ENGLISH | TELUGU  

సాహసమే ఆయన ఊపిరి.. జోహార్ సూపర్‌స్టార్ కృష్ణ!

on Nov 14, 2022

 

సూపర్‌స్టార్ కృష్ణ ఇకలేరు. కోట్లాదిమంది అభిమానుల గుండెలు బద్దలుచేస్తూ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు బుర్రిపాలెం బుల్లోడు. ఆయన మృతితో ఒక శకం పూర్తిగా ముగిసింది. ఆయన లేకపోవడం నిజంగా చిత్రసీమకు తీరని లోటు. ఆయనకు తెలుగువన్ అర్పిస్తోన్న అక్షర నీరాజనం ఇది...  
 
అదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ చాలామంది బయలుదేరుతుంటారు. కానీ కొందరిని మాత్రమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చి అందలం ఎక్కిస్తుంది. అట్లాంటి వారిలో ముందు వరుసలో ఉండే నటుడు సూపర్‌స్టార్ కృష్ణ. నటునిగా 50 ఏళ్లపాటు కొనసాగారంటే నటనా ప్రతిభ, మంచితనంతో పాటు అదృష్టం కూడా కారణం. "సినీ రంగంలో మంచివాళ్లు ఎవరున్నారయ్యా.. కృష్ణలాంటి ఒకరిద్దరు తప్ప" అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. అదీ కృష్ణ వ్యక్తిత్వంలోని గొప్పతనం. కృష్ణ నటనను విమర్శించేవారు ఉండవచ్చు. కృష్ణ వ్యక్తిత్వాన్ని వేలుపెట్టి చూపించేవాళ్లు ఉండరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులు రాజ్యం చేస్తున్న కాలంలోనూ కథానాయకునిగా తనదైన ప్రత్యేకతను నిలుపుకున్న నటుడు కృష్ణ. 

కృష్ణ తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టాకే తెరపై సాహస ప్రయోగాలు మొదలయ్యాయని చాలామంది అంటుంటారు. అది నిజం. కొన్ని విషయాలు విన్నప్పుడు తెలుగు చిత్రసీమలో ఒక కొత్త చరిత్ర సృష్టించడానికే కృష్ణ పుట్టారా అనిపిస్తుంది. నిర్మాత కృష్ణ తీసినన్ని వైవిధ్యమైన సినిమాలు, హీరోగా ఆయన చేసిన సాహసాలు మరెవరూ చేయలేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం అన్వేషిస్తూ, డిఫరెంట్ ఫిలిమ్స్ నిర్మిస్తూ ఇండస్ట్రీకి మార్గదర్శకంగా నిలిచారు కృష్ణ. మంచితనం, మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా, ధైర్యసాహసాలే ఊపిరిగా జీవించే కథానాయకునిగా, సంచలన నిర్మాతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, అజాత శత్రువుగా అందరి అభిమానానికి పాత్రుడైన ఆయన అందరూ తనవారేనని నమ్మేవారు. నిర్మాత నష్టపోతే తనే నష్టపోయానని భావించే వ్యక్తి. 5 దశాబ్దాల నట జీవితంలో 365 చిత్రల్లో నటించిన ఘనత ఆయన సొంతం.

తెలుగు సినిమా తొలి యాక్షన్ హీరోగా కృష్ణ కీర్తి సంపాదించుకున్నారు. యాక్షన్ అండ్ క్రైం సినిమాలతో ఆయన మాస్‌కి దగ్గరయ్యారు. ఆయన సూపర్‌స్టార్‌గా ఎదగడానికి యాక్షన్ సినిమాలే ప్రధాన కారణం. ఎన్టీఆర్ పౌరాణికాలు, ఏయన్నార్ ఫ్యామిలీ ఫిలిమ్స్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్న కాలంలో కృష్ణ క్రైం మూవీస్ చేసి మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆ జానర్‌లో ఆయనకు పోటీ ఎవరూ లేకపోవడంతో స్వల్పకాలంలోనే స్టార్ అయ్యారు. 

