
కీలక సమయాల్లో లిటన్ దాస్ రెండు క్యాచ్‌లను జారవిడవడం బంగ్లాదేశ్ పాలిట శాపమైంది. వాటిలో ఒకటి అసలంక ఇచ్చిన క్యాచ్ అయితే, మరొకటి రాజపక్సే ఇచ్చిన క్యాచ్. శ్రీలంక బౌలర్లలో నాసుమ్ అహ్మద్, షకీబ్ చెరో 2 వికెట్లు, సైఫుద్దీన్ 1 వికెట్ పడగొట్టారు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా అసలంక నిలిచాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



