దివికేగిన సూపర్‌స్టార్ కృష్ణ.. శోకసంద్రంలో అభిమాన సందోహం
on Nov 14, 2022

సూపర్‌స్టార్ కృష్ణ ఇకలేరు. అశేష సంఖ్యలో ఉన్న అభిమానుల్ని శోకసంద్రంలో ముంచివేస్తూ ఆంధ్రాజేమ్స్ బాండ్ మరలిరాని లోకాలకు తరలిపోయారు. బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ కన్ను మూశారు. ఆదివారం అర్ధ రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరిన ఆయన, మంగళవారం తెల్లవారిజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. 1942 మే 31న తెనాలి దగ్గరలోని బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ జన్మించారు. ఆయన తల్లితండ్రులు నాగరత్నం, వీరరాఘవయ్య చౌదరి. ఐదుగురు సంతానంలో కృష్ణే పెద్దవారు.
కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. చిన్నప్పట్నుంచీ ఎన్టీ రామారావుకు వీరాభిమాని. తను కూడా ఆయనలా నటుడ్ని కావాలని అనుకొనేవారు. ఒకసారి ఏలూరులో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన ఘన సన్మానం కళ్లారా చూసి సినిమాల్లోకి రావాలన్న నిశ్చయాన్ని మరింత బలపరచుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా 1965లో విడుదలైన 'తేనె మనసులు ' సినిమాతో కథానాయకునిగా పరిచయమయ్యారు. అదే యేడాది ఇందిరాదేవిని పెళ్లాడారు. వారికి ఐదుగురు సంతానం. రమేశ్‌బాబు, పద్మావతి, మంజుల, మహేశ్‌బాబు, ప్రియదర్శిని. ఆ తర్వాత 1969లో నటి విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నారు కృష్ణ. ఆయన నట వారసునిగా కొనసాగుతున్న మహేశ్.. తండ్రికి తగ్గ తనయునిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, సూపర్‌స్టార్ అనే సంబోధనను కూడా సొంతం చేసుకున్నారు.
50 సంవత్సరాల నట జీవితంలో కృష్ణ 365 సినిమాల్లో నటించారు. 2016లో విడుదలైన 'శ్రీశ్రీ' ఆయన చివరి చిత్రం. నటునిగా, నిర్మాతగా ఆయన చేసినన్ని ప్రయోగాలు, సాహసాలు మరే నటుడూ చేయలేదనే కీర్తిని పొందారు. అన్ని రకాల జానర్ సినిమాల్లో ఆయన నటించారు. సాంఘిక, జానపద, పౌరాణిక సినిమాల్లో నటించిన కృష్ణను స్వల్ప కాలంలోనే స్టార్ హీరోగా చేసినవి యాక్షన్ అండ్ క్రైం సినిమాలే. అలాగే 'గూఢచారి 116'తో ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా, 'మోసగాళ్లకు మోసగాడు ' సినిమాతో ఇండియన్ కౌబాయ్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. 'అల్లూరి సీతారామరాజు ' సినిమా ఆయన సినీ జీవితంలోనే కలికితురాయిగా నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