ఏ విషయం గురించయినా నిర్మొహమాటంగా చెప్పడం ఆయనకు అలవాటు. ఏ సినిమా గురించి అడిగినా కలెక్షన్లతో సహా వివరించి, ఆది బాగా ఆడుతుందో, లేదో చెప్పేవారు. తను నటించిన సినిమా అయినా బాగోకపోతే, "అబ్బే బాగోలేదండీ. ఆడదు" అని చెప్పేవారు. అంత ఓపెన్ మైండ్ ఆయనది.

ప్రయోగాలు చేయడంలో ముందుండే కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రంలో తెలుగు సినిమాకు కౌబాయ్‌ని పరిచయం చేశారు. నార్త్ అమెరికాకి చెందిన కౌబాయ్ కథతో తెలుగులో సినిమా తియ్యడం, దాంతో బ్లాక్‌బస్టర్ సాధించడం ముమ్మాటికీ అసాధారణం. 'మోసగాళ్లకు మోసగాడు' మూవీతో కొత్త తరహా మాస్ సినిమాలకు శ్రీకారం చుట్టారు కృష్ణ. ఆ సినిమాను అనుకరించి, అనుసరించి చాలామంది కౌబాయ్ చిత్రాలు తీసినా దాని దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లలేకపోయారు. అలా ఇండియన్ కౌబాయ్‌గా చరిత్రలో నిలిచారు కృష్ణ.   

పౌరాణికాలు, జానపదాల స్థాయిలో తెలుగులో చారిత్రక చిత్రాల నిర్మాణం జరగలేదు. బడ్జెట్ ఎక్కువ, వాణిజ్యపరంగా రిస్క్ ఎక్కువ కాబట్టి. అయినప్పటికీ హీరో కృష్ణ మూడు చారిత్రక చిత్రాల్లో నటించారు. 'విశ్వనాథ నాయకుడు', 'శాంతి సందేశం' చేసినా, ఆయన నటించి, నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రం నిజంగా ఆణిముత్యం. మహానటుడు ఎన్టీఆర్ ప్రయత్నించి వదిలేసిన ఆ సినిమాని అనితర సాధ్యమైన రీతిలో నిర్మించి, ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆయన మొత్తం సినీ కెరీర్‌లో మిగతా సినిమాలన్నీ ఒకెత్తు అయితే, 'అల్లూరి సీతారామరాజు' ఒకెత్తుగా అందరూ చెప్పుకుంటారు. అలా కృష్ణ కెరీర్‌లోనే కలికితురాయిగా నిలిచింది ఆ చిత్రం. ఇది కృష్ణకు 100వ చిత్రం అయితే, 'విశ్వనాథనాయకుడు' 250వ చిత్రం కావడం విశేషం.

పౌరాణికాలంటే మనకు మొదట గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. రాముడన్నా, కృష్ణుడన్నా మన కళ్లముందు కదలాడేది ఎన్టీఆర్ సమ్మోహనరూపమే. కృష్ణ హీరోగా అడుపెట్టే సమయానికి పౌరాణికాలు విరివిగా వస్తున్నాయి. అయితే ఆ టైంలో కాకుండా అనంతర కాలంలో ఆయన రెండంటే రెండు పౌరాణిక చిత్రాలు చేశారు. రెండూ మహాభారతం ఆధారంగా చేసిన సినిమాలే. ఒకటి అర్జునునిగా నటిస్తూ భారీవ్యయంతో ఆయన నిర్మించిన 'కురుక్షేత్రము' కాగా, మరొకటి ఎంఎస్ రెడ్డి నిర్మించిన 'ఏకలవ్య'.

తెలుగులో జానపద సినిమాల హీరోలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నది ఎన్టీ రామారావు, కాంతారావు. కృష్ణ కూడా ఐదు జానపద చిత్రాల్లో నటించారు. వాటిలో ఆయన దర్శకుడిగా పరిచయమైన 'సింహాసనం' ఒకటి. తెలుగులో తొలి 70ఎంఎం సినిమాగా రికార్డుల్లోకెక్కిన ఆ మూవీ తొలివారం కలెక్షన్ల పరంగా ఆల్‌టైం రికార్డు కూడా సృష్టించింది.  

ఇలా ఎన్నో ప్రయోగాలు, సాహసాలతో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా కృష్ణ అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని చిన్నకొడుకు మహేశ్ దిగ్విజయంగా కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయునిగా పేరు తెచ్చుకున్నాడు.

- బుద్ధి యజ్ఞమూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.